Greater Warangal Municipal Corporation
-
కాంగ్రెస్‌లో చిచ్చురేపిన దసరా ఫ్లెక్సీలు
గీసుకొండ: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య చిచ్చు రేపాయి. «కొండా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కాంగ్రెస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో రేవూరి వర్గం వారు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వివాదంపై రేవూరి వర్గం గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండా వర్గం సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే వారిని పోలీస్‌స్టేషన్‌లోనే అదుపులోకి తీసుకుని బయటకు పంపడం లేదనే సమాచారం రావడంతో కొండా వర్గం కార్యకర్తలు, నాయకులు ధర్మారంలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తమ వారిని విడిపించేందుకు ఆదివారం సాయంత్రం గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలు ఫిర్యాదు చేయడానికి వస్తే, బంధించి బూట్లతో తన్నుతారా.. విచారణ చేయరా? అని ఆమె పోలీసు అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సీఐ కురీ్చలో కూర్చుని ఆమె అధికారులతో వాదిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిన సీపీ అంబర్ కిషోర్‌ఝా అక్కడికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా రేవూరి వర్గీయుడు పిట్టల అనిల్‌పై దాడి చేసిన విషయంలో కొండా వర్గానికి చెందిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు గీసుకొండ పోలీసులు తెలిపారు. ఇందులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండా వర్గీయుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పిట్టల అనిల్ చేసిన వీడియో వైరల్ అయింది. -
గ్రేటర్ వరంగల్ పరిధిలో 40 కాలనీలు జలమయం
-
Pamela Satpathy: తల్లి హృదయం.. కన్నీరు మున్నీరైన కమిషనర్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి తన పనేదో తాను చేసుకుని ఇంటికి చేరుకునే రకం కాదు. పనిలో ఎంత నిక్కచ్చిగా ఉంటారో ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమం విషయంలోనూ అంతే శ్రద్ధ చూపిస్తారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సిబ్బందిలో ఎవరికి కష్టమొచ్చినా అండగా నిలుస్తారు. గత నెలలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా కరోనా బారిన పడిన సత్పతి.. ఇటీవలే కోలుకుని విధుల్లో చేరారు. తన క్యాంపు కార్యాలయంలో వంట మనిషిగా పనిచేసే తాళ్లపల్లి కమల కుమారుడు, బల్దియాలో తాత్కాలిక కార్మికుడు నాగరాజు(32) ఇటీవల అనారోగ్యం బారిన పడగా శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కమిషనర్, మేయర్ గుండు సుధారాణితో కలసి హన్మకొండలోని వారి ఇంటికి వెళ్లి నాగరాజు మృతదేహం వద్ద నివాళులర్పించారు. తర్వాత మృతుడి తల్లి, భార్యను ఓదార్చారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య తన రెండు నెలల పసిగుడ్డును పట్టుకుని రోదిస్తుండగా కమిషనర్ సత్పతిలోని తల్లి హృదయం మేల్కొంది. పసిగుడ్డును తన చేతిలోకి తీసుకున్న ఆమె కూడా కన్నీరు మున్నీరుగా రోదించారు. ఇటీవల నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కరోనాతో బాధపడుతున్న కమిషనర్.. స్వయంగా వెళ్లలేక తన అమ్మానాన్నలను పరామర్శ కోసం పంపించడం విశేషం. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఆ ఊపు లేదు.. ఆ హవాలేదు.. ఆ హడావిడి లేదు.. ఆ సంబురం లేదు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల జోరును మినీ మున్సి‘పోల్స్’లో కొనసాగించలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో చతికిలపడిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టును నిలుపుకోవాలని పలు వ్యూహాలు పన్నినా అధికార టీఆర్ఎస్ ముందు అవి పారలేదు. ఎక్కడా సత్తా చాటలేకపోయింది. గ్రేటర్ వరంగల్‌లో మాత్రం కొంత నయం. 10 కార్పొరేటర్ స్థానాలను అతికష్టం మీద గెలుచుకుంది. కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు తొలుత ధీమా వ్యక్తం చేశాయి. కానీ, ఇప్పుడు అందులో సగానికే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో బీజేపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఇక్కడ పది స్థానాలు రావడం కాస్త మెరుగేనని కార్యకర్తలు భావిస్తున్నారు. లింగోజిగూడ లాస్.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఒక కార్పొరేటర్ స్థానాన్ని చేజిక్కించుకొని ఖాతా తెరిచింది. తమ పార్టీ కార్పొరేటర్ మరణంతో ఉపఎన్నిక జరిగిన లింగోజిగూడ సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఖమ్మంలో తమకు ఆరేడు స్థానాలు వస్తాయని, కాంగ్రెస్‌కు ఏమీ రావని పార్టీ ముఖ్యనేతలు వేసుకున్న అంచనా తారుమారైంది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో వరంగల్‌లో ఉండాలని, కనీసంగా 20 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకోగలిగితే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభం అవుతుందని బీజేపీ శ్రేణులు భావించాయి. మున్సిపోల్స్‌లో తాము ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. చదవండి: 'పుర' పీఠాలపై గులాబీ జెండా -
మలి విడత పురపోరుకు సై!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మలి విడత మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు వార్డుల పునిర్వభజన షెడ్యూల్‌ను ప్రకటిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 25 వరకు వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఆయా పురపాలికలు చర్యలు చేపట్టనున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజన, వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఏప్రిల్/ మేలో ఎన్నికలు.. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు మార్చి 14తో, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. వీటితో పాటు గ్రామ పంచాయతీల స్థాయి నుంచి మున్సిపాలిటీలుగా మారిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)కు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడు పురపాలికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీలు, ప్రాంతాలు విలీనం కావడం, వార్డుల సంఖ్య సైతం పెరగడంతో ఈ స్థానాల్లో వార్డుల పునర్విభజనతో పాటు వార్డుల రిజర్వేషన్లను చేపట్టాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వార్డుల పునర్విభజనతో పాటు చైర్పర్సన్, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ మార్చి 25తో ముగియనుండగా, వార్డులు, చైర్పర్సన్ల వారీగా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన ప్రక్రియను మరో 2 వారాల్లోగా పూర్తి చేసే అవకాశముంది. అనంతరం వచ్చే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలో ఈ ఏడు పురపాలికలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. కార్యక్రమం గడువు తేదీ జనాభా గణన విభాగం నుంచి వార్డుల వారీగా చివరి జనాభా లెక్కల గణాంకాలను సేకరించడం లేదా జిల్లా ఎన్నికల అధికారి నుంచి తాజా ఓటర్ల జాబితాను తీసుకోవడం 24 ఫిబ్రవరి వార్డుల పునిర్వభజన ఉత్తర్వుల్లోని నిబంధనలను పాటిస్తూ మున్సిపాలిటీలు క్షేత్ర స్థాయి సర్వే ద్వారా ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి 25 ఫిబ్రవరి నుంచి 6 మార్చి మున్సిపాలిటీను వార్డులుగా విభజన ప్రతిపాదనలు, సాధారణ ప్రజల నుంచి సలహాల స్వీకరణకు నోటిసు జారీ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రత్యేక లేఖ ద్వారా తెలియజేయడం. పత్రికల్లో ప్రచురించడం మార్చి 7 నుంచి 8 వరకు సాధారణ ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సలహాలు/సూచనలు కోరడం మార్చి 9 నుంచి 15 వరకు సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిష్కరించడం మార్చి 16 నుంచి 21 వరకు పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్‌కు నివేదిక సమర్పించడం మార్చి 22 రాష్ట్ర ప్రభుత్వానికి పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ నివేదిక సమర్పించడం మార్చి 23 నుంచి 24 వరకు వార్డుల పునిర్వభజనపై తుది నోటిఫికేషన్ జారీ మార్చి 25 -
గ్రేటర్ ఫైట్.. ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి ప్రతినిధి, వరంగల్ / వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. పాలకవర్గ పదవీకాలం ముగిసే సమయం సమీపిస్తుండగా అధికారులు ఏర్పాట్లలో వేగం పెంచారు. మహానగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల పునర్విభజన కీలక ఘట్టం కానుంది. ఆ దిశగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. గత ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్లోనూ ఇదే విధానం కొనసాగనుంది. ఇప్పుడు ఉన్న 58 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజిస్తారు. ఈనేపథ్యంలో వార్డులు, కాలనీల తీసివేతలు, కూడికలపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నేడో, రేపో పునర్వి భజన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి. (చదవండి: చల్లా వ్యాఖ్యలు.. ‘సారీ’తో ఆగని ఆందోళనలు) వచ్చే నెల 14 వరకు పాలకవర్గం గడువు గ్రేటర్ వరంగల్ డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. డివిజన్ల పునర్విభజన, ఓటర్ల జాబితా లు, రిజర్వేషన్లు తేల్చేందుకు రెండు నుంచి మూడు నెలల గడువు అవసరమవుతుంది. గ్రేటర్ వరంగల్ ప్రస్తుత పాలక వర్గం పదవీ కాలం మార్చి 14తో ముగియనుంది. ఆలోగా కార్యకలాపాలన్నీ పూర్తి కావు. ఈ మేరకు పాలకవర్గం పదవీ కాలం పూర్తి కాగానే ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించి ఎన్నికల తతంగం పూర్తయ్యేంత వరకు కొనసాగుతారు. గతంలోనూ 2009 అక్టోబర్ నుంచి 2016 మార్చి 13వ తేదీ వరకు ప్రత్యేకాధికారి పాలన బల్దియాలో కొనసాగింది. అదే తరహాలో మార్చి 14వ తేదీ తర్వాత మళ్లీ ప్రత్యేకాధికారి పాలన రాబోతుందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్‌లోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు బల్దియా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం కాగా, పురపాలక శాఖ నుంచి డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ ఉత్తర్వులు రావడమే తరువాయిగా మిగిలింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పునర్విభజన షెడ్యూల్ విడుదల చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన షెడ్యూల్ కోసం అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. జూలై 2019 ఆర్డినెన్సే ప్రామాణికం.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం 2019 జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా మున్సిపాలిటీల్లో జనాభాను వెల్లడించడంతో పాటు వార్డుల సంఖ్యను పెంచారు. ఆ ఆర్డినెన్స్‌లోనే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8,19,416 మంది జనాభా ఉండగా, 58 వార్డులను 66కు పెంచనున్నట్లు వెల్లడించారు. అదే తరహాలో జనగామ, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను సవరించారు. ఆ తర్వాతే గత ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు కూడా అదే పద్ధతిలో నిర్వహించాల్సి ఉంది. తద్వారా వార్డుల పునర్విభజన అనివార్యంగా మారింది. గ్రేటర్ వరంగల్‌లో 2011 నాటి జనాభా, వార్డులు, ప్రభుత్వం 2019 జూలైలో ప్రతిపాదించిన వార్డులు ఇలా... ♦జనాభా- 8,19,406 ♦గతంలో డివిజన్లు- 58 ♦ప్రతిపాదిత డివిజన్లు- 66 -
పెండింగ్ అంటే గిట్టదు!
వరంగల్ అర్బన్ : పెండింగ్ అంటే తనకు ఏ మాత్రం గిట్టదని.. నిబంధనల మేరకు పైళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిందేనని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో శనివారం ఆమె టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యా రు. టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన భవన నిర్మాణాలు, ఫైళ్లు, అపార్టుమెంట్లు, ల్యాండ్ యూసేజ్, మార్టిగేజ్, అడ్వర్టజ్మెంట్ ఫీజుల తదితర అంశాలపై ఇన్చార్జ్ సీపీ నర్సింహ రా ములు, ఏసీపీలు గణపతి, ప్రకాశ్‌రెడ్డితో ఆరా తీశారు. పైళ్ల పరిష్కారానికి ఆన్లైన్ ఉపయోగిస్తున్నందున జాప్యం ఉండకూడదన్నారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో కఠినంగా వ్యవహరించాలని, అనధికార భవనాల వివరాలను డివిజ న్ల వారీగా అందచేయాలన్నారు. ఏసీపీ సాంబయ్య, టీపీఎస్ బషీర్, టీపీబీఓలు పాల్గొన్నారు. తనిఖీలతో హల్చల్! కమిషనర్ పమేల సత్పతి తనిఖీలతో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శనివారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుధ్ధ్యం పనులెలా సాగుతున్నాయి.. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ తీరుపై ఆరా తీశారు. గ్రేటర్ పరిధిలోని 40, 43 డివిజన్లలో పర్యటన సందర్భంగా ఇళ్ల ఎదుట, రోడ్ల మీద చెత్త ఉండడంతో స్థానికులను మందలించారు. అలాగే, డ్రెయినేజీలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, నరేందర్‌ను కమిషనర్ మందలించారు. ఆర్అండ్బీ భవనంలో మద్యం ఖాళీ బాటిళ్లు, చెత్త చెదారం ఉండడాన్ని గుర్తించిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మిర్యాలాకర్ దేవేందర్ కమిషనర్ తనిఖీ చోటకు చేరుకొని పలుసమస్యలను వివరించారు. దీంతో శిథిలావస్థకు చేరిన చోట నూతన డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ సారంగంను కమిషనర్‌ను ఆదేశించారు. ఇక వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని షీ–టాయిలెట్‌ను కమిషనర్ పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ఫాతిమా నగర్లో పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. వడ్డేపల్లి బండ్ తనిఖీ సందర్భంగా పిచ్చిమొక్కలు పెరగడాన్ని గుర్తించిన కమిషనర్ సీహెచ్ఓ సునీతను ప్రశ్నించారు. తాను సెలవులో ఉన్నానని చెప్పగా.. మరొకరికి బాధ్యతలు అప్పగించాలే తప్ప పనులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. డీఈలు సంతోష్‌కుమార్, రవికిరణ్ పాల్గొన్నారు. -
నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూపులు
సాక్షి, వరంగల్: విజయ దశమికి తమ దశ తిరుగుతుందన్న ఆశల పల్లకీలో పలువురు టీఆర్ఎస్ నేతలు ఊరేగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పది మంది టీఆర్ఎస్ సీనియర్ నేతలకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్‌గా వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్‌గా గాంధీనాయక్, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డి పదవులు చేపట్టారు. అలాగే ‘కుడా’ చైర్మన్‌గా మర్రి యాదవర్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్‌గా లింగంపెల్లి కిషన్‌రావు, గొర్రెలు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కన్నెబోయిన రాజయ్యయాదవ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బొల్లం సునీల్‌కుమార్, ఖాదీగ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మౌలానా యూసుఫ్ జాహేద్, రైతు ఆత్మహత్యల న్యాయ విచారణ, విమోచన కమిటీ చైర్మన్‌గా నాగుర్ల వెంకటేశ్వర్ల దక్కించుకోగా.. మరో ఒకరిద్ద్దరికి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు వస్తాయని అనుకుంటున్న తరుణంలోనే ముందస్తుగా టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలకు పోవడంతో పదవుల పందేరానికి బ్రేక్ పడింది. ముగుస్తున్న పదవుల కాలం.. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పొందిన వారి కమిటీల పదవీకాలం ముగిసిపోతోంది. ఇందులో రెండు నెలల క్రితం వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ట్రైకార్ చైర్మన్ గాంధీనాయక్, మహిళా ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి పదవీకాలం ముగిసింది. అక్టోబర్ 9న అంటే మరో పదిరోజుల్లో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెలు పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పదవీకాలం ముగిసిపోనుంది. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పెద్ద సుదర్శన్‌రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అది ఖాళీ అయ్యింది. డిసెంబర్ నెలతో హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్ యూసుఫ్‌జాహేద్ పదవీకాలం పూర్తవుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పది రాష్ట్ర స్థాయి పదవులు ఖాళీ కానున్నాయి. మరోసారి అవకాశం కోసం... ఇప్పటికే పదవీకాలం పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సంస్థల చైర్మన్లు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రుల చాంబర్లలో సదరు ఆశావహ నేతలే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విశ్వసనీయత, విధేయతే గీటు రాయి అన్న చందంగా టీఆర్ఎస్ అగ్రనేతలు పదవులు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి చేసిన సేవలతోనే పదవులు ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు సమావేశాల్లో స్పష్టం చేయడంతో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటులో నాయకులు పోటీ పడి పనిచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్టైల్లో వారు శ్రమించారని చెప్పక తప్పదు. ఖచ్చితమైన హామీ ఎవరికీ లభించనప్పటికీ ముగ్గురు మినహా గతంలో పొందిన నామినేడెడ్ పదవులను మళ్లీ తమకే కేటాయించాలంటూ ప్రయత్నాలు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆశల పల్లకిలో ఉద్యమకారులు... తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేస్తూ కేసుల పాలైన పలువురు ఉద్యమకారులు ఈసారి తప్పకుండా నామినేటెడ్ పదవులు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించినప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయక పోవడం వల్ల డైరెక్టర్ల పోస్టులు సైతం పార్టీ కింది స్థాయి క్యాడర్‌కు దక్కలేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు డైరెక్టర్లను నియమించి అసంతృప్తి వాదులను సంతృప్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో అధిష్టానం యోచిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. విజయదశమికి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు కొందరు వ్యక్తం చేశారు. -
అవినీతి వైరస్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఇదే క్రమంలో ఔట్ సోర్సింగ్‌లోని ఐటీ విభాగంలో కొన్నేళ్ల క్రితం చేరిన ఓ ఉద్యోగి తన ప్రత్యేక నైపుణ్యంతో అధికారులను బుట్టలో పడేశాడు. గ్రేటర్ సాంకేతిక విభాగాన్ని మొత్తం గుప్పిట పట్టి అక్రమాలకు పాల్పడుతున్నాడు. కీబోర్డు, కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్, జిరాక్స్ మిషన్ల కొనుగోళ్లలో బినామీ వ్యాపారిగా మారి ఐటీని లూటీ చేస్తున్నాడు. కొన్ని బినామీ, మరికొన్ని కమిషన్లు.. గ్రేటర్ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో, ఐటీ విభాగంలో ఏ వస్తువు కొనుగోలు చేసిన సదరు బాస్‌కు ముడుపులు ముట్టాల్సిందే. లేదంటే సవాలక్ష కొర్రీలు ఉంటాయి. కార్పొరేషన్లో వందల సంఖ్యలో కంప్యూటర్లు, స్కానర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఉన్నాయి. అయితే ఇందులో ఏది కొనుగోలు చేయాలన్నా ముందుగా ఐటీ బాస్ కమిషనర్‌కు నోట్ పెడతాడు. కొనుగోలుకు అనుమతి రావడంతో తన అనుభవాన్ని రంగరిస్తాడు. కీబోర్డులు, కంప్యూటర్లు, ట్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, జిరాక్స్ యంత్రాలు, మొబైల్ ఫోన్లు ఏదైనా తన కనుసన్నల్లో కొనుగోలు జరుగుతుంటాయి. కొన్ని బినామి పేర్లపై, మరికొన్ని కమిషన్లు పేరిట లావాదేవిలు సాగుతుంటాయి. 2015 ఆగస్టులో గ్రేటర్లో రూ. 2 కోట్లతో కంప్యూటర్లు, ట్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్కానర్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేపట్టారు. అయితే ఇందులో సదరు ఐటీ బాస్ పెద్ద ఎత్తున కమిషన్లు అందుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఆయన తన సాఫ్ట్ ఆలోచనలతో ఆస్తి పన్నులను పెంచడం, తగ్గించడం, తొలగించడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ప్రతి ఏటా గ్రేటర్ వరంగల్ స్టేషనరీ, ముద్రణా, కంప్యూటర్లు, ఇంట ర్నెట్, మరమ్మతులు, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లకు ఏటా రూ.80 లక్షల వరకు బడ్జెట్లో కేటాయిస్తోంది. ఇందులో అవసరాలను ఆధారంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రతి కొనుగోలు వెనుక సదరు ఐటీ అధికారి భాగస్వామ్యం ఉంటుంది. లేదంటే తన కమిషన్ ముట్టచెప్పాలి. కుదరదు అంటే అనేక సాంకేతిక కారణాలు ఎత్తి చూపి, ఆ కంపెనీలకు బదులుగా మరో కంపెనీ పరికరాలు కొనుగోలు చేయడం జరుగుతోంది. 2000లో గ్రేటర్లో చేరిక.. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో 2000 సంవత్సరంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో నమోదు చేయడలో భాగంగా అధికారులు నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిపై తీసుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి రూ.4000 జీతంతో ఆపరేటర్‌గా విధుల్లో చేరాడు. అయితే కొద్ది రోజులకే తనదైన నైపుణ్యంతో ఉన్నతాధికారులకు దగ్గరై తాను పనిచేస్తున్న విభాగానికి బాస్ అయ్యాడు. అన్నీ ఆయనే.. గ్రేటర్లో అన్నింటిలో కంటే ఐటీ విభాగం కీలకమైనది. రూ. కోట్ల ఆర్థిక లావాదేవిలు ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంటాయి. ఇక్కడ పన్నుల విధింపు, ఫీజుల వసూళ్లు, వివిధ రకాల సాఫ్ట్వేర్లు, ప్రోగ్రామ్‌ల తయారీ జరుగుతోంది. అయితే ఇంత ప్రాధాన్యం కలిగిన విభాగానికి పర్మనెంట్ సూపరింటెండెంట్, ఓ అధికారి ఇన్చార్జిగా నియమించడం లేదు. ఈ క్రమంలో 18 ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అన్నీతానై ఐటీ బాస్‌గా కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 50 మంది వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఆపరేటర్లు, ప్రోగామర్లు, ఇతర సిబ్బంది ఈయన కనుసన్నల్లో నడుస్తుంటారు. అతడి దగ్గర తోక జాడించిన వారికి అంతర్గత బదిలీలు చేస్తున్నాడు. ఐటీ ఔట్ సోర్సింగ్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్‌గా, బాస్‌గా పద్దెనిమిది ఏళ్లు ఒకే చోట విధులను చక్కబెడుతున్నాడు. సదరు ఐటీ బాస్ వారం రోజుల పాటు విధుల్లోకి రాకపోతే గ్రేటర్ ఆన్లైన్ లావా దేవీల కుప్పుకూలే విధంగా ప్రోగ్రామ్‌లు, సాఫ్ట్వేర్లు తన గుప్పిట్లో ఉంచుకోవడం గమనార్హం. గ్రేటర్ వరంగల్ అన్నీ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తింస్తుండగా, అధికారులు వింగ్ అధికారులు ఉన్నారు. కానీ శాశ్వత ఉద్యోగి, ఇన్చార్జి అధికారి లేకుండా నడుస్తున్న ఏకైక విభాగం ఉందంటే అది కేవలం ఐటీ విభాగం మాత్రమేనని చెప్పవచ్చు. ఈ–స్క్రాప్ ఏమైంది..? గత 18 ఏళ్లుగా కొనుగోలు చేసి పాడైన కంప్యూటర్లు, కీ బోర్డులు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమయ్యాయో అంతుచిక్కడం లేదు. నిబం ధనల మేరకు పాడైన ప్రతి పరికరాన్ని పక్కా లెక్కతో స్క్రాప్ కింద అమ్మి గ్రేటర్ ఖజానాకు సొమ్ము జమ చేయాలి. కానీ సదరు అధికారి పాడైనా, కాకున్నా పక్కదారి పట్టించి పెద్ద ఎత్తున జేబులు నింపుకుంటున్నాడు. రోజువారీగా స్టేషనరీ, ప్రింటర్ల, జిరాక్స్ ప్రింట్ల రంగు కొనుగోలు గోల్మాల్ జరుగుతోంది. ఐటీ బాస్ అవినీతి, అక్రమాలను తెలుసుకున్న బదిలీ కమిషనర్ ఇక్కడి నుంచి సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే తనపైఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎవరెమన్నా ఓపికగా తలాడిస్తూ ఐటీని లూటీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జగమొండి..!
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ పరిధిలో ప్రజలందరూ పన్నులు కట్టాలి... మహా నగర అభివృద్ధికి తోడ్పడాలి.. అంటూ అధికారులు జోరుగా సందేశాలు ఇస్తున్నారు. అంతేకాదు.. సామాన్యుడి నుంచి మరీ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించని పక్షంలో నల్లా కనెక్షన్ కట్..ఆస్తుల జప్తు.. వ్యాపార, వాణిజ్య సంస్థల సీజ్ అంటూ నడి రోడ్డుకు లాగి పరువు తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో పన్ను బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న మహా నగర పాలక సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి కేవలం 11 శాతం పన్నులు వసూలు కావడం గమనార్హం. దీనిపై గ్రేటర్ పాలకవర్గం సైతం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల రాక దేవుడికెరుక.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులు 1,545 ఉన్నాయి. వీటి నుంచి జీడబ్ల్యూఎంసీకి ఆస్తి పన్ను కింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.99 కోట్లు.. కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.15.70 కోట్లు సమకూరాల్సి ఉంది. వడ్డీలు మినహాస్తే రూ.18.69 కోట్ల బకాయిలు ఉండగా.. గ్రేటర్ అధికారులు ఇప్పటివరకు రూ.2,15 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో సగానికి పైగా సొమ్ము ఆయా శాఖలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించినవే. నోటీసులతో సరి.. ఏళ్ల తరబడి బకాయిలు భారీగా పేరుకుపోతున్నా.. బల్దియా అధికారుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అన్నట్లు.. ఏటా తాఖీదులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు అడిగితే.. తాఖీదులు ఇచ్చామని సమాధానమిస్తున్నారే తప్ప.. బకాయిల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. అయితే.. ఈ ఏడాది బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఏడాది పొడవునా ఒత్తిడి తీసుకొచ్చారు. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వ శాఖల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. మరో 23 రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికైనా మేయర్, కలెక్టర్, కమిషనర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖ పన్ను చెల్లించే విధంగా ఒత్తిడి తేవాలి. పేరుకుపోయిన బకాయిలను రాబట్టగలిగితే ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. మహా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. బకాయిలు చెల్లించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు.. నిట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేయూ, రైల్వే శాఖ, ప్రభుత్వ కాలేజీలు, రెవెన్యూ శాఖ, ఆర్అండ్బీ, పీడబ్ల్యూడీ, పంచాయతీ రాజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్ట్ ఆఫీస్‌లు, హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్కూళ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, కోర్టు, టెలికాం, ఆల్ ఇండియా రేడియో, ట్రాన్స్‌కో, సీఆర్పీఎఫ్ పోలీస్, ఎఫ్‌సీఐ, ఇతర సర్కారు సంస్థల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. స్పెషల్ నోటీసులు ఇస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కొన్ని శాఖల అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రత్యేక నోటీసులు జారీ చేసి వసూలు చేస్తాం. – శాంతికుమార్, టీఓ -
ఉప ఎన్నిక పోరు నేడే..
వరంగల్ అర్బన్: గ్రేటర్ పరిధిలోని 44వ డివిజన్ ఓటర్లు తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. ఉపఎన్నిక బరిలో నిలిచిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్ తేల్చేందుకు ఓట ర్లు సిద్ధమయ్యారు. డివిజన్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు, నాయకులు.. ఓటర్ల స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయ ంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలతో పోలింగ్స్టేషన్లకు.. గ్రేటర్ ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం నుంచి పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, తదితర సామగ్రిని పంపిణీ చేశారు. ప్రత్యేక బస్సులో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం మొత్తం తొమ్మిది ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 9,641 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హన్మకొండ నయీంనగర్‌లోని తేజస్వీ హైస్కూల్లో మూడు ఈవీఎంలు, తేజస్వీ హైస్కూల్ 2వ బ్లాక్‌లో నాలుగు ఈవీఎంలు, ఏకశిల హైస్కూల్లో రెండు ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తేజస్వీని హైస్కూల్ 2వ బ్లాక్‌లో మూడో తరగతి గదిలో 1,298 మంది ఓటర్లు, ఇదే స్కూల్లోని ఐదో తరగతి గదిలో 915 మంది ఓటర్లు తమ ఓటను వినియోగంచుకోనున్నారు. ⇒ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 6.30 గంటల మధ్య మాక్ పోలింగ్ ⇒ పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ⇒ రిజర్వేషన్– జనరల్ ⇒ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థులు ఇద్దరు ⇒ పోలింగ్ సిబ్బంది–40 మంది ⇒ ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడిగ్ అధికారి, ఇద్దరు చొప్పన సహాయకులు ⇒ రిజర్వులో నలుగురు సిబ్బంది ⇒ పోలింగ్‌లో అభ్యర్థికి ఒక ఎజెంట్ చొప్పన రెండు పార్టీల అభ్యర్థులకు ఇద్దరు ⇒ ఇద్దరు రూట్ ఆఫీసర్లు, ఒకరు జోనల్ ఆఫీసర్ ⇒ ఉప ఎన్నిక కంట్రోల్ రూం ఇండోర్ స్టేడియం ⇒ ఎన్నికల విధుల్లో 50 మంది గ్రేటర్ సిబ్బంది ⇒ రెండు గంటలకోసారి పోలింగ్ శాతం వెల్లడి ⇒ శాంతి భద్రతల కోసం పోలింగ్ కేంద్రానికో ఎస్కార్టు ⇒ నిఘా కోసం వీడియోగ్రాఫర్‌ను నియమించారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి.. 44వ డివిజన్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి కరుణాకర్ తెలిపారు. సోమవారం గ్రేటర్ ఇండోర్ స్టేడియంలో పోలింగ్ సిబ్బందికి ఈవీఎం, స్టేషనరీ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉపఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ బ్రహ్మయ్య, సీపీ శ్యాంకుకమార్, ఈఈ లింగమూర్తి, ఏఆర్ఓలు పారిజాతం, శ్రీవాణి, పర్యవేక్షకులు ప్రసన్నారాణి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నిక డివిజన్ 44 పోలింగ్ కేంద్రాల సంఖ్య 3 పోలింగ్ బూత్‌లు 9 డివిజన్లోని మొత్తం ఓటర్ల సంఖ్య 9,641 మహిళా ఓటర్లు 4,648 పురుష ఓటర్లు 4,993 మొత్తం ఓటర్లు 9,641 ఈవీఎంలు 9 -
24న గ్రేటర్ స్టాడింగ్ కమిటీఎన్నికలు
►నేడు నోటిఫికేషన్ విడుదల ►ఆరుగురు సభ్యుల ఎన్నికకు సమాయత్తం ►నేటి నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ ►17న పరిశీలన, అదే రోజు స్క్రూటినీ ►19న ఉపసంహరణ.. అదేరోజు తుదిజాబితా వెల్లడి వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ (స్థాయీ సం ఘం) సభ్యుల ఎన్నికకు నగరా మోగింది. తొలి స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవి కా లం ఏడాదితో ముగిసింది. ఈ మేరకు రెం డో దఫా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక షెడ్యూల్ ఖరారైంది. మం గళవారం గ్రేట ర్ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఎన్నిక నోటిఫికేషన్‌ను కమిషనర్ శృతి ఓజా విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16న మ« ద్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24న స్టాండిం గ్ కమిటీల సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలో 58 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్ని కోవా ల్సి ఉంటుంది. గతంలో స్థాయీ సం ఘాన్ని ఏర్పాటు చేసేందుకు వరుస క్రమంలో పది డివిజన్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకునే వారు. పది మంది కార్పొరేటర్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా మారాయి. వరుస క్రమంలో కాకుండా 58 డివిజన్ల నుంచి ఎవరైనా పోటీ చేసేందుకు వీలు కల్పించారు. గత ఏడాది ఆగస్టులో ఆరుగురు కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్లు దాఖాలు చేయగా, పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి మోజార్టీ సభ్యులు ఉండడం వల్ల ఏకగ్రీవ ఎన్నిక సులువైంది. ఈ దఫా కూడా పోటీ లేకుండా సభ్యులను ఖరారు చేయనున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక అనుకున్నట్లుగా జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా... ►8న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ►గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్పొరేటర్ల నుంచి గ్రేటర్ కార్యదర్శి నామినేషన్ల పత్రాలను స్వీకరిస్తారు. ►16న సాయంత్రం 3గంటలకు నామినేషన్ల జాబితా వెల్లడి ►17న నామినేషన్ల పరిశీలన, అదే రోజు స్క్రూటినీ... ఆ తర్వాత చెల్లుబాటు నామినేషన్ల జాబితా ప్రకటన ►19న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచి అభ్యర్థుల పేర్ల ప్రకటన. ►24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో పోలింగ్. సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు విడుదల. 2016 ఏడు సమావేశాలే..! నిబంధనల ప్రకారం 15 రోజులకోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం జరగాలి. ఏడాదిలో 24 సార్లు స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా.. ఏడు సార్లు మాత్రమే నిర్వహించారు. తొలి స్టాండింగ్ కమిటీ సమావేశం 2016 నవంబర్ 9న, రెండో సమావేశం నవంబరు 22న, మూడోది అక్టోబర్ 10న, నాలుగోది డిసెంబర్ 23న, ఐదోది ఫిబ్రవరి 18న, అరోదిజూలై 3న, ఇక చివరి సమావేశం జూలై 18న జరిగింది. -
కాళేశ్వరంలో కాల్వలే ముందు
బ్యారేజీ, పంప్‌హౌస్‌లు పూర్తయ్యేలోగా కాల్వలు నిర్మించాలి - అందుకు ప్రత్యేక చొరవ చూపండి: ఎమ్మెల్యేలకు సీఎం సూచన - దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించండి - భగీరథ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి - గ్రేటర్ వరంగల్ గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్మాణం, మరమ్మతులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయ్యేలోగా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ చానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని చెప్పారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, వాటిని అధికారులతో చేయించాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, వాటి ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. బ్యారేజీల నిర్మాణం కన్నా ముందే పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమ య్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, స్టీఫెన్ సన్, సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రేఖా నాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఇందులో పాల్గొన్నారు. ‘భగీరథ’పై దృష్టి పెట్టండి తమ నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, పైప్లైన్ల నిర్మాణ పురోగతి? తదితర అంశాలను గమనించాలన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు. ఆ 42 గ్రామాలకూ గొర్రెల పథకం గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, వరంగల్ నగర పరిధిలో చేరిన గ్రామాలు అవకాశం కోల్పోయాయని ఆ జిల్లా మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్యమంత్రిని కలసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించారు. జూన్‌లో రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో ఎస్టీ బాలికలకు ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు నడపాలని కోరారు. ఈ మేరకు వెంటనే తుది జాబితా రూపొందిం చాలని చందూలాల్‌ను ఆదేశించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ రాష్ట్ర అవతరణ వేడుకలు, పెండింగ్ సమస్యలపై చర్చ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో అరగంటసేపు చర్చలు జరిపారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లు, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోం శాఖ స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా తెలంగాణ వాదనలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. -
గ్రేటర్ వరంగల్‌లో తాగినీటి ఎద్దడి
-
ఆదాయం అవసరం లేదా..?
ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లపై అధికారుల నిర్లక్ష్యం టార్గెట్ 5.26కోట్లు, వసూళ్లు 1.38కోట్లు పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్లకు వ్యాపారులపై వల్లమాలిన ప్రేమో లేక, నిర్లక్ష్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2017 జనవరి 31 నాటికి వంద శాతం వసూళ్లు చేయాల్సిన సానిటరీ ఇన్స్పెక్టర్లు కేవలం 26 వసూళ్లతో సరిపెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని చూస్తే సొంత ఆదాయంపై వీరికి ఏ మేరకు శ్రద్ధ ఉందో అవగతమవుతోంది. కార్పొరేషన్ పరిధిలో 17,559 మంది ట్రేడ్ లైసెన్స్‌లతో యాజమానులు వ్యాపారాలు నిర్వహిస్తునట్లు రికార్డులు చూపుతున్నాయి. కానీ నగరంలో రెట్టింపు స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది స్థానికంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రికార్డుల్లో అధికారికంగా నమోదైన వ్యాపారుల నుంచి కుడా ఏడాదికోకమారు ఫీజు వసూలు చేయడంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు విఫలమవుతున్నారు. ఫలితంగా గత కొద్ది సంవత్సరాలుగా వేలాది మంది ట్రేడ్ లైసెన్స్‌దారుల వద్ద ఫీజు బకాయిలు పేరుకుపోతున్నాయి. లక్ష్యం రూ.5.28 కోట్లు.. వసూళ్లు రూ.1.38 కోట్లు గ్రేటర్ వరంగల్ 2016–17 సంవత్సరానికి గాను ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ. 5.28 కోట్ల వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ణీత గడువు 2017 జనవరి 31 నాటికి వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. గడువు దాటింది. కానీ ట్రేడ్ ఫీజు కేవలం రూ. 1.38కోట్లు వసూలు చేశారు. ట్రేడ్ ఫీజు, జరిమానాలతో ఇంకా రూ. 3.90కోట్లు ఫీజులు బాకాయిలు పేరుకుపోయాయి. బిర్రు శ్రీనివాస్ అనే సానిటరీ ఇన్స్పెక్టర్ మాత్రం 85 శాతం పన్నులు వసూలు చేయగా, భాస్కర్ 63శాతం, కుమారస్వామి 63 శాతం టార్గెట్ వసూలు చేశారు. మారో సానిటరీ ఇన్స్పెక్టర్ యాదయ్య 15 శాతం, కర్ణాకర్ 17శాతం, భీమయ్య 18శాతం వసూలు చేయడం గమనార్హం. కొత్త డిమాండ్ రూ.5.51కోట్లు ఈ ఏడాది కొత్త డిమాండ్ ఫిబ్రవరి 1న ఖరారైంది. పాత బకాయిలతోపాటు వడ్డీ, ఈ ఏడాది ట్రేడ్ లైసెన్స్ ఫీజుతో రూ.5.51కోట్లుగా నిర్ణయించారు. గత ఏడాది 3.90 కోట్ల బాకాయిలతో పాటు కొత్త లైసెన్స్ ఫీజు రూ.160కోట్లతో ఖరారు చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లిస్తే దీనిపై జరిమానా విధించరు. కానీ మార్చి తర్వాత 3 నెలల వరకు 25 శాతం జరిమానా, ఏడాది గడిస్తే 50 శాతం జరిమానా వసూలు చేస్తారు. -
పెద్దలకు ఒక తీరు!
ఫ్లెక్సీల నిషేధంపై గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం అధికార పార్టీ ముఖ్యులకు మినహాయింపు వరంగల్ : గ్రేటర్ వరంగల్ ప్రతిష్టను పెంచే కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఫెక్ల్సీల నిషేధం అమలు తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు 2017 జనవరి 1 నుంచి వరంగల్ నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు నగరంలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ ఆదేశాలు అధికారులు అమలు చేయాల్సి ఉంది. స్వయంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటిం చినా... నిషేధం అమలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. అధికార టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో గ్రేటర్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర టీఆర్ఎస్ నేతల ఇళ్ల ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. అధికారులు వాటిని తొలగించకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ నగర ప్రజల్లో మొదలైంది. మహానగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) తీసుకున్న నిర్ణయం సామాన్యులకే వర్తిస్తుందా... అందరికి వర్తిస్తుందా అనేది సందేహంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మొరాయించిన మైకు.. ఉద్యోగుల గైర్హాజరు
ఇదీ గ్రేటర్లో స్వాతంత్య్ర వేడుకల తీరు ఏఈ సస్పెన్షన్, డీఈకి నోటీసు గైర్హాజరైన వారికి కూడా నోటీసులు వరంగల్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవమంటే అందరికీ ఉత్సాహమే.. కానీ ఎందుకో తెలియదు కానీ గ్రేటర్ అధికారులు ఇదేమీ పట్టలేదు. సోమవారం ఉదయం 7–10గంటలకు వరంగల్ బల్దియా కార్యాలయానికి మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చేరుకున్నారు. కాసేపు వారి చాంబర్లలో ఉండి 7–25 గంటలకు జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రధాన కార్యాలయం ఎదుటకు వచ్చారు. కానీ అప్పటి వరకు కూడా అడిషనల్ కమిషనర్, గ్రేటర్ కార్యదర్శి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, కొందరు వింగ్ అధికారులు, సూపరింటెండెంట్లు రాలేదు. అయినా సరే మేయర్ జాతీయ జెండా ఎగురవేసి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే మైకు మొరాయించింది. ఎలక్ట్రికల్ సిబ్బంది మరమ్మతులు చేసినా అది ససేమిరా అనడంతో మేయర్ మైకు లేకుండానే తన ప్రసంగం కానిచ్చేశారు. ఆ తర్వాత తాపీగా అధికారులు, ఉద్యోగులు ఒక్కరొక్కరుగా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మేయర్ నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్‌కు ఫోన్ చేసిన కమిషనర్.. మైకు విషయంలో ఏఈ రవీందర్ సస్పెండ్ చేయాలని, డీఈ లక్ష్మారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ణీత సమయం 7–30 గంటల్లోగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాని అధికారులు, సూపరింటెండెంట్లకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచిం చారు. ఇక బల్దియా ప్రధాన కార్యాలయం కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిషనర్ పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లగా ఉద్యానవన అధికారి మినహా ఎవరూ లేరు. దీంతో కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి కనీసం ఆహ్వాన పత్రాలను ముద్రించకుండా కార్పొరేటర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
నగర వాసులకు మెరుగైన సేవలు అందిద్దాం ‘గ్రేటర్’ స్వాతంత్య్ర వేడుకల్లో మేయర్ నన్నపునేని నరేందర్ వరంగల్ అర్బన్ : మహా నగర సమగ్ర అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ మహా నగ పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చేసిన పోరాట ఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలన్నారు. గ్రేటర్లో కొత్త పాలక వర్గం ఏర్పడి ఐదు నెలల కాలం అవుతుందని, తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరయ్యామన్నారు. నగర అభివృద్ధి అన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించామని మేయర్ స్పష్టం చేశారు. స్మార్ట్ నగరం, విశ్వనగరం ఏర్పాటుకు ప్రతి ఒక్కరం తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆయన విలీన గ్రామాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హరితహారం, రూపాయికి నల్లా కనెక్షన్ అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్ఈ అబ్దుల్ రహమాన్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్, వేణుగోపాల్, మేడిది రజిత, రిజ్వనా షమీం, యెలగం లీలావతి, నల్లా స్వరూపరాణి, మరుపల్లి భాగ్యలక్ష్మి, గ్రేటర్ సెక్రటరీ నాగరాజరావు, డిప్యూ టీ కమిషనర్లు ఇంద్రసేనారెడ్డి, సురేందర్‌రావు,అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు పలు విభాగాల్లో 30 మంది ఉద్యోగులకు మేయర్, కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో వివిధ విభాగాలకు చెందిన ఎస్.వీరస్వామి, భాస్కర్, సంతోష్‌బాబు, డి.సంతోష్, లైన్‌మేన్ రాజమౌళి, శ్రీనివాసరావు, జన్ను మొగిళి, శ్యామ ల, స్వామి, ఆరోగ్యం, స్వరూప, షేక్ అబ్దులయ్య, సర్వ ర్ షరీఫ్, వీరప్రతాప్, శ్రీహరి, ప్రకాశ్, శ్రీకాంత్, సం జీవరెడ్డి, సూర్యనారయణ, రాకేష్, షేక్ సిద్ధిక్, రాము లు, స్రవంతి, సునీల్‌కుమార్, సుజాత, ఎం.నరేష్, ఈ.జోనా, ఇజ్రాయిల్, విజయ్‌కుమార్ ఉన్నారు. -
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నేడే
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ స్టాండింగ్ కమిటీ ఎంపిక ప్రక్రియ కొంతమంది కార్పొరేటర్లను ఒత్తిడికి గురిచేస్తోంది. స్టాండింగ్ కమిటీ సభ్య పదవికి పోటీ చేయదల్చే కార్పొరేటర్లు నేడు సాయంత్రం 3 గంటల్లోగా తమ నామినేషన్ల పత్రాలను బల్దియా ప్రధాన కార్యాలయంలో సమర్పించాలి. మంగళవారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ సమావేశమై స్టాండింగ్ కమిటీలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆశావహులైన కార్పొరేటర్లు ఒత్తిడికి లోనవడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐదున్నర సంవత్సరాల వ్యవధి తర్వాత బల్దియాలో పాలక వర్గం ఏర్పడింది. వీరిలో 80 శాతం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఉండగా, కొంతమంది సీనియర్లూ ఉన్నారు. వీరిలో పలువురు ఆశావహులు తమకంటే తమకు స్టాండింగ్ కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల బలం అత్యధికంగా కలిగి ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఆరు స్టాండింగ్ కమిటీ పదవులను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీలోని ఆశావహుల నడుమ తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 2 స్టాండింగ్ కమిటీ పోస్టులు, అందులో ఒకటి అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి, మరొకటి వరంగల్ ప్రాంతానికి కేటాయించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇద్దరికి, వర్ధన్నపేట నుంచి ఒకరికి, పరకాలకు ఒక స్థానం కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
‘గ్రేటర్’ సీపీగా రాజేంద్రప్రసాద్
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్(సీపీ)గా ఎం.రాజేంద్రప్రసాద్ నాయక్ నియమితులయ్యారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గత ఆరేళ్లుగా వరంగల్ బల్దియాలో ఇన్చార్జి సీపీలే కొనసాగుతుండగా.. ప్రస్తుతం పూర్తిస్థాయి సీపీ నియమితులయ్యారు. రాజేంద్రప్రసాద్ విదు ల్లో చేరాక ప్రస్తుతం ఇన్చార్జి సీపీగా ఉన్న ఏ.కోదండరాంరెడ్డి డిప్యూటీ సిటీ ప్లానర్‌గా కొనసాగుతారు. -
టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్
కాజీపేట రూరల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ దంపతులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. శ్రీలేఖ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యాలయంలో తన మద్దతుదారులు, కడిపికొండ కుచెందిన పలువురితో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ శ్రీలేఖ, ఆమె భర్త కృష్ణ టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాకుల రవీందర్, బి.రాంచంద్రారెడ్డి, దామెరుప్పుల కోటేశ్వర్, శంకర్‌బాబు, లక్ష్మీనారాయణ, కిశోర్, కన్నయ్య, బస్కె దశరథం, రమణారెడ్డి, కొడవటి అశోక్, బత్తిని సతీష్, బస్కె సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి, ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం తోపాటు పెం డింగ్ నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రా జేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు బుధవారం కలెక్టర్ వాకాటి కరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ జిల్లాలో కరువు నివారణ చ ర్యలు చేపట్టాలని, రుణమా ఫీని పూర్తిగా అ మలు చేయాలన్నారు. గ్రామాల్లో వలసలను నివారించేందుకు కృషి చేయూలని కోరారు. సోషల్ ఆడిట్‌పై అభినందనలు.. జిల్లాలో పీఆర్ రోడ్ల నిర్మాణంలో కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపడుతున్న సామాజిక తనిఖీ బాగుందని కాంగ్రెస్ నాయ కులు అన్నారు. ప్రజాధనం వృథాకాకుండా, అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమం అద్భుతమని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు, నాయకులు వెంకట్రాంరెడ్డి, డాక్టర్ బండా ప్రకాష్, ఈవీ శ్రీనివాస్‌రావు, బత్తినిశ్రీనివాస్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం పరిశీలనలో ‘స్మార్ట్’
► మరోసారి పోటీలో వరంగల్ ► మే 15లోపు ఫలితాల వెల్లడి ► రూ.2861 కోట్లతో సమగ్ర నివేదిక ► మొత్తం ఏడు థీమ్‌లు, 20 ప్రాజెక్టులు ► పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం స్మార్ట్‌సిటీ పథకం రెండో దశ అమలులో చోటు దక్కించుకునేందుకు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో లోపాలను సవరించి.. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. సాక్షి, హన్మకొండ: నగరాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఈ వంద నగరాలకు సంబంధించి సమగ్ర నివేదిక (డీపీఆర్)లతో స్మార్ట్‌సిటీ చాలెంజ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. ఈ కాంపిటీషన్లో వచ్చిన డీపీఆర్‌ల ఆధారంగా తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేశారు. వరంగల్‌తో పాటు మరో 23 నగరాలు తృటిలో ఈ అవకాశాన్ని చే జార్చుకున్నాయి.దీంతో ఈ 23 నగరాలకు మరో అవకాశాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కల్పించింది. వీటికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ ఏర్పాటుచేసి,ఈ ఏడాది ఏప్రిల్ 21 లోగా డీపీఆర్‌లను సమర్పించాల్సిం దిగా ఆదేశించింది. గ్రేటర్ వరంగల్ కొత్త కార్యవర్గం ఎ న్నికైన వెంటనే మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సవరించిన డీ పీఆర్‌ను ఆమోదించారు. ఈ నివేదికను ఈ నెల 20న న్యూఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించారు.ఫాస్ట్‌ట్రాక్ కాం పిటీషన్లో వచ్చిన నివేదికలను మే 15లోగా పరిశీలించి, ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. 86 ప్రాజెక్టులు.. స్మార్ట్‌సిటీ ఫాస్ట్‌ట్రాక్ కాంపిటీషన్ కోసం సమర్పించిన నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్‌సిటీ పథకం నిబంధనల ప్రకారం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని (సెంట్రల్ సిటీ) అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం ప్రధానం. దీనికి అదనంగా నగరం మొత్తానికి పనికి వచ్చేలా (పాన్‌సిటీ) ఎంపిక చేసిన విభాగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. సెంట్రల్‌సిటీ, పాన్సిటీల ద్వారా గ్రేటర్ వరంగల్‌లో రూ.2861 కోట్ల వ్యయంతో పనులు చేపడుతున్నారు. సెంట్రల్ సిటీ ద్వారా చేపట్టబోయే పనులను ఏడు థీమ్‌లుగా విభజంచారు. ఈ ఏడు థీమ్‌ల ద్వారా మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో 20 మేజర్ ప్రాజెక్టులు, 66 సబ్ మేజర్ ప్రాజెక్టులుగా విభజించారు. భద్రకాళీ చెరువును పర్యాటక ప్రాంతంగా మా ర్చడం, ఎంపిక చేసిన మురికి వాడల్లో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం, నగరంలో వాణిజ్యరంగం అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయల కల్పన, రవాణ వ్యవస్థ ఆధునీకరణ, పట్టణంలో పచ్చదనం పెంచడం, పర్యావరణ పరిరక్షణ, నగరం మధ్యలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రధాన కార్యక్రమంగా సమగ్ర నివేదికలో పే ర్కొన్నారు. ఈ పనులు చేపట్టేందుకు రూ. 2707 కోట్లు ఖర్చు అవుతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. పాన్‌సిటీ పథకం ద్వారా భద్రత, రవాణ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.153 కోట్ల వ్యయం అవుతుందని ప్రణాళికలో పేర్కొన్నారు. నగర అభివృద్ధి నమూనాలో తొలిసారిగా పర్యావరణానికి పెద్దపీఠ వేశారు. సెంట్రల్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో పచ్చదనం పెంచేందుకు రూ.163 కోట్లు కేటాయించారు. స్మార్ట్‌సిటీ ద్వారా రూ.989 కోట్లు స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2861 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.989 కో ట్ల నిధులు మంజూరు కానున్నాయి. దీని తర్వా త ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.906 కోట్లు సమీకరించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా రూ.393,కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల ద్వారా రూ.370 కోట్లు, రుణాల ద్వారా రూ.203 కోట్లు సమీకరిస్తారించాలని సమగ్ర నివేదికలో పేర్కొన్నారు. -
బేకరి బాయ్ నుంచి మేయర్ వరకు
ఆయనది చిన్నప్పటి నుంచి ముళ్లబాటే. చదువుకునే రోజుల్లోనే తండ్రి దూరమయ్యాడు. అందరికంటే చిన్నవాడైనా ఇంటి బాధ్యత భుజాన వేసుకున్నాడు. ఇది.. అదీ అని చూడకుండా బేకరీలో, కూరగాయల మార్కెట్లో ఇలా.. అన్ని పనులూ చేశాడు. వైన్‌షాప్‌లో బిల్రైటర్గా చేరి.. వర్కింగ్ పార్ట్నర్ అయ్యూడు. అదే ఆయన వ్యాపారానికి తొలి మెట్టు. తప్పుని సహించని తత్వంతో రాజకీయంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామి ఆయనకు పెద్ద ఆస్తి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నానుడి ఆయన జీవితంలో నిజమైంది. ఎంత సంపాదించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా లారీ డ్రైవర్ కొడుకుననే విషయూన్ని మరిచిపోనంటున్న గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ -
హరీశ్ లేకుంటే పరువు పోయేది
♦ వరంగల్ కార్పొరేషన్ ఫలితాలపై కేసీఆర్! ♦ ఆ జిల్లా నే తలకు క్లాస్.. పనితీరుపై తీవ్ర అసంతృప్తి ♦ సొంత అభ్యర్థులను ఓడించేందుకు ఖర్చు పెడతారా అంటూ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నాయకత్వం వేసిన అంచనాలకు, వాస్తవ ఫలితాలకు తేడా ఉండటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 58 డివిజన్లు ఉన్న వరంగల్‌లో కనీసం 50కిపైగా స్థానాలను గెలుచుకుంటామని భావించినా... 44 డివిజన్లనే గెలుచుకుంది. టికెట్ల ఖరారు నుంచే మొదలైన అసంతృప్తి... చివరకు ప్రతి డివిజన్లో రెబెల్స్ పోటీలో ఉండడం దీనికి కారణమైంది. కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఇష్టం లేకుండా పోటీకి దిగిన వారిని ఓడించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిచిందన్న సమాచారంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఘా విభాగాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. ఆ నివేదికలను పరిశీలించిన కేసీఆర్... నేతలకు ఇష్టం లేకుండా అభ్యర్థులుగా అవకాశం వచ్చిన వారి ని ఓడించేందుకు ప్రయత్నాలు జరి గాయన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఇటీవల వరంగల్ నేతలను పిలిపించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘పార్టీకి పూర్తి స్థాయిలో పట్టున్న వరంగల్ కార్పొరేషన్ ఫలితాలు నిరాశ కలిగించాయి. పార్టీ అభ్యర్థులను ఓడిం చేందుకు పార్టీ నేతలే ఎదురు ఖర్చు పెడతారా..? మంత్రి హరీశ్‌రావు వరంగల్ ఎన్నికల బాధ్యత తీసుకోకుంటే, అక్కడికి రాకుంటే పరువు పోయేది..’’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు, తమను కాదని ఎవరికో టికెట్ ఇస్తే ఎందుకు గెలిపించాలన్న ఉద్దేశంతో పార్టీ పరువును పణంగా పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి ప్రమాదకరం.. వరంగల్‌లో మేయర్ రేసులో ఉన్న అభ్యర్థిని ఓడించేందుకు కూడా భారీ ప్రయత్నాలు జరిగాయని... ఏకంగా ఓ నేత ఎదుటి పక్షం అభ్యర్థికి ఎన్నికల ఖర్చులు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేయర్‌గా ఎన్నికైన న న్నపనేని నరేందర్ గెలిచిన 19వ డివిజన్లో ఏకంగా రూ.3కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు.. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించిన ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలయ్యేందుకు పార్టీ నేతలే కారణమయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు డివిజన్లు ఉండగా కాంగ్రెస్ గెలుచుకున్న నాలుగు డివిజన్లలో మూడు డివిజన్లు ఇక్కడే ఉన్నాయి. ఓ మంత్రి సూచించిన 46వ డివిజన్ అభ్యర్థిని ఓడించారు. ఒక ఎమ్మెల్యే తన కు ఇష్టం లేని అభ్యర్థులు పోటీలో ఉన్నారని, వారిని ఓడించేందుకు ఏకంగా రూ.50లక్షలు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దొరకక రెబెల్స్‌గా పోటీచేసిన వారిలో 8 మంది గెలుపొందగా... పార్టీ అధికారిక అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇక భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవులకు తమకు ఎక్కడ పోటీ వస్తారోనని భావించి ఓ ముగ్గురు నాయకులకు అసలు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు పార్టీకి ఒక విధంగా ప్రమాద ఘంటికలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.