mobile charging
-
నిమిషంలో మొబైల్..10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు ఫుల్‌ఛార్జ్..!
మనం వాడుతున్న మొబైల్ కేవలం ఒక నిమిషంలో ఛార్జింగ్ అయితే..ల్యాప్‌టాప్ ఐదు నిమిషాల్లో, ఎలక్ట్రిక్ కారు 10 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతానికి అది సాధ్యం కాకపోవచ్చు కానీ సమీప భవిష్యత్తులో కచ్చితంగా ఈ ఊహ నిజమవనుంది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఇది ఎలా సాధ్యపడుతుంది?భారతసంతతికి చెందిన అంకుర్ గుప్తా అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో కెమికల్ అండ్ బయోలాజికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం..అతి సూక్ష్మ రంధ్రాల సముదాయంలో సంక్లిష్ట అయాన్లనే ఆవేశిత కణాలు ఎలా కదులుతాయో గుర్తించారు. ఇప్పటివరకూ అయాన్లు ఒక రంధ్రం గుండానే నేరుగా కదులుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్గతంగా అనుసంధానమైన లక్షలాది రంధ్రాల సంక్లిష్ట సముదాయం గుండా కదులుతాయని అంకుర్ గుప్త బృందం ఇటీవల గుర్తించింది. వీటిని కొద్ది నిమిషాల్లోనే ప్రేరేపితం చేయొచ్చు. వాటి కదలికలను అంచనా వేయొచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..సూపర్ కెపాసిటర్లుఈ పరిజ్ఞానం మరింత సమర్థమైన సూపర్ కెపాసిటర్లకు మార్గం సుగమం చేయనుంది. సూపర్కెపాసిటర్లు విద్యుత్తును నిల్వ చేసుకునే పరికరాలు. ఇవి వాటిల్లోని సూక్ష్మ రంధ్రాల్లో అయాన్లు పోగుపడటం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఇవి మామూలు బ్యాటరీలతో పోలిస్తే పరికరాలను త్వరగా ఛార్జ్ చేస్తాయి. అలాగే ఎక్కువ కాలం మన్నుతాయి. వీటి సామర్థ్యం పెరిగితే అత్యంత వేగంగా పరికరాలను ఛార్జ్ చేయగలవు. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో విద్యుత్తును నిల్వ చేయటానికే కాకుండా విద్యుత్తు గ్రిడ్లకూ తాజా ఆవిష్కరణ ఉపయోగపడగలదు. తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్తును సమర్థంగా నిల్వ చేసుకొని, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాడుకునే అవకాశం ఉంది. -
షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?
ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడికెళ్లాలన్న చిటికెలో బుక్ చేసుకుని గమ్యాలను చేరుకుంటున్నారు. అయితే ఈ ట్యాక్సీ సర్వీసులలోని చెల్లింపుల గురించి కొంత సందేహాలు ఒకప్పటి నుంచి ఉన్నాయి. ఈ సమస్యపైన బెల్జియన్ వార్తాపత్రిక ఇటీవల కొన్ని నిజాలను బయటపెట్టింది. ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడించింది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించింది. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్‌లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది. ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ. 1498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 17.56 యూరోలు (రూ. 1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్‌లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్‌పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్‌కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది. (ఇదీ చదవండి: KTM 390 Adventure X: తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు) గతంలో కూడా ఉబర్ సంస్థ మీద ఇలాంటి ఆరోపణలే వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఉబెర్ మాజీ ఎకనామిక్ రీసెర్చ్ హెడ్, కీత్ చెన్ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో యూజర్లు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు కంపెనీ గుర్తించిదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఉబర్ మాత్రం ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా డబ్బు వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. -
ఫోన్ ఛార్జింగ్ తీస్తూ కరెంట్ షాక్ తో చిన్నారి మృతి
-
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఆఫీసులో ఫోన్ ఛార్జింగ్ పెడితే జీతం కట్!
స్మార్ట్ ఫోన్.. మనకి రోజూవారీ పనుల్లో ఓ భాగం అయ్యింది. బయటకు వెళ్లేప్పుడు మాస్క్ మరిచిపోతున్నా.. ఫోన్ మాత్రం వెంటే ఉంటుంది. మరి వాడకానికి తగ్గట్లు పాపం ఛార్జింగ్ కూడా అవసరం కదా! అందుకే చాలామంది పని చేసే చోట్ల కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇక్కడో బాస్ అందుకు అభ్యంతరం చెప్తున్నాడు. వర్క్‌ప్లేస్‌లో ఫోన్ ఛార్జింగ్ పెట్టడం కుదరదని అంటున్నాడు ఆ బాస్. ఆ బాస్, ఆఫీస్ ఎక్కడిదనేది క్లారిటీ లేదు. కానీ, ఇందుకు సంబంధించిన ఓ పేపర్ నోట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ అలవాటు కరెంట్ దొంగతనం కిందకే వస్తుందని, పనిచోట నైతిక విలువలకు సంబంధించిన విషయమని పేర్కొన్నాడు ఆ బాస్. ఈ నోట్ రెడ్డిట్ వెబ్సైట్లో చర్చకు దారితీసింది. గంటల తరబడి ఆఫీసుల్లో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుందని, అలాంటప్పుడు ఆఫీస్ కరెంట్ ఉపయోగించుకోవడంలో తప్పేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మరికొందరేమో ఆ బాస్ చేసింది కరెక్టేనని, దీనివల్ల ఫోన్-ఇంటర్నెట్ వాడకం తగ్గుతుందని, అంతేకాదు మైండ్ డైవర్షన్ లేకుండా పనిలో నైపుణ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్క్ ప్లేస్‌లో ఫోన్, డివైస్ల ఛార్జింగ్‌ను చాలా కంపెనీలు వ్యతిరేకిస్తాయని, వాల్‌మార్ట్ లాంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ సైతం ఇలాంటి నిబంధనను అమలు చేస్తోందని గుర్తు చేస్తున్నారు ఇంకొందరు. ఇక ఈ నోట్ మూడేళ్ల క్రితమే రెడ్డిట్‌లో ఇలా చర్చకు దారితీయడం మరో విశేషం. చదవండి: Work From Home.. మారిన రూల్స్! ఏంటంటే.. -
ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఆరు రోజులు అక్కర్లే..
ఎంత ఖరీదు పెట్టి కొనుగోలు చేసిన మొబైల్ అయినా ఆరు నుంచి ఏడు గంటల తర్వాత దానికి చార్జింగ్ పెట్టాల్సిందే. నిత్యం వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్,ఇన్‌స్ట్ర్రాగ్రాం లాంటివి వాడుతుండటం వల్ల ఫోన్లో చార్జింగ్ ఒక్కో పాయింట్‌దిగిపోతూ ఉంటుంది. ట్రావెలింగ్ సమయాల్లో ఫోన్ చార్జింగ్ అయిపోతుందేమోననే భయంతో మనతో పాటు పవర్‌బ్యాంక్‌ని కూడా వెంట తెచ్చుకుంటాం. మొబైల్ చార్జింగ్‌లో ఇటువంటి సమస్యలు నిత్యకృత్యం. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి కేవలం 1.మి.మీ. సైజు ఎలక్ట్రానిక్ చిప్ (డివైజ్)ని కనిపెట్టి ఆరు రోజుల వరకు ఫోన్‌కు చార్జింగ్ పెట్టకుండా ఉండేలా తన మిత్రులతో కలిసి సరికొత్తఅధ్యాయానికి తెర తీశాడు సిటీ కుర్రాడు సునీల్‌కుమార్. గత ఏడాది ‘నాస్కో’ అవార్డును కూడా అందుకున్నాడు. హిమాయత్‌నగర్ :లింగంపల్లికి చెందిన సునీల్‌కుమార్ గచ్చిబౌలిలోని ఐఐటీ క్యాంపస్‌లో ఐఐటీ పూర్తి చేశాడు. అనంతరం 2016లో మాస్టర్స్ పూర్తి చేశాడు. మొబైల్ చార్జింగ్ విషయంలో అనేక ఇబ్బందులు పడుతుండేవాడు. సమస్యకు ఏదైనా పరిష్కార మార్గాన్ని కనుగొనాలనుకున్నాడు. దాదాపు ఆరు రోజులు ఫోన్‌కు చార్జింగ్ పెట్టకుండా దానిని వాడుకునేలా ఎలక్ట్రానిక్ చిప్‌ని రూపొందించి సరికొత్త రికార్డును సృష్టించాడు. మిత్రులతో సునీల్‌కుమార్ ఏమిటీ డివైజ్ ప్రత్యేకత.. ‘బ్లూ సెమీ’ పేరుతో ఎలక్ట్రానిక్ చిప్ (డివైజ్)ని రూపొందించాడు. దీనికోసం సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఈ డివైజ్‌ని మొబైల్లోని మదర్‌బోర్డుపై సెట్ చేస్తారు. ఇప్పటి వరకు ట్రయల్స్‌లో ఉన్న ఈ డివైజ్ వచ్చే ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి రానుంది. సునీల్‌కుమార్ 12మంది టీం సభ్యులతో కలిసి ఈ డివైజ్‌ని రూపొందించాడు. మొబైల్ కొనుగోలు చేసిన తర్వాత 100 శాతం చార్జింగ్ పెడితే చాలు. మరో ఆరు రోజుల వరకు మొబైల్‌కు చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండటమే దీని ప్రత్యేకత అని సునీల్ కుమార్ తెలిపారు. ఆటోమేటిక్‌గా చార్జింగ్.. ఓ పక్క మనం చార్జింగ్ పెడుతూనే మరో పక్క ఫోన్లోని యాప్స్‌ని ఓపెన్ చేస్తూ చూస్తుంటాం. ఒక్క నిమిషం కూడా ఫోన్‌ని వాడకుండా ఉండలేం. దీనివల్ల మొబైల్లో చార్జింగ్ అయిపోవడం షరామామూలే. సునీల్ కనిపెట్టిన డివైజ్ మొబైల్‌ని మనం వాడుతుంటే.. సూర్యరశ్మి, మన బాడీ టెంపరేచర్, నైట్టైం లైటింగ్‌కి చార్జింగ్ ఆటోమేటిక్‌గా అవుతూ ఉంటుంది. మొబైల్‌తో పాటే డివైజ్ మనం కొనే శామ్సంగ్, ఐ ఫోన్, వీవో, ఎంఐ తదితర ఫోన్లలోనే ఈ డివైజ్‌ని ఫిట్ చేసి ఉంచుతామని సునీల్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలతో తాము ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి మార్కెట్లో తాము రూపొందించిన డివైజ్‌ను అమర్చిన ఫోన్లు మార్కెట్లోకి రానున్నట్లు వివరించారు. మనం కొనే మొబైల్ ధరపై రూ.500నుంచి రూ.1000 అదనంగా ఆయా కంపెనీలు చార్జి చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. త్వరలో ప్రాసెసర్ కంట్రోలింగ్ త్వరలో మొబైల్ ప్రాసెసర్‌ని కంట్రోల్ చేసే విధంగా డివైజ్‌ని రూపొందించేందుకు సిద్ధపడుతున్నాం. ఇప్పుడున్న చిప్‌ని తయారు చేసేందుకు రూ.కోటి ఖర్చు అయ్యింది. పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏప్రిల్‌లో విడుదల అయ్యాక మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. త్వరలో ప్రాసెస్ కంట్రోలింగ్‌తో పాటు వాట్సప్, ఫేస్బుక్ వంటి వాటి పవర్‌ని కూడా కంట్రోల్ చేస్తూ చార్జింగ్ నిలిచేలా చేస్తాం. – సునీల్‌కుమార్, డివైజ్ రూపకర్త -
పబ్లిక్ చార్జింగా.. బుక్ అయిపోతారు!
పబ్లిక్ వైఫైలు వాడితే ఇబ్బంది ఉంటుందని చాలాకాలంగా వింటున్నాంగానీ.. ఇలా చార్జింగ్ చేసుకున్నా సమస్యలు తప్పవని ఇటీవలే తెలిసింది. ఇందులో టెక్నిక్ చాలా సింపుల్. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్ స్టేషన్లతోపాటు చాలా షాపింగ్ మాళ్లలో స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ స్టేషన్లు ఉంటాయి కదా.. హ్యాకర్లు అక్కడి యూఎస్బీ పోర్ట్‌లను మార్చేస్తారు. ఇదేమీ తెలియని మనం ఆ పోర్ట్‌కు మన ల్యాప్‌టాప్/ఫోన్లను కనెక్ట్ చేశామనుకోండి. గాడ్జెట్లు చార్జ్ అవుతాయిగానీ.. అదే సమయంలో వాటిలోని వివరాలను హ్యాక్ చేసేందుకు తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట. హ్యాకర్లు మార్చేసిన యూఎస్బీ పోర్టులోనే సమాచారాన్ని తస్కరించేందుకు, స్టోర్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉండటంతో ఇది సాధ్యమవుతుందన్నమాట. లేదంటే.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌లోకి దురుద్దేశపూర్వకమైన మాల్వేర్ను జొప్పించేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాల్వేర్ ద్వారా డేటా మొత్తాన్ని లాక్ చేసేసి ఓపెన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయవచ్చు. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అయి (పాస్వర్డ్, యూజర్‌నేమ్ వంటివి మీరు గాడ్జెట్‌లో స్టోర్ చేసుకుని ఉంటే) డబ్బులు కాజేసేందుకూ అవకాశం ఉంటుంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. కొత్తదేమీ కాదు.. సైబర్ ప్రపంచంలో జ్యూస్ జాకింగ్ పేరు వినపడటం మొదలైంది ఈ మధ్యనే అయినప్పటికీ 2011లోనే కొంతమంది టెకీలు ఈ ప్రక్రియతో పాటు పేరును కూడా ఖాయం చేశారు. ఆ ఏడాది జరిగిన అంతర్జాతీయ హ్యాకర్ల సమావేశం డెఫ్‌కాన్‌లో కొంతమంది మార్చేసిన యూఎస్బీ పోర్టులతో ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. గాడ్జెట్ ఏదీ చార్జింగ్కు లేనప్పుడు ఈ స్టేషన్ తాలూకూ ఎల్సీడీ తెరపై ఉచిత చార్జింగ్ కేంద్రం అన్న ప్రకటన చూపుతూ ఉండగా.. స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్‌ను అనుసంధానించగానే సమాచారాన్ని దోచుకునే మాల్వేర్ను జొప్పించేశారు. ఆ తరువాత దీని గురించి గాడ్జెట్ యజమానులకు వివరించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు కూడా. అయితే అప్పటి నుంచి ఇటీవలి కాలం వరకూ ఈ జ్యూస్ జాకింగ్‌ను వాడింది చాలా తక్కువ. ఢిల్లీ రాజధానిలో ఒక యువకుడి స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకర్లు ఇలా జ్యూస్ జాక్ చేశారన్న వార్తలు రావడంతో వారం పది రోజులుగా దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. మరి ఏం చేయాలి? ఏముంది.. ఎక్కడపడితే అక్కడ చార్జింగ్ చేసుకోకపోతే సగం సమస్యలు తీరిపోయినట్లే. ఇది జరగాలంటే వీలైనంత వరకూ మన ఫోన్/ల్యాప్‌టాప్ ఇంట్లోనే ఫుల్‌గా చార్జ్ చేసుకోవాలి. లేదంటే.. ల్యాప్‌టాప్ బ్యాటరీ ఒకటి ఎక్స్ట్రా పట్టుకెళ్లడం స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే మంచి పవర్‌బ్యాంక్ ఒకటి అందుబాటులో ఉంచుకోవడం. ఇవేవీ కుదరపోతే ఇంకో మార్గమూ ఉంది. చార్జింగ్ స్టేషన్లలోని యూఎస్బీ పోర్టులను ఉపయోగించకుండా.. అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్‌ల ద్వారా మీదైన చార్జర్‌తో ఫోన్/ల్యాప్‌టాప్ చార్జ్ చేసుకోండి. ఎందుకంటే విద్యుత్తు ప్రవహించే చోట్ల డేటా ట్రాన్స్ఫర్ సాధ్యం కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ యూఎస్బీ పోర్టు ద్వారానే చార్జ్ చేసుకోవాల్సి వస్తే.. మీ గాడ్జెట్‌ను ఆఫ్ చేసేయండి. దీంతో కూడా డేటా ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి ఎవరూ మీ గాడ్జెట్‌లోకి మాల్వేర్ను వేయడంగానీ.. సమాచారాన్ని తస్కరించడం గానీ జరగదు. -
ప్రోటాన్ బ్యాటరీలు వస్తున్నాయి...
అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు. పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను ( విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
గిద్దలూరు: సెల్ చార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతిచెందిన సంఘటన రాచర్ల మండలంలోని రాచర్ల ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టెం రాజు (27) సోమవారం రాత్రి ఇంట్లో సెల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్యం కోసం గిద్దలూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. రాజుకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గ్రామంలో ఎర్త్ లేని కారణంగానే విద్యుదాఘాతానికి గురయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు. -
రైతుల ర్యాలీలో సెల్ఫోన్ల చార్జింగ్ ప్రత్యేకం
సాక్షి, న్యూఢిల్లీ : నాసిక్ నుంచి ముంబైకి 35 వేల మంది తరలి రావడం ఎంత కష్టమో అంతమందికి వారం రోజులపాటు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం కూడా అంత కష్టమే. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి సమాజంలో సెల్ఫోన్లు వాడకుండా ఉండాలంటే కూడా ఎంతో కష్టం. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నేడు రైతులకు కూడా మొబైల్ ఫోన్ల వాడకం తప్పనిసరైందని తెల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఫోన్లను చార్జింగ్ చేసుకోవడ ఎలా? దీనికి కూడా రైతులే పరిష్కారం కనుగొన్నారు. స్థానికంగా లభించే పలకలాంటి సోలార్ ప్యానెళ్లను వారు సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు ఉపయోగించారు. ఆ సోలార్ ప్యానెల్ ద్వారా ఒకే సారి నాలుగైదు సెల్ఫోన్లను చార్జింగ్ చేయవచ్చట. ఒక్కసారి చార్జి చేస్తే రెండు, మూడు గంటల వరకు ఫోన్ పనిచేస్తుందట. చాలా మంది రైతులు ఇలాంటి సోలార్ ప్యానెళ్లను తమ వెంట తెచ్చుకున్నారు. మండుటెండలో కాలినడకను వారం రోజులపాటు నడిచిన రైతులకు ఇంటివారితో మాట్లాడేందుకు ఫోన్లు అందుబాటులో ఉండడం ఎంతో ఉపశమనం కలిగించి ఉంటుంది. రైతుల ర్యాలీలో తలలపై చార్జింగ్ సోలార్ ప్యానెళ్లను పెట్టుకొని కొంత మంది రైతులు ప్రత్యేకంగా కనిపించారు. -
ఇక మాట్లాడుతూనే ఉండండి..
సాక్షి, రాజమండ్రి : మొబైల్ చార్జింగ్ అయిపోయిందా.. కంగారు పడకండి. ప్రముఖ సెల్యులర్ కంపెనీలు వివిధ ఘాట్ల వద్ద ఉచితంగా ఫోన్ చార్జింగ్ సదుపాయం కల్పిస్తున్నాయి. తమ సిబ్బందితో రేయింబవళ్లు సేవలందిస్తున్నాయి. చార్జింగ్ పిన్లు, ప్లగ్‌లతోపాటు పవర్ బ్యాంకులతో నిమిషాల్లో చార్జింగ్ చేయిస్తున్నాయి. పుష్కర ఘాట్, వీఐపీ ఘాట్, గౌతమి ఘాట్ తదితర ప్రాంతాల్లో ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు. -
వై-ఫైతో సెల్‌ఫోన్ చార్జింగ్!
మీకు అత్యవసరంగా మీ సెల్‌ఫోన్ నుంచి మరొకరికి మెసేజి పంపాల్సిన అవసరం వచ్చిందా? కానీ మీ సెల్ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదా? సిగ్నల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయా? ఇప్పుడెలా అని కంగారు పడుతున్నారా? మీ కంగారును దూరం చేసేందుకు త్వరలోనే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. మీకు వై-ఫై సదుపాయం ఉంటే చాలు...దాంతో బ్యాటరీలు చార్జి చేసుకోవచ్చు. అసలు బ్యాటరీలే అవసరం లేకుండా సెల్ఫోన్లు, కెమేరాలను వినియోగించుకోవచ్చు. దీని కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యేకమైన రూటర్లను కూడా తయారుచేశారు. ఈ టెక్నాలజీ మన చుట్టూ ఉండే రేడియో తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చగలదు. బ్యాటరీలు లేని ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాలను పంపించగలదు. శ్యామ్ గొల్లకోట అనే ఇంజనీరింగ్ విద్యార్థి నాయకత్వంలోని ఓ బృందం ఇటీవల అమెరికాలోని ఆరు ఇళ్లలో ప్రత్యక్షంగా వై-ఫై బ్యాక్‌స్కాటర్ పనిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి విజయం సాధించారు. ఓ పక్క వై-ఫై ద్వారా 24 గంటల పాటు నెట్‌ను ఉపయోగిస్తూనే మరోపక్క స్కాటర్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచార మార్పిడిని పరీక్షించారు. ఈ ప్రయోగం వల్ల నెట్ బ్రౌజింగ్‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని బృందం తెలిపింది. సూర్య కిరణాలను విద్యుత్ శక్తిగా మారుస్తున్నట్లుగానే ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా తాము రేడియో తరంగాలను విద్యుత్ శక్తిగా మార్చగలిగామని, అలాగే అవే తరంగాలను ఉపయోగించి విద్యుత్ అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాల మార్పిడి చేయగలిగామని వారు ఇటీవల ఇక్కడ జరిగిన ఎంటెక్ డిజిటల్ సదస్సులో వివరించారు. తాము ప్రయోగాత్మకంగా సృష్టించిన విద్యుత్ స్థాయిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తామని, త్వరలోనే ఈ టెక్నాలజీని మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
సెల్ చార్జింగ్ పెడుతుండగా..
ఆసిఫాబాద్/రూరల్, న్యూస్‌లైన్ : ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ తేజ్‌కరణ్(29) సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుత్‌షాక్‌కు గురై మంగళవారం రాత్రి మృతిచెందాడు. తేజ్‌కరణ్ మంగళవారం రాత్రి కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చాడు. తన సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేసేందుకు ప్లగ్‌లో పె ట్టాడు. అప్పటికే చార్జర్ పగిలి ఉండడంతో షాక్ గురై కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సబ్యులు ప్రభుత్వ ఆస్పత్రికితరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయూడు. కొడుకు నామకరణం జరగకముందే.. తేజ్‌కరణ్ నాలుగేళ్ల క్రితం బతుకు దెరువుకోసం మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుడిగా.. ఆపై తాపీమేస్త్రీ గా పనిచేస్తూ మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తారాబాయిని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. పక్షం రోజుల క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. కుమారుడికి నామకరణం చేయకముందే సెల్ చార్జింగ్ రూ పంలో అతడు మృత్యువాత పడ్డాడు. కొడుకు పుట్టాడనే సంతోషంలో ఉన్న తారాబారుు భర్త మృతితో గుండెలవిసేలా రోదించింది. తేజ్‌కరణ్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఒక పొయ్యి.. రెండు వెలుగులు
పొగ... కాలుష్యం లేని కట్టెల పొయ్యి వంటకే కాక ఫోన్ చార్జింగ్‌కూ ఉపయోగపడితే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతోనే ఊపిరిపోసుకుంది బయోలైట్ స్టవ్. ఏటా ఎంతోమంది ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడకుండా కాపాడుతోంది ఈ స్టవ్. వంట పొయ్యిల మీద పరిశోధన చే సే ఒక అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు సగం ప్రపంచం కట్టెల పొయ్యిల మీదే వంట వండుకుంటోంది. ఆరుబయట వండే పొయ్యిల నుంచి వచ్చే పొగ, కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారని 2011లో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. వంటింట్లో ఉండే పొయ్యిలను కూడా కలిపితే ఈ సంఖ్య 35 లక్షలుగా ఉంటుందంటూ 2012లో లెక్క గట్టింది. గ్రామాల్లో ఇలాంటి వంట పొయ్యిలతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తు కాగా.. కరెంటు కోతలు మరో ఎత్తు. కరెంటు సౌకర్యం లేని ప్రాంతాలూ ఎక్కువే. మారుమూల ప్రాంతాల్లోనూ సెల్ఫోన్ల వినియోగం పెరిగిపోతున్న తరుణంలో వాటి చార్జింగ్కు కరెంటు కొరతతో ఇబ్బందే. ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్లుగా.. ఒక్క స్టవ్‌తో ఈ రెండు సమస్యలను పరిష్కరించారు న్యూయార్క్‌కి చెందిన జొనాథన్ సెడార్, అలెక్ డ్రమండ్. స్టవ్ పనిచేసేదిలా.. మంటలోని వేడిమిని విద్యుచ్ఛక్తి కింద మార్చేలా హోమ్స్టవ్ని డిజైన్ చేశారు. మంటను ఎగదోయడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న ఫ్యాన్ ఈ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల 50 శాతం మేర ఇంధనం ఆదా అవుతుంది. ఇక స్టవ్ నుంచి వెలువడే పొగ 94 శాతం మేర, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు 91 శాతం తగ్గుతాయి. మరోవైపు, ఈ స్టవ్‌కు ఒక యూఎస్బీ పోర్టును అమర్చారు. దీనితో.. ఫోన్లూ, ఎల్ఈడీ లైట్లు వంటి వాటిని చార్జింగ్ చేసుకోవచ్చు. ఏటా 72 డాలర్ల ఆదా.. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో టూర్లకు వెళ్లినప్పుడు ఉపయోగించుకునేలా క్యాంప్స్టవ్ని సెడార్, డ్రమండ్ రూపొందించారు. అయితే, ఆ తర్వాత వర్ధమాన దేశాల్లో దీని ఉపయోగాన్ని గుర్తించి మరింత మందికి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం, మన దేశంతో పాటు ఉగాండా, ఘనాలో బయోలైట్ స్టవ్‌లను విక్రయిస్తున్నారు. మన దేశంలో ఉస్మానాబాద్, అహ్మదాబాద్, మంగళూరు దగ్గర్లోని ఒజిరేలో ఈ స్టవ్‌లను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. హోమ్స్టవ్ని ఉపయోగించడం ద్వారా భారత్‌లో ఒక కుటుంబం సగటున ఏటా 72 డాలర్ల మేర (సుమారు రూ.4,500) ఆదా చేయొచ్చని (సెల్ ఫోన్, ఎల్ఈడీ లైటింగ్ చార్జింగ్కయ్యే కరెంటు ఖర్చులు, ఇంధన వ్యయాలు కలిపి) బయోలైట్ సంస్థ చెబుతోంది. హోమ్స్టవ్కి వచ్చే స్పందనను బట్టి రేటును సుమారు 45-60 డాలర్ల స్థాయిలో నిర్ణయించే అవకాశముంది. ఇది ఎక్కువగానే అనిపించినా.. విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాల వారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంధన వ్యయాలతో పోలిస్తే ఈ పెట్టుబడిని 4 నుంచి 8నెలల్లోగా రాబట్టుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం క్యాంప్ స్టవ్‌లను 130 డాలర్లకు విక్రయిస్తోంది.