
డిమాండ్ తగ్గుతుండటంతో ఆఫర్ల వెల్లువ
కనీసం రూ.1 లక్ష.. గరిష్టంగా రూ.15 లక్షల వరకు తగ్గింపు
జాబితాలో హైబ్రిడ్ వాహనాలు కూడా...
వచ్చే నెల నుంచి రేట్ల పెంపు బాటలో ఆటోమొబైల్ కంపెనీలు
ఎలక్ట్రిక్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ల ‘మార్చ్’ నడుస్తోంది. ఈవీలకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో నిల్వలను తగ్గించుకోవడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల జోరు పెంచాయి. ఎలక్ట్రిక్‌తో పాటు హైబ్రిడ్ వాహనాలపై కూడా కనిష్టంగా రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి రేట్ల పెంపు అమల్లోకి రానున్న నేపథ్యంలో వాహన కంపెనీలు ఈవీలపై భారీ డిస్కౌంట్లతో ఊరిస్తున్నాయి. గడిచిన కొన్ని వారాల్లో విడుదల చేసిన కొన్ని కొత్త మోడల్స్ మినహా దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కార్లపై కనీసం రూ.1 లక్ష తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో 2025 మోడల్స్‌తో పాటు 2024లో తయారైనవి కూడా ఉన్నాయి. కాగా, ఈ డిస్కౌంట్లలో క్యాష్ తగ్గింపు, స్క్రాపేజీ, ఎక్సే్ఛంజ్ బోనస్‌లు, ఉచిత యాక్సెసరీలు, అలాగే అదనపు వారంటీ వంటివన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా అమ్మకాలు మందకొడిగా ఉండే సంవత్సరాంతం (డిసెంబర్ నెల)లో వాహన సంస్థలు భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ఈవీలపై ఇస్తున్న తగ్గింపు అప్పటితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ఉండటం విశేషం. దీనికి ప్రధానంగా డిమాండ్ తగ్గడమే కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
కియా.. బంపర్ ఆఫర్
దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా మోటార్స్ తన ఈవీ6 2025 వేరియంట్‌పై ఏకంగా రూ.15 లక్షల భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీని రేంజ్ 650 కిలోమీటర్లు. అంతక్రితం రూ. 77 లక్షలుగా ఉన్న ఈవీ6 ఆన్‌రోడ్ ధర ఇప్పుడు రూ.62 లక్షలకు దిగొచి్చంది. ఇక హ్యుందాయ్ కూడా ఐయానిక్5 మోడల్‌పై రూ. 4 లక్షల తగ్గింపు ఆఫర్ చేస్తోంది. డిసెంబర్లో దీనిపై రూ.2 లక్షల డిస్కౌంట్ మాత్రమే కంపెనీ అందించింది. అయితే, జనవరిలో విడుదల చేసిన క్రెటా ఈవీపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. ఈవీ మార్కెట్లో అత్యధిక వాటాతో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ పలు మోడల్స్‌పై రూ. 1.86 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది. ఇటీవల ప్రవేశపెట్టిన కర్వ్ ఈవీపై గరిష్టంగా రూ.1.71 లక్షల తగ్గింపు లభిస్తోంది. నెక్సాన్ ఈవీపై రూ.1.41 లక్షలు , టియాగో ఈవీపై రూ.1.31 లక్షలు చొప్పున డిస్కౌంట్ ఇస్తోంది.
హైబ్రిడ్‌లపైనా...
మహీంద్రాతో పాటు కొన్ని కంపెనీలు ఈ ఏడాది కొత్త ఈవీలను తీసుకురావడంతో పాత మోడల్స్ పట్ల ఆసక్తి తగ్గిందని.. దీనికి తోడు అధిక ధరల ప్రభావం వల్ల కూడా డిమాండ్ తగ్గుముఖం పట్టిందని ప్రముఖ కార్ల కంపెనీకి చెందిన ఓ డీలర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈవీలతో పాటు హైబ్రిడ్ మోడల్స్ కూడా కారు చౌకగా దొరుకుతున్నాయి. మారుతీ సుజుకీ హైబ్రిడ్ కార్లు గ్రాండ్ విటారాపై రూ.1.35 లక్షలు, ఇని్వక్టోపై రూ.1.4 లక్షల చొప్పున ఆఫర్ నడుస్తోంది. అలాగే హోండా సిటీ ఈ–హెచ్‌ఈవీ దాదాపు రూ.1 లక్ష తక్కువకే దొరుకుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్
కొత్త మోడల్స్ దన్ను...
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఈవీ కార్ల సేల్స్ 20,234 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 26 శాతం పెరిగినట్లు వాహన డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) పేర్కొంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలకు కొత్త మోడల్స్ దన్నుగా నిలుస్తున్నాయి. ఇందులో ఎంజీ విండ్సర్ వంటి మోడల్స్ అమ్మకాలు కీలకంగా నిలుస్తుండటమే కారణం. 2024లో 20 శాతం వృద్ధితో 99,165 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. కాగా, మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ (43 శాతం వాటా) ఈవీ సేల్స్ ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 19 శాతం మేర పడిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment