మనం వాడుతున్న మొబైల్ కేవలం ఒక నిమిషంలో ఛార్జింగ్ అయితే..ల్యాప్‌టాప్ ఐదు నిమిషాల్లో, ఎలక్ట్రిక్ కారు 10 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతానికి అది సాధ్యం కాకపోవచ్చు కానీ సమీప భవిష్యత్తులో కచ్చితంగా ఈ ఊహ నిజమవనుంది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇది ఎలా సాధ్యపడుతుంది?
భారతసంతతికి చెందిన అంకుర్ గుప్తా అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో కెమికల్ అండ్ బయోలాజికల్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన బృందంతో కలిసి కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం..అతి సూక్ష్మ రంధ్రాల సముదాయంలో సంక్లిష్ట అయాన్లనే ఆవేశిత కణాలు ఎలా కదులుతాయో గుర్తించారు. ఇప్పటివరకూ అయాన్లు ఒక రంధ్రం గుండానే నేరుగా కదులుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్గతంగా అనుసంధానమైన లక్షలాది రంధ్రాల సంక్లిష్ట సముదాయం గుండా కదులుతాయని అంకుర్ గుప్త బృందం ఇటీవల గుర్తించింది. వీటిని కొద్ది నిమిషాల్లోనే ప్రేరేపితం చేయొచ్చు. వాటి కదలికలను అంచనా వేయొచ్చు.
ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..
సూపర్ కెపాసిటర్లు
ఈ పరిజ్ఞానం మరింత సమర్థమైన సూపర్ కెపాసిటర్లకు మార్గం సుగమం చేయనుంది. సూపర్‌కెపాసిటర్లు విద్యుత్తును నిల్వ చేసుకునే పరికరాలు. ఇవి వాటిల్లోని సూక్ష్మ రంధ్రాల్లో అయాన్లు పోగుపడటం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఇవి మామూలు బ్యాటరీలతో పోలిస్తే పరికరాలను త్వరగా ఛార్జ్ చేస్తాయి. అలాగే ఎక్కువ కాలం మన్నుతాయి. వీటి సామర్థ్యం పెరిగితే అత్యంత వేగంగా పరికరాలను ఛార్జ్ చేయగలవు. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో విద్యుత్తును నిల్వ చేయటానికే కాకుండా విద్యుత్తు గ్రిడ్‌లకూ తాజా ఆవిష్కరణ ఉపయోగపడగలదు. తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు విద్యుత్తును సమర్థంగా నిల్వ చేసుకొని, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాడుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment