జోరుగా.. హుషారుగా.. | Greater Warangal Focus On Electric vehicles | Sakshi
Sakshi News home page

జోరుగా.. హుషారుగా..

Published Wed, Mar 5 2025 10:26 PM | Last Updated on Wed, Mar 5 2025 10:26 PM

Greater Warangal Focus On Electric vehicles

ఈవీలలో జంట నగరాల బాటలో గ్రేటర్‌ వరంగల్‌ 

స్మార్ట్‌ సిటీ వరంగల్‌లో ‘ఇ–స్మార్ట్‌’వాహనాల పరుగులు 

తెలంగాణలో మెరుగైన రోడ్లు.. మొత్తంగా 1,10,756.39 కి.మీ.లు 

రయ్యిమంటున్న వాహనాలు.. పెరిగిన ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు 

తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్ర్‌స్టాక్ట్‌ (అట్లాస్‌)–2024 రిపోర్టులో వెల్లడి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పదేళ్ల కిందటే ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి వచ్చినా 2019 వరకు అవి మెట్రో నగరాలను దాటి రాలేదు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు పలు కంపెనీలు మంచి ఫీచర్‌ బైక్‌లతో షోరూంలు ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్‌ బైక్స్, ఆటోలు, కార్ల అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. 

ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల బాటలో వరంగల్‌ పయనిస్తోంది వరంగల్‌ మహా నగరం రోడ్ల మీద ఎలక్ట్రిక్‌ వాహనాల సంచారం పుంజుకుంటోంది. ఇవి స్మార్ట్‌ వాహనాలు కూడా కావడంతో టెక్నాలజీ ప్రియులను మరింతగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సీసీ, తారు రోడ్ల సౌకర్యం పెరిగి వాహనాలు, ఈవీ వాహనాల సంఖ్య పెరిగినట్లు తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్ర్‌స్టాక్ట్‌ (అట్లాస్‌)–2024 గణాంకాలు చెబుతున్నాయి.  

మెరుగైన రవాణా సౌకర్యం.. పెరుగుతున్న వాహనాలు 
తెలంగాణలో జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు మెరుగయ్యాయి. ఇదే సమయంలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ తదితర ద్వితీయశ్రేణి నగరాల్లోనూ తారు, సీసీ రోడ్లు పెరిగాయి. మొత్తంగా తెలంగాణలో మొత్తం రోడ్ల పొడ వు 1,10,756.39 కిలోమీటర్లు కాగా, ఇందులో సి మెంట్‌ రోడ్లు 11,438.06 కి.మీ.లు, తారు రోడ్లు (బ్లాక్‌ టాప్‌) 59,499.25 కి.మీ.లు, మెటల్‌ రోడ్లు 8,291.77 కి.మీ.లుగా ఉన్నాయి. 

ఇందులో 28,707.43 కి.మీ.లు రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో ఉండగా, 68,539.27 కి.మీ.లు పంచాయతీరాజ్‌ (పీఆర్‌ఈడీ), 4,497.0 కి.మీ.ల పొడవు గల 30 రోడ్లు జాతీయ రహదారుల పరిధిలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 9,013 కి.మీ.ల పొడవు రహదారులు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో మూడేళ్లలో బైక్‌లు, కార్లు, జీపులు, లారీలు తదితర వాహనాల రిజిస్ట్రేషన్‌లు కూడా పెరిగినట్లు వెల్లడించారు. 

2020–21లో 8,79,826 వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా, 2022–23లో 9,51,780, 2023–24లో 9,76,073 వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల తర్వాత వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో కూడా ఈవీ వాహనాల సందడి పెరిగింది.  

స్మార్ట్‌ సిటీస్‌.. ‘ఇ–స్మార్ట్‌’ వెహికిల్స్‌  
మోడల్, బ్రాండ్, బ్యాటరీ కెపాసిటీ, ఇంజన్‌ సామర్థ్యం బట్టి రూ.44,900ల నుంచి రూ.3.10 లక్షల ధరతో ఎలక్ట్రిక్‌ బైక్స్‌ లభిస్తున్నాయి. రూ.12 లక్షల నుంచి రూ.23.49 లక్షల వరకు కార్లు ప్రస్తుత మార్కెట్లో ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్‌ ఆఫ్టిమా ఎల్‌ఏ, ప్యూర్‌ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, ఓలా, ఒకినవా, ఆంపియర్‌ తదితర కంపెనీలు షోరూంలను ఏర్పాటు చేశాయి. 

ఈ–కార్ల విషయానికొస్తే టాటా నెక్సాస్‌ ఈవీ, మహీంద్రా ఈ2వో ప్లస్, ఎంజీ జెడ్‌ఎస్‌ ఈవీ, హ్యుందాయ్‌ కోనా ఎలక్ట్రిక్, టాటా టిగోర్‌ తదితర ఈవీలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కంపెనీని బట్టి రూ.8.98 లక్షల నుంచి రూ.26.27 లక్షల వరకు పలుకుతోంది. గంటన్నర నుంచి 9 గంటల వరకు చార్జింగ్‌ చేస్తే గంటకు 80 నుంచి 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 110 నుంచి 471 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నారు. 

ఈవీలో వినియోగం పెంచేందుకు తెలంగాణ వ్యాప్తంగా విరివిగా విద్యుత్‌ కంపెనీల ఆధ్వర్యంలో చార్జింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) మేనేజర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు.  

హైదరాబాద్‌ తర్వాత.. గ్రేటర్‌ వరంగల్‌లోనే  
మెట్రో, స్మార్ట్‌సిటీల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల తర్వాత వరంగల్‌ ట్రైసిటీస్‌లోనే ఎ క్కువగా ఈవీ బైక్‌లు, కార్లు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం 2022, మార్చి వరకు గ్రేటర్‌ వరంగల్‌లో మొత్తం 853 ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా, 2023 మార్చి నాటికి 3,289 ఈవీ వాహనాలు నమోదు కాగా.. 2024 డిసెంబర్‌ వరకు 4,309 ఎలక్ట్రిక్‌ బైకులు, ఆటోలు, కార్ల విక్రయాలు జరిగాయి. 

2023–24 అట్లాస్‌ రిపోర్టు ప్రకారం హైదరాబాద్‌లో 15,290, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 14,860, రంగారెడ్డిలో 11,882, సంగారెడ్డిలో 2,224 ఈవీ బైక్‌లు, కార్లు, ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు పుంజుకుంటున్నాయి.  

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహం 
పర్యావరణానికి మేలు చేసే (ఈవీలు)ఎలక్ట్రిక్‌ వాహనాల ను కొనుగోలు చేసేలా ప్రభు త్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉండదు. రూ.లక్షకు 14 శాతం వరకు ఉండే జీవితకాల పన్ను మినహాయింపు కూడా లభిస్తోంది. నిర్వహణ వ్యయం పూర్తిగా తగ్గింది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా విద్యుత్‌ వాహనాలు 2024–2025లో రెట్టింపుస్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. 
– జైపాల్‌రెడ్డి ఎంవీఐ, వరంగల్‌ 

ఈవీతో ఖర్చులు తగ్గించుకున్నా 
గతేడాది ఎలక్ట్రిక్‌ ఈవీ బైక్‌ కొనుగోలు చేశా. గతంకంటే రోడ్లు బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు. పెట్రోల్‌ వాహనం ఉన్నప్పుడు నెలకు పెట్రోలుకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.600లు ఖర్చయ్యేవి. ఈవీ బైక్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి ఖర్చులు తగ్గించుకున్నా. రెండు రోజులకోసారి చార్జింగ్‌ పెడితే 90 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నా. మెయింటెనెన్స్‌ ఖర్చులు లేవు. చాలా ఆదా అవుతోంది.  
– నీర్ల శశికుమార్‌ వరంగల్, ఈవీ బైక్‌ యజమాని  

హ్యపీగా ప్రయాణం చేస్తున్నాం 
ఇటీవల మా బంధువులకు లాంగ్‌ వేరియంట్‌ విద్యుత్‌ కారును కొనుగోలు చేశా. వాహనంతో పాటు 35 కిలోవాట్ల బ్యాటరీ వచ్చింది. 8 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. ఒక్కసారి ఫుల్‌ బ్యాటరీ చార్జింగ్‌ పెడితే హ్యాపీగా 300 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం, ట్రాఫిక్‌ సమస్యలతో మరింత ఎక్కువ ఇంధనం ఖర్చు కావటం వల్ల కార్ల వినియోగం భారమైంది. ఈవీ కారుతో ఖర్చును వేల రూపాయల్లో తగ్గించుకున్నాం.  
– గోనెల రాంప్రసాద్, వరంగల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement