- వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలు నేడు
- ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
సాక్షి నెట్‌వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగా, సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది. ఈ కార్పొరేషన్లు, నగర పంచాయతీకి ఈ నెల 6న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 58 డివిజన్లకుగాను ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిపి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 390 మంది సిబ్బందిని నియమించారు. ఖమ్మం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు పత్తిమార్కెట్‌లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 50 డివిజన్లకు గాను 291 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,79,827 మంది ఓటు వేశారు. మరోవైపు అచ్చంపేట నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు మండల రిసోర్స్‌భవనంలో జరుగనుంది. 20 వార్డులకుగాను 57 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 70.88 శాతం పోలింగ్ నమోదైంది.