achampet
-
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను లాక్కెళ్లిన రైతులు
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి ఛైర్మన్ ఛాంబర్లోకి దూసుకెళ్లిన రైతులు.. ఛైర్మన్‌ను కార్యాలయం నుంచి లాక్కెళ్లారు. -
నా భర్త మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను :అమల
-
అర్ధరాత్రి ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు!
సాక్షి, అచ్చంపేట: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరోవైపు, ఎన్నికల సందర్బంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. అనంతరం, పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. వివరాల ప్రకారం.. అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు ఆపకపోవటంతో వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేటలోని అంబేడ్కర్ కూడలిలో అడ్డుకొని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఇక, ఈ రాళ్ల దాడిలో కొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరనన తెలిపారు. డబ్బు సంచులతో అడ్డంగా దొరికిపోయిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు,ఓటర్లకు డబ్బు పంచేందుకు తరలిస్తున్న వైనం. అడ్డుకుంనేదుకు ప్రయత్నించిన కాంగ్రెస్స్ కార్యకర్తల పైకి కారు ఎక్కించే ప్రయత్నం #Achampet@CEO_Telangana#TelanganaAssemblyElections2023 pic.twitter.com/RprOdxMY9U — Yashwanth Reddy🇮🇳 (@Yashwanthgarla1) November 12, 2023 ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద కాంగ్రెసు గుండాల దాడి., వరుస ఓటమి భయంతో దాడికి తెగబడిన గుండాలు.. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారి పైకి రాళ్ళు విసిరిన వంశీకృష్ణ.. pic.twitter.com/58XVCelhd3 — Guvvala Balaraju (@GBalarajuTrs) November 11, 2023 మరోవైపు.. ఈ ఘటనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ స్పందిస్తూ.. వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారమిచ్చినా అడ్డుకోలేదన్నారు. డబ్బున్న సంచులు పట్టించినా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులే ప్రత్యేక సెక్యూరిటీ ఇస్తున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ..
సాక్షి, అచ్చంపేట్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అచ్చంపేటలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు, కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ పొలిటికల్ కౌంటరిచ్చారు. కేసీఆర్ దమ్మేంటో దేశం మొత్తం చూసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, కేసీఆర్ అచ్చంపేట్ సభలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం నేను బయలుదేరి 24 ఏళ్లు అయ్యింది. తెలంగాణ సాధన కోసం నేను పక్షిలా తిరిగాను. కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్‌కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చేది లేదంటూ ఒకప్పుడు హేళనగా మాట్లాడారు. పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తోంది. మీ కళ్లకు కనిపిస్తోంది కేసీఆర్ దమ్ము కాదా?. కొడంగల్‌కు రా అని ఒకరు.. గాంధీభవన్‌కు రావాలని మరొకరు సవాల్ చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదు. రాజకీయం అంటే ఇలాంటి సవాల్ చేయాలా?. వాళ్లకు దిక్కులేకపోయినా మనకు నీతులు చెప్పేందుకు వస్తున్నారు. ఎవరు ఎవరికి ఉపన్యాసాలు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. పదేళ్లలో దేశానికి దిక్సూచిలా తెలంగాణను మార్చాం. దేశంలో రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. మెడపై కత్తిపెట్టడమే తప్ప రైతుకు రూపాయి ఇచ్చారా?. 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ప్రధానమంత్రి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు. నేను ఎన్నికల కోసం చేయడం లేదు.. ప్రజల కోసం చేస్తున్నాను. ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇవ్వను. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతోంది. 24 గంటల కరెంట్ ఇస్తామంటే అసెంబ్లీలో జానారెడ్డి గజమెత్తు లేచాడు. తెలంగాణ వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించాం. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది. పెన్షన్‌ను వందల నుంచి వేలల్లోకి తీసుకెళ్లింది కేసీఆర్. కాంగ్రెస్ నేతలకు కావాల్సింది తెలంగాణ బాగోగులు కాదు.. పెత్తనం మాత్రమే. బీజేపీపాలిత రాష్ట్రాల్లో మంచినీళ్లకు దిక్కులేదు. కాంగ్రెస్ వాళ్లు వస్తే ధరణి తీసేస్తాం అంటున్నారు. ధరణితో రైతుల భూముల లెక్కలు ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉన్నాయి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా?. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. నవంబర్ 30న దుమ్ములేపాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కృష్ణాపై తెలంగాణ మరో అక్రమ ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం మరో అక్రమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, పర్యావరణ అనుమతి తీసుకోకుండా అచ్చంపేట ఎత్తిపోతల నిర్మాణానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయం నుంచి 5 టీఎంసీలను తరలించి అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా రూ.1,061.39 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. బుధవారం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించడానికి తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను 2015లో చేపట్టింది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన నాటి సీఎం చంద్రబాబు.. ఈ ఎత్తిపోతలను అడ్డుకోవడంలో, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో విఫలమయ్యారు. ఇప్పుడు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా అదనంగా 5 టీఎంసీలను శ్రీశైలం నుంచి తరలించి, వాటిని ఎదుల రిజర్వాయర్‌లో నిల్వ చేసి, అక్కడి నుంచి ఉమామహేశ్వర రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి అచ్చంపేట ఎత్తిపోతల కింద కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలోకి తరలించేలా తెలంగాణ నూతన ప్రాజెక్టు చేపట్టింది. దీనికి పర్యావరణ అనుమతి, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోలేదు. ఈ ఎత్తిపోతలను తక్షణమే నిలిపివేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్జీటీలో పిటిషన్ వేయనుంది. -
బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం
-
తేలిన సంగమేశ్వర గోపురం
దోమలపెంట (అచ్చంపేట): శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం (గోపురం) తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం కృష్ణానదిలో నాలుగు నెలల కిందట మునిగిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 862.8 అడుగులకు చేరుకోవడంతో ఆలయ గోపురం పూర్తిగా తేలింది. దీంతో ఆలయ పూజారి రఘురామశర్మ బోటులో వెళ్లి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శిఖరంపై జెండాను ఎగురవేశారు. జలాశయంలో మరో 24 అడుగుల నీటిమట్టం తగ్గితే సంగమేశ్వర ఆలయం పూర్తిగా బయటపడుతుంది. అందుకోసం ఫిబ్రవరి రెండో వారం వరకు వేచి చూడాలి. -
అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్
అచ్చంపేట: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరా జు సమర్థించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల కళ్లు కప్పి పెద్దసంఖ్యలో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయ గా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేయగా, రెండు వర్గాల కార్యకర్తలు బాహాబహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ముట్టడికి వచ్చిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముట్టడి సమయంలో ఎమ్మెల్యే గువ్వల అక్కడ లేరు. క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ముందుగానే చెప్పడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ముట్టడికి ముందుగానే టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు కార్యాలయంలో సమావేశం కావడం వల్ల ఘర్షణకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముట్టడి ఉందని ముందుగానే తెలిసినా.. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు క్యాంపు కార్యాలయంలోకి అనుమతించడంపై విమర్శలు వస్తున్నా యి. టీఆర్ఎస్ శ్రేణులు క్యాంప్ కార్యాలయం లో లేకపోతే ఘర్షణ జరిగేది కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. డీఎస్పీలు నర్సింహులు, గిరిబాబు, సీఐలు అనుదీప్, రామకృష్ణ, గాంధీనాయక్, ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తదితరులు బందోబస్తు నిర్వహించారు. -
Mahabubnagar: గుట్టలో గుట్టురట్టు
సాక్షి, మహబూబ్‌నగర్(అచ్చంపేట రూరల్): ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గుట్టలో నిర్వహిస్తున్న జంతు ఎముకలతో తయారుచేసే పౌడర్ ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై సోమవారం అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో పులిజాల గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ పాండునాయక్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి తహసీల్దార్ కృష్ణయ్య, ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ మేఘనాథ్, సిబ్బందితో కలిసి చేరుకున్నారు. అక్కడి మూడు షెడ్లలో జంతువుల ఎముకలను చూర్ణం చేసే యంత్రాలు, కుప్పలుగా ఉన్న వాటి వ్యర్థాలను పరిశీలించారు. చదవండి: (సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో షెడ్డు నిర్మించడం, స్థానికంగా ఏ శాఖ అనుమతి పత్రాలు లేనందున ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అలాగే విద్యుత్ సరఫరా కాకుండా జంపర్లను తీయించారు. కాగా, నిర్వాహకులు మాత్రం ఈ పౌడర్‌ను ఆర్గానిక్ ఎరువులలో ఉపయోగిస్తారని, దీనిని చెట్లకు వాడతారని చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఇదిలాఉండగా గతంలోనూ అచ్చంపేట మండలంలోని చౌటపల్లి, సిద్దాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా జంతు కళేబరాలతో తయారుచేసే నూనె ఫ్యాక్టరీలను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (కన్నబిడ్డల్ని హత్యచేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య) -
నల్లమలలో స్వల్పంగా కంపించిన భూమి
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి కదలడంతో ఏమి జరుగుతుందో తెలియక జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌కు 35 కి.మీ. ఎగువన ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. భూగర్భంలో ఏడు నుంచి 10 కిలోమీటర్ల లోతు నుంచి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. -
అధికారిపై పెట్రోల్ పోసి.. తానూ పోసుకున్న మహిళ
మన్ననూర్ (అచ్చంపేట): నాగర్‌కర్నూల్ జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ అధికారిపై చెంచు మహిళ పెట్రోల్ పోసి, తానూ పోసుకుని నిప్పంటించేందుకు యత్నించగా అక్కడున్నవారు అడ్డుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుని అధికారుల తీరుపై మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారానికి చెందిన 20 మంది చెంచులు 30 ఏళ్లుగా సమీపంలోని 60 ఎకరాల పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. నెల క్రితం ఆ భూములు సాగు చేయొద్దని చెంచులకు అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు యత్నించగా తిరస్కరించారు. తాజాగా శుక్రవారం ప్లాంటేషన్ ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు ఆ భూముల్లో మార్కింగ్ వేయడానికి వచ్చారు. దీంతో చెంచు మహిళా రైతులు వాగ్వాదానికి దిగారు. భూముల కోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమేనని తెగేసి చెప్పారు. అంతలోనే ఓ మహిళ అటవీశాఖ అధికారిపై పెట్రోల్ చల్లి తానూ పోసుకుని అగ్గిపుల్ల గీసేందుకు యత్నించింది. వెంటనే కొందరు లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇది తెలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడి వెళ్లి మాట్లాడారు. పోడు భూముల విషయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, చెంచులను ఇబ్బంది పెట్టవద్దని 15 రోజుల క్రితమే అధికారులకు చెప్పామని పేర్కొన్నారు. -
Photo Feature: ఆర్టీసీ వినూత్న ఆలోచన.. నర్సుల నిరసన
ఖమ్మం ఆర్టీసీ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. పాత బస్సును ప్రయాణికులకు బస్ షెల్టర్‌గా మార్చారు. ఊరించి మొహం చాటేసిన వర్షాల కోసం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు వేతన సవరణ కోసం ముంబైలో నర్సులు ఆందోళనబాట పట్టారు. ఇక, మరాఠా రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో ఆందోళన కొనసాగుతున్నాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాలు ఇక్కడ చూడండి. -
అచ్చంపేటలో ఉద్రిక్తత: టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహీ
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శనివారం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో రోడ్ షో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చార్జిషీట్, కరపత్రాలను విడుదల చేశారు. అదే సమయంలో క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్ ప్రచార వాహనం, దాని వెనుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనం రాగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే తన వాహనాన్ని దారి మళ్లించి మరో మార్గంలో వెళ్లిపోయారు. కానీ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం తమ వాహనాలకు దారివ్వాలని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఓ కార్యకర్త పోలీసులపై చెప్పు విసిరాడు. దీనిపై తరుణ్ చుగ్ స్పందిస్తూ టీఆర్ఎస్ నేతల గూండాయిజానికి భయపడే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి అచ్చంపేట దాడే నిదర్శనమని విమర్శించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత చదవండి: కీలక ఎన్నికలకు కేటీఆర్ దూరం: మంత్రులదే బాధ్యత -
రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
అచ్చంపేట రూరల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల వెన్ను విరుస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘రాజీవ్ రైతు భరోసా’పేరిట ఆదివారం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేపట్టారని, కేంద్రం నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తానూ ఇప్పుడు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నానని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములను పంపిణీ చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మొదట్లో ఈ చట్టాలను వ్యతిరేకించినట్టు నటించిన సీఎం కేసీఆర్ అనంతరం ప్రధానితో జోడీ కట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోనూ కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీక్ష విరమణ అనంతరం రేవంత్ అచ్చంపేట నుంచి ఉప్పునుంతల మీదుగా హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. -
కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు
సాక్షి, అచ్చంపేట : శ్రీశైలం ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు కనిపించడంతో కలకలం రేగింది. ఈగలపెంట ఎస్ఐ వెంకటయ్య కథనం ప్రకారం.. ఆనకట్ట దిగువన కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు, సిగరెట్ ప్యాకెట్, లైటర్, ఓ పెన్ పడి ఉన్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, అమ్రాబాద్ సీఐ బీసన్న సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంతో ఆధారాలు, రక్తం నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింహులు మాట్లాడుతూ మగ వ్యక్తిని చంపి నదిలో పడేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. రెండు రోజుల్లో మృతదేహం నదిలో నుంచి బయటపడవచ్చని, ఆ తర్వాత కేసును కేసును ఛేదిస్తామన్నారు. అయితే స్థానిక వ్యాపారులు, ఇళ్ల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని డీఎస్పీ కోరారు. -
పంచాయతీలపైనే భారం
సాక్షి, అచ్చంపేట: హరితహార కార్యక్రమం ప్రజాప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది.. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటించడం వారికి తలనొప్పిగా పరిణమించింది.. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కాకపోవడంతో గ్రామ పంచాయతీలపైనే భారం పడింది.. దీంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం తమకు తలకు మించిన భారంగా మారిందని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వాపోతున్నారు. గతంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకునేవి. దీంతో ప్రతి విడతలో జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటించారు. అయితే, ఇప్పుడు కొనసాగుతున్న ఐదో విడతలో జిల్లాలో 2.10 కోట్ల మొక్కలను నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 30లక్షల మొక్కలను మాత్రమే నాటించారు. మరో 1.80 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భారమంతా పంచాయతీ పాలకవర్గంపైనే పడింది. అన్నింటికీ ఒకే లక్ష్యం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న గ్రామాలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన గ్రామాలు విస్తీర్ణం పరంగా చాలా చిన్నవి. అయితే అన్ని గ్రామ పంచాయతీలకు ఒకే విధమైన లక్ష్యాన్ని నిర్దేశించడంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద గ్రామాలు తేడా లేకుండా 40 వేల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ఈ లెక్కన మొక్కలను నాటితే గ్రామ పంచాయతీల పరిధిలో కోటిన్నర మొక్కలు నాటే అవకాశం ఉంది. మిగిలిన మొక్కలను మున్సిపాలిటీలు, మరికొన్ని అటవీ శాఖ భూముల్లో నాటించాలి. చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూమి తక్కువగానే ఉండటంతో 40 వేల చొప్పున మొక్కలను నాటడం సాధ్యం కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మొక్కలను సంరక్షించే బాధ్యత సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై ఉంది. కానీ, విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట నిర్ధేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటడమే ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది వర్షాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో మొక్కలు నాటడం సాధ్యం కావడం లేదు. గతంలో అన్ని శాఖలకు.. హరితహారం కార్యక్రమం తొలి నాలుగు విడతల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్ణయించి ఆ మేరకు మొక్కలు నాటించారు. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా తదితర శాఖలకు మొక్కలను నాటించే బాధ్యతను అప్పగించారు. వ్యవసాయ శాఖ ద్వారా పొలం గట్లు, వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల శిఖం భూముల్లో మొక్కలు నాటించారు. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో భాగస్వాములను చేయడంతో నిర్ధేశిత లక్ష్యం పూర్తయ్యింది. కానీ ఇప్పుడు పంచాయతీలపైనే భారం మోపడంతో ఆ మొక్కలను ఎలా నాటించాలో అర్థం కావడం లేదని సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలలో సిబ్బంది తక్కువగా ఉండటంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 4 వేల మొక్కలు నాటాం మాది జనాభా పరంగానే కాకుండా విస్తీర్ణంలోనూ చిన్న గ్రామం. రెవెన్యూ, అటవీ భూములు అసలే లేవు. అందువల్ల ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉంది. 10 నుంచి 15 వేల మొక్కలైతే సరిపోతుంది. ఇప్పటి వరకు 4 వేల మొక్కలు నాటాం. ప్రజల సహకారంతో ఇళ్ల వద్ద మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. – సేవ్యానాయక్, సర్పంచ్, సీబీతండా, ఉప్పునుంతల మండలం పెద్ద బాధ్యతే.. మేం సర్పంచ్‌లుగా ఎంపికైన మొదటి సంవత్సరమే ప్రభుత్వం మాపై పెద్ద బాధ్యతను మోపింది. మాది చిన్న గ్రామమైనా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు హరితహారంపై అవగాహన కల్పించి ఇళ్ల వద్ద ఎక్కువ మొక్కలను నాటించి, పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జితేందర్‌రెడ్డి, సర్పంచ్, బ్రాహ్మణపల్లి, అచ్చంపేట మండలం -
తీరుమారనున్న పంచాయతీ పాలన
సాక్షి, అచ్చంపేట : గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈసారి పంచాయతీ పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీలకు వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పటిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకద్బందీగా అమలు చేయనున్నారు. సర్పంచ్‌లకు సవాలే గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో మాదిరిగా ఈసారి పరిస్థితులు లేవు. అభివృద్ధి పనులను చేయాలంటే మొదటగా ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా సమావేశంలో తీర్మాణాలు చేసి వారి సమక్షంలో నిధులు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతి సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు, వాటి వినియోగానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తీర్మానం తప్పనిసరి గతంలో మాదిరిగా గ్రామ పంచాయతీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటుగా వారిపై వేటుపడే అవకాశం ఉంది. గత సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బు ఖర్చు చేసి గ్రామాల్లో పనులు చేసి ఆతర్వాత వచ్చిన నిధులను తీర్మాణాలు చేయకుండానే పనులు చేశామని పంచాయతీ నుంచి డబ్బు తీసుకునేవాళ్లు. ఈసారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మాణం చేసుకుని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవినీతికి పాల్పడే సర్పంచ్ల పదవికి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. అందుబాటులో వివిధ యాప్‌లు ప్రియా సాఫ్ట్‌వేర్‌తో అక్రమాలకు చెక్ పడనుంది. పంచాయతీరాజ్ ఇనిస్టిషన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. పంచాయతీలకు ఎంత బడ్జెట్ మంజూరైంది. మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చు చేశారు. శానిటేషన్, వైద్యం, నీటి సరఫరా, సీసీ రోడ్డు నిర్మాణం, సిబ్బంది వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రామజ్యోతి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. వార్షిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపు, నిధుల ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన వివరాలను ప్లాన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా సమాచారాన్ని నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జనాభా సామాజిక వివరాలు, భౌతిక వనరలు, మౌలిక వసతులు, సాంఘిక ఆర్థిక సహజ వనరులను యాక్షన్ ప్లాన్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పారదర్శక పాలన నూతనంగా అమలు చేయనున్న పంచాయతీరాజ్ చట్టాలతో గ్రామాల్లో పారదర్శక పాలన అందనుంది. అందుబాటులోకి యాప్‌లు రావడంతో ఎలాంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి పనులు కొనసాగుతాయి. అవినీతికి పాల్పడే సర్పంచ్‌లపై వేటు పడే అవకాశాలు ఉన్నందున తప్పులకు తావివ్వరు. యాప్‌లపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – సురేష్‌కుమార్, ఎంపీడీఓ, అచ్చంపేట -
మున్సిపల్ స్థలంపై కన్ను!
సాక్షి, అచ్చంపేట: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ వారు వివిధ సంఘాలకు సుమారు 6వేల గజాల స్థలాలు దారదత్తం చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ రూ.10కోట్లపై మాటే. పట్టణ నడ్డిబొడ్డున ఉన్న స్థలాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. లేఅవుట్ల రూపేణ పంచాయతీకి కేటాయించిన స్థలాలను పరిరక్షించుకోవడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది. అచ్చంపేటలో గజం ధర రూ.7వేల నుంచి రూ.17 వేల వరకు పలుకుతోంది. వందలు, వేలలో ఉన్న పన్నులు చెల్లించకుంటే నల్లా కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించే మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోరు. రియల్ వ్యాపారుల నుంచి పంచాయతీకి రావాల్సిన రూ.లక్షల ఆదాయ వనరులను తుంగలో తొక్కేస్తున్నారు. మేజర్ గ్రామంచాయతీ సమయంలో పట్టణంలో వెంచర్లు చేసినా.. 10శాతం స్థలంతో పాటు వెడల్పు రోడ్లు చేశారు. మున్సిపాలిటీగా అపగ్రేడ్ తర్వాత మేజర్ పంచాయతీ నుంచి నగరపంచాయతీ, మున్సిపాలిటీగా ఆప్‌గ్రేడ్ అయినా ఇంతవరకు ఒక వెంచర్లో కూడా స్థలం ఇవ్వలేదంటే ఎంత ఉదాసీనంతో వ్యరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్ల వెలిశాయి. వెంచర్లలో ఎక్కువశాతం కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉండడంతో ఈ పరిస్థితి దాపురించినట్లు విద్యావంతులు, మేధావులు చర్చించుకుంటున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతోంది. వివిధ సర్వే నంబర్లలో.. సర్వే నంబరు 292ఇలో 208 గజాల స్థలాన్ని టైలరింగ్ అసోషియేషన్‌కు కేటాయించారు. 309, 310 సర్వే నంబరులో 1040 గజాలు వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ, 311/62లో 560 గజాలు రెడ్డిసేవా సమితి, 281లో 244 గజాలు అంబేద్కర్ సంఘం, 305/8, 307లో 282 గజాలు రైస్ మిల్లర్స్ అసోషియేషన్, 24/అ, 24/ఆలో 644 గజాలు కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోషియేషన్‌కు కేటాయించారు. అలాగే 305, 307లో 282 గజాలు ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరమ్మ విద్యాలయం, 302అ, 303ఆ2లో 264 గజాలు రిక్రియేషన్ క్లబ్, 26, 27, 77/లో 605 గజాలు బుడగ జంగాల హక్కుల పోరాట సంఘం, 26అ, 26ఆ, 13లో 813 గజాలు మాల మహానాడు, 303ఇ, 303అలో 223 గజాలు వస్త్ర వ్యాపార సంఘం, 308, 309లో 312 గజాలు శాలివాహన సంఘం 301/6లో492 గజాలు బాబు జగ్జీవన్‌రావ్ సంక్షేమ సంఘం, సర్వేనెంబరు 33లో మదురానగర్‌లో 2,100 గజాల స్థలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పంచాయతీ వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఇవి కొన్ని మాత్రమే. స్థలాల కేటాయింపులు ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. కేటాయించిన వాటిలో కూడా చాలా వరకు భవన నిర్మాణాలు జరగలేదు. ఆయా సంఘాలు ఆస్థలాలను అద్దెకు ఇచ్చుకుంటున్నాయి. స్థలాలు కేటాయించేది ఎవరు? పంచాయతీ, ప్రభుత్వ స్థలాలను సంఘాలు, ఇతరులకు కేటాయించాలంటే తీర్మానం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించాలి. అనుమతి కోసం కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించి కేబినెట్ నిర్ణయం తర్వాత కేటాయింపులు జరగాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా స్థలాల కేటాయింపులు జరిగాయి.ఈ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా నేటికీ అచ్చంపేట మున్సిపల్ అధికారులకు తెలియదంటే అతిశయోక్తి. ప్రజా అవసరాలు అక్కరల్లేదా? పట్టణ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పాట్లు చేసే రియల్ వెంచర్లు వ్యాపారులు 10 శాతం భూమిని మున్సిపల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. దీని మున్పిపాలిటీ ప్రజా అవసరాలకు వినియోగించాలి. ప్రభుత్వ భవనాలు, పార్కులు ఇతర అవసరాలకు ఈ స్థలం ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
బల్మూర్ (అచ్చంపేట) : ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాత్రి సమయంలో ఎద్దు అడ్డు రావడంతో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కొండనాగుల సమీపంలో అచ్చంపేట ప్రధాన రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ విక్రం కథనం ప్రకారం.. కొండనాగులకు చెందిన వలూవాయి నర్సింహ(40) రామాజిపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఊశయ్య కలిసి శని వారం రాత్రి ద్విచక్రవాహనంపై రామాజిపల్లికి వెళ్తున్నారు. మార్గమధ్యలోని రైస్‌మిల్ వద్ద రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఎద్దును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం వెనక కూర్చున్న నర్సింహ తలకు తీ వ్ర గాయాలు, ఊశయ్య బలమైన గాయాలయ్యా యి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తర లిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఊ శయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హై దరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై నర్సింహ భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. నర్సింహ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థికసాయం అందజేశారు. సైకిల్‌పై నుంచి కిందపడి.. బల్మూర్ (అచ్చంపేట): మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆదినారాయణ(45) సైకిల్‌పై వెళ్తుండగా పశువులను ఢీకొనడంతో కిందపడి మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం ఆదినారాయణ తాపీ మేస్త్రీ పని కోసం తన సైకిల్‌పై కొండనాగులకు వెళ్తుండగా గ్రామ స్టేజీ సమీపంలో పశువులను ఢీకొట్టి కింద పడిపోయాడు. గమనించిన బాటసారులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించి కు టుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే గుండెపోటుతో మార్గమధ్యలోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. సంఘటనపై ఆదినారాయణ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొని.. మాగనూర్ (మక్తల్): మండలంలోని చేగుంట రైల్వేస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొని కర్ణాటకలోని యాద్గీర్ పట్టణానికి చెందిన రమేష్(38) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ నాగేశ్వర్రావ్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అచ్చంపేటలో కిడ్నాప్ కలకలం
అచ్చంపేట రూరల్ : పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను కిడ్నాప్ చేశారంటూ పుకార్లు షికార్లు చేశాయి. పట్టణంలో నూతనంగా ఏర్పాటైన పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేశారని బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లగా.. పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాల, పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత బాలిక ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడికి వెళ్లావని బాలికను ఆరా తీస్తే పాఠశాల సమీపంలో ముసుగులు వేసుకున్న కొందరు తనను వెనక నుంచి కళ్లు మూసి కిడ్నాప్ చేశారని, వారి నుంచి తప్పించుకుని వచ్చానని బాలిక తల్లిదండ్రులు, పోలీసులకు చెప్పింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బాలికతో గాలింపు చేపట్టారు. ఉమామహేశ్వరం వెళ్లే దారిలో కుడివైపు తీసుకెళ్లారని చెప్పడంతో అడవిలో, కుంచోనిమూల ప్రాంతంలో కొంత వరకు పోలీసులు కాలినడకన వెళ్లి చూసినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. తనతోపాటు నలుగురు అమ్మాయిలను ఒక వాహనంలో, మరో వాహనంలో 10 మందికిపైగా బాలికలు ఉన్నట్లు బాలిక పోలీసులకు చెప్పడంతో అడవిలో పోలీసులు పరుగులు పెట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆచూకీ కోసం తిరిగినా ఎలాంటి సమాచారం లభించలేదని, అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించామని అచ్చంపేట పోలీసులు తెలిపారు. బాలిక చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని పోలీసులు తేల్చిచెప్పారు. పుకార్లను నమ్మవద్దని ఎస్ఐలు పరశురాం, విష్ణు కోరారు. పోలీసులతోపాటు అడవి ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, రఘురాం, రహ్మతుల్లా, సాయిరెడ్డి తదితరులు సమాచారం కోసం తిరిగారు. -
వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడి మృతి
సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): అచ్చంపేట వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు సందెపోగు సత్యం(52) ఆకస్మికంగా మృతిచెందారు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లేందుకు గురువారం ఉదయం సత్తెనపల్లి రైల్వేస్టేషన్‌కు సత్యం వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిందపడిపోయాడు. మూర్ఛవ్యాధితో కిందపడిపోయాడని భావించి తోటి ప్రయాణికులు, స్థానికులు అతని చేతిలో తాళాలు, ఇనుప వస్తువులు ఉంచారు. కాసేపటికే గుండెపోటుతో మరణించాడు. సత్యం మృతదేహాన్ని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి రాంబాబు, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు సందర్శించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఆటో, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
అచ్చంపేట: టాటా ఏస్ ఆటోను, బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ శివారులోని సోలార్ ప్లాంట్ సమీపంలో శుక్రవారం జరగింది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మధ్యాహ్న భోజన బియ్యం పట్టివేత
బల్మూరు(అచ్చంపేట) : విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన బియ్యాన్ని రాత్రివేళ వంట ఏజెన్సీ నిర్వాహకులు పక్కదారి పట్టిస్తుండగా సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సంఘటన బల్మూరులో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శివశంకర్ కథనం ప్రకారం.. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వంట ఏజెన్సీ నిర్వాహకుడు మశయ్య రాత్రి 8.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజన బియ్యం సుమారు 15 కిలోలు, మంచినూనె, చింతపండును పాఠశాల గేట్ దూకి తీసుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకున్నారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకుడిని నిలదీయడంతో హెచ్ఎం తీసుకురమ్మంటే తాను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో సర్పంచ్, గ్రామస్తులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పాఠశాలలో కొంతకాలంగా జీహెచ్ఎం శ్రీనివాసమూర్తి వంట ఏజెన్సీ వారితో విద్యార్థులకు అందించాల్సిన బియ్యం, సామగ్రి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాడని సర్పంచ్ ఆరోపించారు. దీనిపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేసి హెచ్‌ఎంతోపాటు ఏజెన్సీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై హెచ్ఎం శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా వంట మనిషి బియ్యం తరలించిన విషయంతో తనకు సంబంధం లేదన్నారు. పాఠశాల ఎస్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన వివాదంతో సర్పంచ్‌తోపాటు ఆయన వర్గీయులు కావాలని ఇబ్బందులకు గురిచేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఏజెన్సీ వారికే సంబంధమని శనివారం తాను విధులకు రాకపోవడంతో బియ్యం మిగిల్చి తీసుకెళ్లి ఉండవచ్చని హెచ్ఎం చెప్పుకొచ్చారు. -
ప్రమాణ స్వీకారం ఎప్పుడో?
40 రోజుల క్రితమే మార్కెట్ కమిటీ కార్యవర్గం ఎంపిక రెండుసార్లు వాయిదా పడిన కార్యక్రమం అధికార పార్టీ నాయకుల్లో నైరాశ్యం అచ్చంపేట : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటుచేసి 40రోజులవుతున్నా ఇంతవరకు ప్రమాణ స్వీకారం జరగలేదు. వాస్తవానికి గత నెల 7న అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పోశం జయంతి గణేష్‌ను నియమించినట్టు రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట అదే నెల 14న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనా వర్షం కారణంగా వాయిదా పడింది. తిరిగి ఈనెల7న ప్రమాణ స్వీకారం జరుగుతుందని అందరూ భావించారు. అయితే రోడ్డు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు జ్వరం రావడంతో రెండోసారి వాయిదా వేశారు. దీంతో అధికార పార్టీ నేతల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. రిజర్వేషన్లో బీసీ మహిళకు అవకాశం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లతో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బీసీ మహిళకు రిజర్వు అయింది. ఈ పదవిపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఎమెల్యే గువ్వల బాలరాజు అమ్రాబాద్ మండలం మాధవానిపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పోశం గణేష్ భార్య జయంతికి అవకాశం కల్పించారు. ఇక వైస్‌చైర్మన్ పదవి బల్మూర్ మండలం రామాజీపల్లికి చెందిన మల్లిరెడ్డి Ðð ంకట్‌రెడ్డిని వరించింది. వీరితోపాటు డైరెక్టర్లుగా అచ్చంపేటకు చెందిన గాలిముడి రత్నమ్మ, ఎం.డి.అమీనొద్దీన్, ఉప్పునుంతల మండలం మర్రిపల్లి మాజీ సర్పంచ్ బాలీశ్వరయ్య, వెల్టూర్ మాజీ సర్పంచ్ లింగం, అమ్రాబాద్‌కు చెందిన రాజలింగం, లింగాలకు చెందిన వెంకటగిరి ఎంపికయ్యారు. అనుచరులకు సముచిత స్థానం పోశం జయంతీగణెష్ అమ్రాబాద్ జెడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడిగా ఉన్న గణేష్‌కు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆమెకు ఇటీవల మార్కెట్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అమ్రాబాద్ మండలానికి ఈ పదవి దక్కడం ఇదే మొదటిసారి. ఇక వైస్ చైర్మన్ ఎం.వెంకట్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి పనిచేస్తూ గువ్వల అనుచరునిగా ఉన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం ఏడాది మాత్రమే ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 40రోజులు గడిచిపోవడంతో ఈ పదవిలో పదిన్నర నెలలు మాత్రమే కొనసాగుతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లుగడిచిపోయింది. ప్రభుత్వం సకాలంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసి ఉంటే ఇప్పటి వరకు ముగ్గురు చైర్మన్లు ఎంపికయ్యేవారు. పదవులు ఆశిస్తున్న వారిలో ఒకింత నిరాశే మిగిలింది. -
స్వచ్ఛ పురపాలికలు
ఓడీఎఫ్ పట్టణాలుగా అచ్చంపేట, షాద్‌నగర్ తెలంగాణలో 5 పట్టణాల్లో 2 పాలమూరు జిల్లావే.. ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ముందడుగు వేసిన కమిషనర్లు స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) కింద బహిరంగ మలమూత్ర విసర్జనరహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా జిల్లాలోని షాద్‌నగర్, అచ్చంపేట పట్టణాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఐదు పురపాలికలకు ఓడీఎఫ్ గుర్తింపు రాగా, అందులో రెండు మన జిల్లావే ఉండటం విశేషం. సంపూర్ణ పారిశుద్ధ్య పట్టణాలుగా తీర్చిదిద్దడంలో మరుగుదొడ్ల అవశ్యకతను గుర్తించిన ఆయా పురపాలిక కమిషనర్లు వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలని సంకల్పించి, లక్ష్యసాధనలో వారు సఫలీకృతులయ్యారు. ఓడీఎఫ్ గుర్తింపు వచ్చిన పట్టణాలపై ఈ ఆదివారం ప్రత్యేక కథనం.. – అచ్చంపేట/షాద్‌నగర్ పారిశుద్ధ్య సమస్య నివారించేందుకు అచ్చంపేట నగరపంచాయతీ, షాద్‌నగర్ మున్సిపాలిటీల్లో బహిరంగ మలవిసర్జన ప్రాంతాలను గుర్తించేందుకు ఆయా పట్టణాల కమిషనర్లు కె.జయంత్‌కుమార్‌రెడ్డి (అచ్చంపేట), రామాంజులరెడ్డి (షాద్‌నగర్) శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కౌన్సిలర్లు, మహిళ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, ఆయా వార్డుల్లో మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటిని గుర్తించారు. మున్సిపల్ సిబ్బంది, అధికారులు బృందాలుగా విడిపోయి ఇంటింటి సర్వే చేపట్టి వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారి వివరాలు సేకరించారు. అచ్చంపేట నగరపంచాయతీలో 6,224 ఇళ్ల ఉండగా 600 ఇళ్లలో, షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో18,005 ఇళ్లు ఉండగా 772 ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లుగా గుర్తించారు. ఆ వెంటనే వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అచ్చంపేటలోని దర్శన్‌గడ్డలో మొదటిదశలోనే వందశాతం పూర్తి చేశారు. మరుగుదొడ్ల యొక్క ఆవశ్యకతపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, వార్డుల్లో మరుగుదొడ్లు లేని ఇళ్లను పూర్తి చేయించే దిశగా అధికారులు అడుగులు వేసి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) కింద బహిరంగ మల విసర్జనరహిత ప్రాంతాలుగా గుర్తింపు కోసం థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఈరెండు పట్టణాలు ఎంపికయ్యాయి. ఓడీఎఫ్ గుర్తించారు ఇలా.. ఆయా పట్టణాలకు దూరంగా ఉన్న వీధులు, పాత బస్తీలు, కాలనీలు, దినసరి కూలీలు ఉన్న ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేన్నట్లు గుర్తించారు. వార్డు కౌన్సిలర్లు, మహిళా సంఘాల సహకారంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సిన అవశ్యకతపై ఇంటి యాజమానులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరించి, మరుగుదొడ్లు మంజూరు చేపట్టారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి నిర్మాణం చేయించారు. అచ్చంపేట నగరపంచాయతీ ఒక అడుగుముందుకేసి ఆర్థిక ఇబ్బందులున్న వారికి ఇతరుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయించారు. లక్ష్యం సాధించిన కమిషనర్లు ఈవిషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ప్రొటోకాల్ ప్రకారం ఓడీఎఫ్ గుర్తింపు కోసం ముందుగా వార్డులు, పట్టణాలను స్వయంగా ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక అందించాలి. తర్వాత 30రోజుల వ్యవధిలో ఆ శాఖ తనఖీ చేస్తుంది. సేవాస్థాయి అంచనా (నిర్మాణం, గృహ లభ్యత, కమ్యూనిటీ, ప్రజా మరుగుదొడ్లు) స్వతంత్ర పరిశీలనల అంచనా ఆధారంగా నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్రం నుంచి వచ్చిన బృందం మురికి వాడ, పాఠశాల, ప్రభుత్వ మార్కెట్ స్థలాలు, మతపరమైన స్థానంలో, నివాస ప్రాంతం, బస్టాండు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేస్తారు. రోజు మొత్తం ఏ సమయంలో కూడా ఒక్క వార్డులో గానీ, పట్టణంలోని గానీ ఒక్కరు కూడా బహిరంగ మలవిసర్జన చేయకపోతే బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతంగా నిర్ధారిస్తారు. అవార్డులు.. అచ్చంపేట నగరపంచాయతీ కలెక్టర్ టీకే శ్రీదేవి నుంచి జిల్లా స్థాయిలో ఓడీఎఫ్ అవార్డుతో పాటు రూ.25వేల నగదు అందుకున్నారు. గతేడాది హారితహారం కింద కలెక్టర్ నుంచి ప్రశంసలు, అవార్డు అందుకోగా, ఈ ఏడాది హరిత మిత్ర కింద రాష్ట్రస్థాయి అవార్డుతో పాటు రూ.లక్ష ప్రకటించారు. షాద్‌నగర్ సైతం స్వచ్ఛ పట్టణంగా జిల్లాస్థాయిలో అవార్డు అందుకుంది. అందరి సహకారంతోనే.. పట్టణ ప్రజలు, చైర్మన్, కౌన్సిలర్లు, మహిళ సంఘాలు, నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈఘనత సాధించాం. పేదలకు మరుగుదొడ్లు నిర్మించడం, ఉత్తమ నగరపంచాయతీగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చినందుకు గర్వంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో చోటు దక్కడం సంతోషంగా ఉంది. ప్రణాళికతో ముందుకు ఎవళ్లడం వల్లనే లక్ష్యాన్ని సాధించగలిగాం. – కె.జయంత్‌కుమార్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్, అచ్చంపేట దాతలు, ప్రజలు సహకరించారు దాతలు, ప్రజలు సహకరించడంతోనే వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి వ్యక్తిగత మరుగుదొడ్డి లేకపోవడం వల్ల కలిగే రోగాల గురించి వివరించాం. 90రోజుల్లో 862వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.12వేలు ప్రతి లబ్ధిదారుడికి అందచేసింది. కానీ నిర్మాణానికి రూ.15వేల ఖర్చు వస్తుండటంతో కొందరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు రాలేదు. పట్టణంలోని కొందరు దాతల సహకారంతో రూ.3వేల వరకు లబ్ధిదారుడికి అందచేశాం. దీంతో 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యింది. ప్రజల సహకారం ఉంటే బహిరంగ మల విసర్జనను పూర్తిగా ఆరికడతాం. – రామాంజులరెడ్డి, మున్సిపల్ కమిషనర్, షాద్‌నగర్ -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
అచ్చంపేట రూరల్ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ జీఓ వచ్చిన రోజని ఆ రోజున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించాలని కోరారు. సార్వత్రిక సమ్మెకు తమ మద్ధతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, శ్రీనివాస్, మక్బూల్అలీ, వెంకటేష్, రఘునాథ్‌రెడ్డి, అష్రఫ్, శంకర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయడంపై హర్షం
లింగాల: కొత్తగా ఏర్పాటవుతున్న నాగర్‌కర్నూల్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రంమైన అచ్చంపేటను రెవెన్యూ డివిజన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించడంపై గురువారం ఎంపీపీ చీర్ల మంజుల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌గా మారితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ కిషన్‌నాయక్,ఎంపీటీసీ అల్లె ప్రియాంక,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ, నాయకులు చీర్ల కష్ణ,అల్లె శ్రీనివాసులు ముఖ్యమంత్రికి కతజ్ఞతలు తెలిపారు. -
20న నిరుద్యోగులకు ఇంటర్య్వూలు
అమ్రాబాద్ : ఈ నెల 20న అచ్చంపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు విలేకరులతో తెలిపారు. ఉపాధి కల్పన కోసం వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు 10వతరగతి నుంచి డిగ్రీ చదివిన 18నుంచి 26 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
నీళ్లున్నా.. నిట్టూర్పే!
రామన్‌పాడుకు జలకళ.. తాగునీటి పథకాలు విలవిల 4నెలలుగా నిలిచిన అచ్చంపేట రక్షిత తాగునీటి పథకం కొనసా..గుతున్న పైపుల పునరుద్ధరణ పనులు వర్షాకాలంలోనూ 120 గ్రామాలకు అందని నీళ్లు – రామన్‌పాడు ప్రస్తుతం నీటిమట్టం: 1022 – అచ్చంపేట పథకానికి అవసరమయ్యే నీళ్లు(రోజుకు): 18ఎంఎల్డీ – నీటి సరఫరా నిలిచిన నియోజకవర్గాలు: 3 గోపాల్పేట: నీటి వనరులు కళకళడుతున్నా తాగునీటికి నిట్టూర్పే..! వర్షాకాలంలోనూ గుక్కెడు నీళ్ల కోసం అర్రులు చాచాల్సిందే.. ప్రధాన తాగునీటి వనరు రామన్‌పాడు రిజర్వాయర్‌లో పుష్కలంగా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి. కారణం పైప్లైన్లు తరచూ పగిలిపోవడమే.. పైపుల మరమ్మతు పనులు ఇంకా కొనసా.. గుతూనే ఉన్నాయి. వేసవిలో రామన్‌పాడు రిజర్వాయర్ ఎండిపోవడంతో నీళ్లు లేక నాలుగు నెలలుగా పూర్తిస్థాయిలో అచ్చంపేట రక్షిత తాగునీటి పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 120 గ్రామాలకు నీళ్లందడం లేదు. ఇదిలాఉండగా, ఇటీవల కురిసిన వర్షాలతో పాటు జూరాల నుంచి దిగువకు వదిలిన నీటితో రామన్‌పాడు రిజర్వాయర్ నిండింది. ప్రస్తుతం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. అయినప్పటికీ అచ్చంపేట రక్షిత మంచినీటి పథకం నీటి సరఫరాను పునరుద్ధరించడం లేదు. ప్రస్తుతం రామన్‌పాడు నుంచి వనపర్తి, మహబూబ్‌నగర్ పట్టణాలకు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. తరచూ పైప్లైన్లకు మరమ్మతులు రామన్‌పాడు తాగునీటి పథకానికి గతంలో నాసిరకం పైపులు వాడడంతో తరచూ అవి పగిలిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం పైపులను మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.15కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ఇటీవల తెలిపారు. వేసవిలో రిజర్వాయర్ అడుగంటిన క్రమంలో పైపుల పునరుద్ధరణ ప్రక్రియకు ఉపక్రమించారు. దీంతో మార్చి 25 నుంచి రామన్‌పాడు హెడ్‌వర్క్స్, గోపాల్పేట పంప్‌హౌస్‌లో మోటార్లు నిలిచిపోయాయి. పగిలిపోయిన జీఆర్పీ, ఎంఎస్ పైపుల స్థానంలో డీఐ పైపులను బిగిస్తున్నారు. ఇంకా వనపర్తి, కొత్తకోట మండలాల్లో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండడంతో తాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అయితే ఈ పథకం ద్వారా నీళ్లను సరఫరా చేస్తుందోలేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో నీటిఎద్దడి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వేసవిలో గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. అంతవరకు రామన్‌పాడు నీటిపైనే ఆధారపడిన ప్రజలు రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో నీళ్లు దొరక్క నానాకష్టాలు పడ్డారు. లీజు బోర్ల ద్వారా నీటి అవసరాలను తీర్చలేక అధికారులు, సర్పంచ్‌లు అవస్థలు ఎదుర్కొన్నారు. చాలా గ్రామాల్లో వాటర్ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. గోపాల్పేట మండలంలో 71లీజుకు బోర్లు తీసుకున్నారు. 92స్కీం బోర్లు పనిచేస్తున్నప్పటికీ తక్కువనీళ్లు వస్తున్నాయి. 324 చేతిపంపులకు 20మాత్రమే పని చేస్తున్నాయి. ఇదీ పథకం లక్ష్యం గ్రామీణ ప్రజలకు సురక్షితమైన కృష్ణాజలాలను అందించాలనే సంకల్పంతో 2003లో రామన్‌పాడు తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో రూ.61కోట్లతో 136 గ్రామాలకు ఈ నీళ్లను అందించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ ముందుగా నిర్దేశించిన పథకం ప్రకారం కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఈ పథకం వ్యయం ఇప్పటివరకు రూ.90కోట్లపైగా చేరింది. ఈ పథకం ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 120 గ్రామాలకు రామన్‌పాడు నీళ్లు అందిస్తున్నారు. 10రోజుల్లో సరఫరా పునరుద్ధరణ రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దెబ్బతిన్న జీఆర్పీ, ఎంఎస్ పైపుల స్థానంలో డీఐ పైపులను అమర్చుతున్నాం. 8 ప్యాకేజీల పనులూ చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం రాజనగరం వద్ద ఓ రైతు పొలంలో జీఆర్పీ పైపుల స్థానంలో డీఐ పైపుల ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు కొత్తకోట మండలంలో ఎంఎస్ స్థానంలో డీఐ పైపుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి మరో పదిరోజుల్లో నీటి సరఫరాను ప్రారంభించారు. – మేఘారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
అచ్చంపేట: ఎలుగుబంటి దాడిలో ఓ రైతు మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోడ్యానాయక్(50) తన పొలం వద్దకు తెల్లవారుజామున వెళ్లాడు. కంచెలో ఎలుగుబంటి చిక్కుకుంది. దానిని అడవి పంది అనుకొని వెళ్లగొట్టేందుకు దగ్గరికి వెళ్లగా.. ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో బోడ్యా నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కంచె ఉచ్చులో ఇరుక్కుపోయిన ఎలుగుబంటి బోడ్యా శరీర భాగాలను చీల్చి వేసింది. దీంతో ఎలుగుబంటిని బయటికి తీయడానికి హైదరాబాద్ జూ పార్కుకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటికి బాణంతో మత్తు ఇంజక్షన్లు ఇచ్చి.. అది మత్తులోకి జారుకున్న తర్వాత బోనులోకి ఎక్కించి జూ పార్కుకు తరలించారు. -
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు..
- వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయితీ ఎన్నికల ఫలితాలు నేడు - ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాక్షి నెట్వర్క్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలుకాగా, సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితాలు వెలువడే అవకాశముంది. ఈ కార్పొరేషన్లు, నగర పంచాయతీకి ఈ నెల 6న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు సంబంధించి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 58 డివిజన్లకుగాను ప్రధాన రాజకీయ పక్షాలు, స్వతంత్రులు కలిపి మొత్తం 398 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 60.28 శాతం ఓటింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 390 మంది సిబ్బందిని నియమించారు. ఖమ్మం కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు పత్తిమార్కెట్లో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 50 డివిజన్లకు గాను 291 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 1,79,827 మంది ఓటు వేశారు. మరోవైపు అచ్చంపేట నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు మండల రిసోర్స్భవనంలో జరుగనుంది. 20 వార్డులకుగాను 57 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... 70.88 శాతం పోలింగ్ నమోదైంది. -
ప్రశాంతంగా అచ్చంపేట పంచాయతీ ఎన్నికలు
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఎండలో నిలుచుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20వార్డులకుగానూ 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 57 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 70.88 శాతం ఓటింగ్ నమోదైంది. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ 13, టీడీపీ 4, బీజేపీ 3, స్వంతంత్రలు 17 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ పి.విశ్వప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. -
పేకాట స్థావరంపై దాడి, నలుగురి అరెస్ట్
అచ్చంపేట : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట పోలీసులు నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. స్థానిక కేరళ పాఠశాల సమీపంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, సెల్ఫోన్లతోపాటు రూ.30,370 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
అచ్చంపేటలో రాస్తారోకో
అచ్చంపేట : గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం జరిగింది. విద్యార్థి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని.. మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లింగాల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము(16) అనే విద్యార్థి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై అతని తల్లిదండ్రులు తమ కొడుకుది ఆత్మహత్య కాదని ఆరోపిస్తున్నారు. -
మళ్లీ ఆడపిల్లే పుట్టిందని..
అచ్చంపేట (మహబూబ్‌నగర్ జిల్లా) : నాలుగవసారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఓ దంపతులు పుట్టిన పాపను ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో చోటుచేసుకుంది. సింగారం గ్రామానికి చెందిన భీంజీ,లలిత దంపతులకు గతంలో ముగ్గురు ఆడపిల్లలు సంతానం. భీంజీ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో హమాలీగా పని చేస్తున్నాడు. కాగా మగపిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వారికి నాలుగవ సంతానంగా కూడా ఆడపిల్లే పుట్టింది. దీంతో పాపను పెంచలేమని చెప్పి ఆ పసికందును ఐసీడీసీ అధికారులకు అప్పగించారు. ఐసీడీసీ అధికారులు బాలికను శిశువిహార్‌కు తరలించనున్నట్లు సమాచారం. -
'కేంద్ర ప్రభుత్వ సహకారంతో బంగారు తెలంగాణ'
మహబూబ్‌నగర్: రాజకీయ దురహంకారంతోనే టీఆర్ఎస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు వ్యహరిస్తుందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట వచ్చిన ఆయన మాట్లాడుతూ... బంగారు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. -
పిల్లలు ఊయల్లో.. తల్లులు ఆపరేషన్ థియేటర్లో..
అచ్చంపేట: ఈ ఫొటోలో ఉన్న చెట్లకు ఇన్ని ఊయలలు వేలాడుతున్నాయంటే.. ఇదేదో బాలికా శిశు సంరక్షణ కేంద్రం అయ్యింటుందేమో అనుకుంటే పొరపాటే. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు వచ్చిన తల్లులు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేముందు వారి పిల్లలను ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్లకు ఊయలలు కట్టి అందులో పడుకోబెట్టారు. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో దర్శనమిచ్చింది. ఎనిమిది నెలల తర్వాత కుటుంబ నియంత్రణ శిబిరం ఏర్పాటు చేయడంతో 176 మంది మహిళలు ఆపరేషన్ల కోసం తరలివచ్చారు. -
మావోయిస్టుల ఊసే లేదు
కల్వకుర్తి : కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్ల నియోజకవర్గం పరిధిలో చెక్‌జంగ్ అనే పేరుతో మావోయిస్టుమంటూ పోస్టర్లు వేయడం ఆకతాయిల పనేనని ఓఎస్డీ చెన్నయ్య కొట్టిపారేశారు. ఆయా ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో నక్సల్స్ ఊసేలేదని, కేవలం ఆకతాయిల అయిఉంటారని తేల్చారు. బుధవారం ఆయన కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకొని పోస్టర్లు వేస్తున్నారని అన్నారు. పోస్టర్లు వేసిన వారిని మరో రెండు, మూడు రోజుల్లో అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. చెక్‌జంగ్ పేరు మావోయిస్టులకు సంబందించిన దళాలకు లేదని, ఏదో ఒక పేరు చెప్పి ప్రజలను భయపెట్టే వారిని కఠినంగా శిక్షిస్తామని ఓఎస్డీ హెచ్చరించారు. రాడికల్స్, నక్సల్స్ భావాలున్న వ్యక్తులపై సైతం ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సమాజంలో శాంతిని పెంపొందిస్తూ, ప్రజల సఖ్యత కోసం కృషిచేస్తామన్నారు. సమావేశంలో షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు పాల్గొన్నారు. -
కాగితపు పరిశ్రమ కలేనా?
అచ్చంపేట : విస్తారమైన వెదురు వనాలు, నిష్ణాతులైన కూలీలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో కాగితపు పరిశ్రమ దశాబ్దాలుగా హామీగానే మిగిలింది. అటవీ, మైదాన ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు లభిం చకపోవడంతో వలసబాటే మార్గమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సిన కాగితపు పరిశ్రమ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో నాగర్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు రెండుగా విడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీప్రాంతం మహబుబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోకి 2,220 చదరపు కిలోమీటర్ల మేర ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూమి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో మూడో వంతున వెదురు వనాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు 1100 చదరపు కిలోమీటర్ల మేర వెదురు వనాలు ఉన్నట్లు అటవీశాఖ అంచనా. అభయార్యణ ప్రాంతం కాకముందు నల్లమల అటవీప్రాంతం నుంచి సేకరించిన వెదురును ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమకు నెలకు వెయ్యి లారీల చొప్పున తరలించేవారు. ప్రస్తుతం అభయారణ్య ప్రాంతం కాని ప్రదేశాల్లో మాత్రమే వెదురు కలపను సేకరిస్తున్నారు. ఏటా జిల్లాలోని అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని కొల్లాపూర్, లింగాల రేంజ్‌లలో మాత్రమే వెదురు కలప సేకరణ జరుగుతుంది. కొల్లాపూర్‌లో డంప్‌యార్డును ఏర్పాటుచేశారు. అచ్చంపేట, మన్ననూర్, అమ్రాబాద్ రేంజ్‌లు అభయారణ్య ప్రాంతం కావడంతో ఇక్కడ వెదురు సేకరణను నిలిపేశారు. ఇదే అదనుగా నల్లమలలోని వెదురువనాలపై స్మగ్లర్ల కన్ను పడింది. లక్షల విలువ చేసే వెదురు కలపను దొంగదారిన ప్రకాశం, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెదురు సేకరణ ఇలా.. నల్లమలలో వెదురు విస్తారనంగా ఉన్నా సేకరించలేకపోతున్నారు. కాంట్రాక్టర్, కూలీల కొరతే ఇందుకు కారణమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి వెదురు సేకరణ వల్ల ఏటా రూ.75లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతుంది. 2010-11లో 7.50 లక్షల వెదురు కర్రల సేకరణే లక్ష్యంగా నిర్ణయించగా నాలుగు లక్షలను మాత్రమే సేకరించగలిగారు. 2011-12 టార్గెట్ ఆరు లక్షల కర్రలకు రూ.4.87లక్షలు సేకరించారు. 2012-13లో 9లక్షలకు గాను ఐదు లక్షల వెదురుకర్రలను మాత్రమే సేకరించారు. 2013-14లో 15 లక్షలు లక్ష్యం కాగా, నాలుగు లక్షలు వచ్చింది. కాగా, 2014-15 సంవత్సరాన్ని క్రాప్హాలిడేగా ప్రకటించడంతో సేకరణ నిలిచిపోయింది. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వెదురు కలప సేకరణలో నిష్ణాతులైన ఈ ప్రాంత కూలీలు మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు పనులకు వెళ్తున్నారు. కలిసొచ్చే అవకాశాలివే..! మహబూబ్‌నగర్ జిల్లా సమీప నల్లమల అటవీప్రాంతం నుంచే కృష్ణానది ప్రవహిస్తోంది. అచ్చంపేటకు 40 కిలోమీటర్లు, లింగాల మండలానికి కేవలం 10 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఒకవేళ ఈ ప్రాంతంలో కాగితపు పరిశ్రమను ఏర్పాటుచేస్తే కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా పుష్కలంగా నీటిని వాడుకోవచ్చు. పరిశ్రమకు అవసరమయ్యే విద్యుత్‌ను అచ్చంపేట నుంచి పొందే అవకాశం ఉంది. ఏటా పాలమూరు జిల్లా నుంచి సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలసవెళ్తున్నట్లు అంచనా. ముఖ్యంగా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నారాయణపేట ప్రాంతాల నుంచి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటుచేస్తే వీరికి ఉపాధి దొరకే అవకాశం ఉంది. ఏడాదిగా కలప సేకరణ నిలిపివేత కొల్లాపూర్, లింగాల రేంజ్‌ల పరిధిలో ఈ ఏడాది వెదురు సేకరణ ఉండదు. ఒక టి, రెండు సంవత్సరాల పాటు సేకరణ నిలి పేయడం వల్ల కర్ర దృఢంగా పెరుగుతుం ది. 2014-15 సంవత్సరంలో వెదురు సేకరణ నిలిపేశాం. కూలీల కొరత, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం. - వెంకటరమణ, డీఎఫ్ఓ. అచ్చంపేట -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
అచ్చంపేట : మండలంలోని కొండూరు కొండ ప్రాంతాల్లో బుధవారం ఇంట్లో నుంచి 50 రోజుల కిందట వెళ్లిపోయిన యువకుడి పుర్రె, ఎములకు గుర్తించారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన గరటా రవితేజ (16) తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30 రాత్రి ఎనిమిది గంటలకు తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అదేరోజు రాత్రి 10:15కు కొండూరుకు చెందిన పులి వీరంరాజు కుమారుడు గోపీకృష్ణ ఫోను చేసి రవితేజ ఉన్నాడా అని అడిగాడని, విషయం ఏమిటని అడిగేంతలో ఫోను పెట్టేశాడని చెప్పాడు. ఆ తరువాత తమ కుమారుడి కోసం వెతకని చోటు లేదని, బంధువులు, స్నేహితులు అందరిని విచారించి సమాచారం దొరకకపోవడంతో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, మరో రెండు రోజులు చూడు మీ అబ్బాయి తప్పక వస్తాడని చెప్పారని తెలిపారు. అవశేషాలు లభించిన ప్రదేశంలో మృతుడి పుర్రె, ఎముకలు, మిగిలిన అవశేషాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతుని చొక్కా, ప్యాంటు, చెప్పులు పడి ఉన్నాయి. అవి తమ పిల్లవాడివేనని తల్లిదండ్రులు గుర్తించారు. అక్కడే పురుగుమందు బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అచ్చంపేట ఎస్ఐ అనిల్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ చేపట్టారు. పుర్రె, ఎముకలను సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. ముమ్మాటికీ హత్యే : మృతుడి తండ్రి మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దొడ్లేరు పాలకేంద్రంలో పాలు పోయించుకుంటానని, తమ కుమారుడు సత్తెనపల్లిలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడని, గోపీకృష్ణ కూడా అదే కాలేజీలోనే చదివాడని తెలిపాడు. తమ పిల్లవాడు పాసయ్యాడని, గోపీకృష్ణ తప్పి ఇంట్లో పాసైనట్లు చెప్పాడని ఈ క్రమంలో ఏదైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించాడు. -
ప్రాణం తీసిన సరదా
కాంసానిపల్లి (ఉప్పునుంతల), న్యూస్‌లైన్ : అతను పదో తరగతి విద్యార్థి.. ఇటీవ లే వార్షిక పరీక్షలు రాశాడు.. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో శుభకార్యంలో పాల్గొనడానికి తాతయ్య ఇంటికి వచ్చాడు.. బంధుమిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా గడిపాడు.. అది ఎంతోసేపు నిలువలేదు.. వరసకు తమ్ముళ్లతో కలిసి సరదాగా సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు.. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన పద్మమ్మ, వెంకటేష్ దంపతులకు కుమారుడు శివకుమార్ (15), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్లుగా వీరందరూ హైదరాబాద్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ బాలుడు నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఇటీవలే వార్షిక పరీక్షలు రాశాడు. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండటంతో తల్లి సూచన మేరకు శుక్రవారం ఉదయం ఉప్పునుంతల మండలం కాంసానిపల్లిలోని తాతయ్య మాడిశెట్టి నారయ్య ఇంటికి వచ్చాడు. అదేరోజు బంధువుల ఇంట్లో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం వరసకు తమ్ముళ్లు (చిన్నమ్మల కొడుకులు) సతీష్, రాఘవేందర్‌తో కలిసి సమీపంలోని కోరండం బావికి సరదాగా ఈత కోసం వెళ్లాడు. కొద్దిసేపటికే నీట మునిగి మృత్యువాతపడ్డాడు. ఇది గమనించిన ఇద్దరు పిల్లలు వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి విషయాన్ని తాతయ్యతో పాటు గ్రామస్తులకు తెలిపారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని అరగంట పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగి పోయారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చి బాలుడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. -
పులి దెబ్బ...
అచ్చంపేట, న్యూస్‌లైన్: శ్రీశైలం-నాగార్జునసాగర్ రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులుల మనుగడ ప్రశ్నార్ధకంగా మా రిందని పలువు రు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అమ్రాబాద్ మండలం నల్లమల ప్రాంతంలోని చెంచుకుర్వ వద్ద ఓ పెద్దపు లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం వెలుగులోకి రావడంతో అటవీ అధికారులు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. పులుల గణన ప్రారంభమైన ఈ తరుణంలోనే పెద్దపులి మృత్యువాత పడడం అటవీ సిబ్బందిని అదరగొట్టింది. అటవీ అధికారులు ఫీల్డ్ డెరైక్టర్ రా హుల్పాండే, డీఎఫ్ఓ వెంకటరమణ, సం ఘటన ప్రాంతాన్ని సందర్శించి మృతికి కారణాలు , అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అది గత నాలుగు రోజుల కింద ట మృతి చెంది ఉండవచ్చునని దాని తల భాగం, ముందు కాళ్లు కుళ్లి పోయాయని దాని వయస్సు సుమారు 8ఏళ్లుంటుందని అంచనావేస్తున్నారు. పులి వెనుక భాగంలోని రెండు కాళ్ళు మినహాయిస్తే శరీర భాగాల్లో ఎక్కడా గాయాలు లేవు. అది వి షయప్రయోగం వల్లగానీ, అనారోగ్యంతో కానీ మృతిచెంది ఉండవచ్చని భా విస్తున్నారు. మృతి చెందిన తర్వాత ఆ దా రి గుండా వెళ్లిన వారు గోళ్ల కోసం కాళ్ళను నరికి ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించాక విషయం తెలుస్తుందని అన్నారు. సంఘటన వద్దకు వెళ్లిన వారిలో ఏసీఎఫ్ కిష్టగౌడ్, ఎఫ్ఆర్వో లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక అందాకే స్పష్టత... పులి కళేబరానికి ఫారెస్టు శాఖ(ఢిల్లీ)కి చెం దిన ఇమ్రాన్ ,హెద్రాబాద్ జూపార్క్ డా క్టర్ శ్రీనివాస్, స్థానిక వైధ్యాధికారులు పెద్దపులికి శవపరీక్ష జరిపారు. శాంపిల్స్‌ను సీసీఎంఈ, జూపార్క్, బీబీఆర్ఐకి చెందిన మూడు ల్యాబ్‌లకు పంపారు. నివేదిక వచ్చాకన దాని మృతిపై స్పష్టత వ స్తుందని అటవీశాఖ ఫీల్డ్ డెరైక్టర్ రాహుల్‌పాండే విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. బాధ్యులపై వేటు రిజర్వు ఫారెస్టులో పెద్దపులి మృతిచెంది నాలుగురోజులైనా సమాచారం తెలుసుకోడంలో విఫలమైన సిబ్బందిపై వేటు పడింది. ఇందుకు సంబంధించిన బీఎఫ్ఓ, ముగ్గురు ట్రాకర్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎఫ్డీ తెలిపారు. సమావేశంలో డీఎఫ్ఓ వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
కల్యాణం.. కమనీయం
శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం కొండ కింద ఉన్న భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంటే... ఆహా... ఏమి భాగ్యం అంటూ అశేష భక్తుజనం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణమండపంలో స్వామివార్ల కల్యాణోత్సవ వేడుక నిర్వహించారు. - న్యూస్‌లైన్, అచ్చంపేట ప్రతి ఏటా మకర సంక్రాంతి పర్వదినం రోజు నుంచి ఉమామహేశ్వర క్షేత్రం క్షేత్రంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా క్షేత్రం కొండ కింద భోగ మహేశ్వరంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా చేశారు. బుధవారం రాత్రి అచ్చంపేట శ్రీ భ్రమరాంబ ఆలయంతో పాటు నియోజక వర్గంలోని మండలాలు, గ్రామాల నుంచి ప్రభోత్సవాలు బయల్దేరి, గురువారం ఉదయం భోగమహేశ్వరం చేరుకున్నాయి. తెల్లవారుజామున ఉమామహేశ్వర క్షేత్రం నుంచి పార్వతీ పరమేశ్వరులను కిందకొండకు తీసుకరావడంతో కల్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణలు స్వామివార్లకు కల్యాణోత్సవ పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం వేద పండితులు వీరయ్యశాస్త్రి, నీలకంఠశాస్త్రిలు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, అచ్చంపేట, వంగూరు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులు ఉమామహేశ్వరం క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలల నుంచే గాక రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు హాజరవుతున్నారు. కళ్యాణ కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ లచ్చునాయక్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, కమిటీ సభ్యుడు చంద్రశేఖర్, అచ్చంపేట శ్రీభ్రమరాంబ దేవాలయం చైర్మన్ నల్లపుశ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బైరమోని గౌరిశంకర్, కొండురు భగీరత్నాథ్, ఆకుతోట రామనాథం, కందూరు సుధాకర్, మండికారి బాలజీ, ఎం.రామనాథం, శ్రీనివాసులు తదితరుల పాల్గొన్నారు. ఘనంగా బ్రహ్మోత్సవాలు... ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం ప్రాంతఃకాల పూజలు నిర్వహించారు. 9గంటలకు గవ్యాంత పూజలు, వాస్తు పూజ, వాస్తహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం, ప్రాతరౌపాసన, నిత్యబలిహరణ, సాయంత్రం 4గంటలకు సాయమౌపాసన, బలిహరణం, నీరాజనం, మంత్రపుష్పం, నందివాహన సేవ, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఘనంగా లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు కొల్లాపూర్‌రూరల్ , న్యూస్‌లైన్: మండలపరిధిలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం ప్రధాన ఆల యంతో పాటు రత్నగిరి కొండపై అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయంలో చైర్మన్ సురభి వెంకట జగనాదిత్య లక్ష్మారావు ఆధ్వర్యంలో కలశ పూజ, కుంకుమార్చన, అభిషేకం, తదితర కార్యక్రమాలు నిర్వహిం చారు. రాత్రి ప్ర భోత్సవం, స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహ వాహనం పై మేళతాళాల నడుమ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు ఓరుగంటి సంపత్‌కుమార్ శర్మ, సతీష్‌కుమార్ శర్మ, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు, ఆనంద్, సత్యనారాయణ, సత్యం తదితరలు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో రథోత్సవం ఆరగిద్ద (గట్టు), న్యూస్‌లైన్ : ఆరగిద్ద శివ వీరాంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన రథోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, బాజాభజంత్రీలు, విద్యుత్ దీపాలంకరణల మధ్య స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పండుగ రోజున ప్రతిఏటా వేడుకను నిర్వహించడం ఆన వాయితీ. బుధవారం ఉదయం స్వామివారికి పల్లకీసేవ నిర్వహించారు. రాత్రి 11 గంటలనుంచి రథోత్సవాన్ని నిర్వహించారు. స్థానికులతోపాటు గట్టు, గొర్లఖాన్‌దొడ్డి, తప్పెట్లమొర్సు, పెంచికలపాడు తదితర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామంలో ఓవైపు సంక్రాంతి సంబరాలు, మరో వైపు జాతర సంబరాలు ఓకే రోజున జరుపుకోవడంతో గ్రామంలో సందడి నెలకొంది. అలాగే ఆలూరు గ్రామంలో శ్రీఆంజనేయస్వామి జాతర సందర్భంగా బుధవారం రాత్రి వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పోటీపడి రథాన్ని లాగారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
బాధితుడి నుంచి రూ.4వేల లంచం డిమాండ్ అచ్చంపేట, న్యూస్‌లైన్: బాధితుడి నుంచి రూ.నాలుగువేల లం చం తీసుకుంటూ బ ల్మూర్ వీఆర్వో గుజ్జుల వెంకటయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయా డు. అతని విచారించి డబ్బును సీజ్‌చేశారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ ఎం.ప్రభాకర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. బల్మూర్‌కు చెందిన పల్లె హర్షవర్దన్‌రెడ్డి తండ్రి పల్లె శేఖర్‌రెడ్డి 2012లో చనిపోయారు. అత ని తండ్రి పేర అదే గ్రామ సర్వేనెం.88, 89అ, 126అ, 127అలో 1.39 ఎకరాల భూమి ఉంది. తనపేర విరాసత్ చేయాల్సిందిగా హర్షవర్దన్‌రెడ్డి బల్మూర్ తహశీల్దార్‌కు దరఖా స్తు చేసుకోగా, వీ ఆర్వో గుజ్జుల వెంకటయ్యకు రెఫర్ చేశారు. అయితే పట్టాపాసు పుస్తకాల కోసం బాధితుడు మూణ్నెళ్లుగా కార్యాలయం చుట్టూ తి రుగుతున్నాడు. పాసుపుస్తకాలు ఇంకా సిద్ధంకాలేదని సదరు వీ ఆర్వో చెబుతూవస్తున్నాడు. ఇదిలాఉండగా, గతనెల 25న వీ ఆ ర్వో వెంకటయ్య హర్షవర్దన్‌రెడ్డికి ఫోన్‌చేసి పట్టాపాసు పుస్తకం, టై టిల్డీడ్ కోసం రూ.ఐదువేలు కావాలని అడిగాడు. పాస్‌పుస్తకాలు కావాలని మరోసారి అడిగితే రూ.నాలుగువేలు కావాలని డిమాం డ్ చేశాడు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని బల్మూర్‌కు రమ్మంటే హర్షవర్దన్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఫోన్‌చేయగా సదరు వీఆర్వో అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్‌కు రమ్మని కబురుపెట్టాడు. డబ్బులు తీసుకుంటుండగా వీఆర్వో వెంకట య్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టాపాసు పుస్తకాలు, డబ్బును సీజ్‌చేశారు. వీఆర్వోను పట్టుకున్నవారిలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఇన్స్పెక్టర్లు తిరుపతిరాజు, సి.రాజు, సిబ్బంది ఉన్నారు. -
‘ఉపాధి’ లేక ఊరు విడిచి..
ఊరిలో ‘ఉపాధి’ లేక.. పనులు చూపేవారు లేక బతుకుజీవుడా..అంటూ నల్లమల చెంచుపెంటలు వలసబాట పట్టాయి. తాళం వేసిన ఇళ్లతో ఆ గిరిజన పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు బతుకుదెరువు కోసం ఊరువిడిచి వెళ్లిన గిరిజన కూలీలు గుంపుమేస్త్రీల దాష్టీకానికి బలవుతున్నారు. రోజుల తరబడి పనులు చేయించుకొని కూలిడబ్బులు ఇవ్వకుండా తరిమేస్తున్నారు. ఆదుకోవాల్సిన ఐటీడీఏ అధికారులు నిస్సహాయస్థితిలో ఉన్నారు.. అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల చెంచులకు ఉపాధి లేకపోవడంతో పిల్లాపాపలతో వలసబాట పట్టారు. మహారాష్ట్ర, ముంబాయి, అంబర్నాత్, షోలాపూర్, గుజరాత్‌లోని సూరంత, గోవా, బెంగళూరు, హైదరాబాద్, ప్రకాశం తదితర ప్రాంతాలకు ఇప్పటికే వెళ్లారు. వీరికి గుంపుమేస్త్రీలు అడ్వాన్స్‌ల రూపంలో కొంతచెల్లించి రోజుల తరబడి పనులు చేయించుకుంటున్నారు. వీరికోసం ప్రత్యేక ఐటీడీఏ ఉన్నా పట్టించుకోవడం లేదు. స్థానికంగా చేపల పెంపకంతో ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ముందుకుసాగడం లేదు. వలసల నివారణ కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెంచులకు పదిహేను రోజుల పాటు ప్రత్యేక ఉపాధి కల్పిస్తూ ఉన్న చోటపని కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకంతో 95 శాతం మేర చెంచులు వలసలకు స్వస్తి పలికి ఉన్నచోటే ఉపాధి పనులు చేస్తూ ఇబ్బందులు లేకుండా కాలం గడిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు. చేసేది లేక అడవిబిడ్డయి వలసబాట పట్టారు. ఇప్పటికే నల్లమల నుంచి ఇప్పటికే మొత్తం 350 చెంచు కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. అచ్చంపేట మండలం చౌటపల్లి, చందాపూర్ చెంచుకాలనీ, బొమ్మనపల్లి చెంచుకాలనీ, ఐనోలు, సిద్దాపూర్, రంగాపూర్, మండలంలో బిల్లకల్, బాణాల, బల్మూర్, చెంచుగూడెం, కొండనాగుల, గుడిబండ, అంబగిరి, రామాజిపల్లి, జాగాల, గ్రామాల్లో 450 చెంచు కుటుంబాల్లో 1260 మంది నివాసం ఉంటున్నారు. వీరిలో ఈఏడాది ఇప్పటివరకు సుమారు 150 చెంచు కుటుంబాలకు చెందిన 400 మంది గుంపుమేస్త్రీల వెంట ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్, మొల్కమామిడి, మాచారం, కుడిచింతలబైలు, పదర, సార్లపల్లి, కొలంపెంట, మారడుగు, జంగంరెడ్డిపల్లి, ఉప్పునుంతల (బీకే) మాధవానిపల్లి, లింగాల మండలం పద్మనపల్లి, ఎర్రపెంట, పాతధారారం, అప్పాయిపల్లి, శ్రీరంగాపూర్, రాయవరం, పాతరాయవరం, చెన్నంపల్లి చెంచులపెంటల నుంచి ఇప్పటికే వలసవెళ్లారు. ‘ఉపాధి’ నిరుపయోగమే.. చెంచుల వలసల నివారణ కోసం ఐటీడీఏ ప్రత్యేక ఉపాధి హామీ పథకం అమలుచేస్తున్నా మూడునెలలుగా పనులు జరగడం లేదు. ఈ పథకం ద్వారా సొంతూళ్లలోనే పనులు చూపుతూ కూలీలకు డబ్బులు ముందస్తుగా చెల్లించేవారు. పనులు చేయించాల్సిన బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. ఒకవేళ కూలీలు పనికి రాకపోతే తీసుకొచ్చే బాధ్యతను వారికే ఇచ్చారు. అలాగే నీటివసతి ఉన్న భూముల్లో పండ్లతోటల పెంపకాన్ని ప్రోత్సహించారు. ఆయా పెంటలు, గ్రామాల్లో ఎంతమంది చెంచులు ఉన్నా వారందరికీ ప్రత్యేక ఉపాధి పథకంలో భాగస్వాములను చేయాల్సి ఉంది. అయితే ఐటీడీఏ నిర్లక్ష్యం కారణంగా పనులు జరగకపోవడం..పోషణభారంగా మారడంతో చెంచులు వలసబాటను ఎంచుకున్నారు. అయితే ఇదే అదనుగా భావించి గుంపుమేస్త్రీలు చెంచు గిరిజనుల కష్టాన్ని సొమ్ము చే సుకుంటున్నారు. పనులు చేయించుకుని డ బ్బులు ఇవ్వకుండానే తరిమేస్తున్నారు. పనిలేక మూణ్నెళ్లు అయింది పనులు లేక మూడు నెలలు కావస్తుంది. మాగూడెంలో ఇప్పటికే ఆరు కుటుంబాలు వలసలు పోయాయి. పనులు లేక ఇళ్ల ద గ్గరనే ఉంటున్నాం. తిండి తిప్పలకు ఇబ్బందులు పడుతున్నాం. ఐటీడీఏ వాళ్లు పనులను చేయించి ఆదెరువు చూపించాలి. - మర్రిపల్లి ఉస్సేనమ్మ, గుడిబండ,బల్మూర్ మండలం వలసలు తగ్గాయి.. ఉపాధి హామీ వచ్చిన తర్వాత చెంచుల వలసలు తగ్గాయి. అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే అక్కడక్కడ వలసలు వెళ్లినట్లు నా దృష్టికి వచ్చింది. ఏడాది పొడవునా పనులు కల్పిస్తున్నాం. ఇదివరకు మాదిరిగా పనులు చేయకపోయినా అడ్వాన్స్‌గా డబ్బుఇవ్వడం లేదు. వలసలు వెళ్లినట్లు మాకు డాటా ఇవ్వగలిగితే పరిశీలిస్తాం. వలసలపై వీటీడీఏల సమావేశంలో అడిగాం..అలాంటిదేమీ లేదన్నారు. - ప్రభాకర్‌రెడ్డి, పీఓ ఐటీడీఏ సున్నిపెంట -
గూడెం గజగజ..
అచ్చంపేట, న్యూస్‌లైన్: నల్లమల అటవీప్రాంతంలో చలి, ఈదురుగాలులకు చెంచులు వణికిపోతున్నారు. మంచు తుంపరకు బొడ్డు గుడిసెలు, గుడారాలు తడిసి ముద్దవుతున్నాయి. పక్కాఇళ్లు లేకపోవడంతో గుడిసెల్లోనే చలి మంటలు కాచుకుంటూ బతుకుజీవుడా.. అంటూ కాలం గడుపుతున్నారు. ఎముకలు కొరికే చలిలో అడవిబిడ్డలు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా నల్లమలలోని కోర్ ఏరియాలో జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులు మరింత దుర్భరంగా మారాయి. అప్పాపూర్,పుల్లాయిపల్లి, రాంపూర్, బౌ రాపూర్, సంగడిగుండాలు, బక్కచింతపెంట, ఫర్హాబాద్, మేడిమొల్కల, తాటిగుండాలు, ఇర్లపెంట, ఆగర్లపెంట, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట తదితర ని వాసప్రాంతాల్లో చెంచులు చలికి వణికిపోతున్నాయి. ఇక్కడ ఏ పెంటల్లోనూ పక్కాఇళ్లు లేవు. వీరు ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. 40 ఏళ్లనాడు ఎలా ఉన్నామో ఇప్పు డు అలాగే ఉన్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ, చలికి ఎన్ని రోజులు తాము చెట్లకింద జీవించాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు. కనిపించని దోమ తెరలు దోమల నుంచి రక్షణ పొందేందుకు చెంచులకు దోమతెరలు ఎంతో అవసరం. కానీ వాటిని అందిండంలో వైద్యశాఖ పూర్తిగా విఫలమైంది. ఐదేళ్ల క్రితం పంపిణీ చేసిన దోమ తెరలు పనికి రాకుండా పోయాయి. గతంలో ఏటా ప్రభుత్వపరంగా చలికాలంలో చెంచులకు దోమతెరలు అందించేవారు. ఇప్పుడు వీటి ఊసేలేకపోవడంతో దోమలతో చెంచులు మలేరియా, డెంగీ వ్యాధుల బారినపడుతున్నారు. మలేరియా వైవాక్స్, మాలేరియా ఫాల్సీఫెరమ్ వ్యాధుల నివారణకు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చలి జ్వరాలతో బాధపడే వారి నుంచి రక్తపూత సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఇంతవరకు వైద్యులు అక్కడికి వెళ్లిన దాఖలాల్లేవు. దయనీయస్థితిలో చెంచులు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్గొండ, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఐటీడీఏ లెక్కల ప్రకారం 36వేల మంది చెంచు జనాభా ఉంటే జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 112 చెంచుగూడెల్లో 7500 జనాభా ఉంది. చెంచుల పక్కా ఇళ్లు కలగానే మిగిలాయి. ఉన్న ఇళ్లలో సరైన వసతులు లేకపోవడంతో చెంచులు ఇబ్బందుల మధ్య కాలం గడుపుతున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, లిం గాల, బల్మూర్, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, హన్వాడ, మండలాల్లోని గిరిజన గూడెల్లో అసంపూర్తిగా కూలిపోతున్న ఇళ్ల మ ద్య గిరిపుత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. చెంచుల క ష్టాలు చూడలేని రెడ్‌క్రాస్ సంస్థ వారు గుడారాలను అందజేసింది. కొన్నిగాలికి లేచిపోగా ఉన్నకొన్ని కూడా చిరిగిపోయాయి. వాటిలోకి క్రిమికీటకాలు, విషసర్పాలు చేరుతుండటంతో అందులో ఉండలేని పరిస్థితి నెలకొంది. అడవిలో వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ చలితో చెట్లకింద ఎంతకాలం ఇబ్బందులు పడాలని చెంచులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆదుకోవాలని గిరిపుత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నేడు వైఎస్ విజయమ్మ ధర్నా
అచ్చంపేట, న్యూస్‌లైన్: కృష్ణా మిగులు జలాలపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం నిర్మాణంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశే ఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరామ్లు వెల్లడించారు. విజయమ్మ ధర్నా చేయనున్న పులిచింతల ప్రాజెక్టు ప్రదేశాన్ని పరిశీలించడానికి మంగళవారం ఇక్కడకు వచ్చిన వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. విజయమ్మ ప్రాజెక్టుపైనే ధర్నా చేస్తారని స్పష్టం చేశారు. దీనికి ప్రాజెక్టుపైన రోడ్డు మార్గం అనుకూలంగా ఉందని చెప్పారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులు వేలాదిగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఎడారే.. ట్రిబ్యునల్ తీర్పు వల్ల కృష్ణా మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా పోతాయని, అప్పుడు రాష్ట్రం ఎడారి అవుతుందని తలశిల రఘురాం, మర్రి రాజశేఖర్‌లు పేర్కొన్నారు. సాగు, తాగు నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. దీన్ని ప్రతి ఒక్క రు వ్యతిరేకించాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు హయాంలోనే ఆలమట్టి డ్యామ్ నిర్మాణం జరిగిందన్నారు. అప్పుడే ఆయన వ్యతిరేకించినట్లయితే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లనే రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని ధ్వజమెత్తారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం.. వైఎస్ విజయ మ్మ పులిచింతల ప్రాజెక్టుపై నిర్మించిన రోడ్డు మార్గంలో బుధవారం ఉదయం 10గంటలకు ధర్నా చేపడతారని ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘరాం చెప్పారు. మధ్యాహ్నం వరకు ధర్నా కొనసాగుతుందని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, కృష్ణాజిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కోటగిరి గోపాల్, చౌడవరపు జగదీశ్, లీగల్ సెల్ కన్వీనర్ సామినేటి రాము, జగ్గయ్యపేట టౌన్ పార్టీ జనరల్ సెక్రటరీ వ ట్టెం మ నోహర్, మండల కన్వీనర్ సందెపోగు సత్యం, నాయకులు గంగసాని నరసింహారెడ్డి, త మ్మా ప్రవీణ్‌రెడ్డి, అనుముల సాంబిరెడ్డి, షేక్ రహమాన్ పాల్గొన్నారు. -
పాముకాటుకు ఇద్దరు రైతుల బలి
వెల్దుర్తి/జహీరాబాద్, న్యూస్‌లైన్: పాముకాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. వెల్దుర్తి మండలం అచ్చంపేటలో ఓ రైతు మరణిం చగా, జహీరాబాద్ మండలం ధనాసిరిలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు ఇలా.. వెల్దుర్తి మండలం అచ్చంపేటకు చెందిన రైతు పెరుక వెంకటేశం(50) మంగళవారం రాత్రి స్థానిక హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భజనలు చేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రించాడు. దుప్పట్లో దూరిన పాము వెన్ను పూస పై కాటు వేసింది. వెంటనే మేల్కొన్న వెంకటేశం ఏదో కరిచిందని కుటుంబ సభ్యులకు తెలుపగా వారంతా వెతకగా కట్ల పాము కన్పించింది. వెంటనే దాన్ని చంపేశారు. ఆ వెంటనే వెంకటేశంను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని కుటుంబ సభ్యు లు తెలిపారు. వెంకటేశంకు భార్య సుశీల, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి వెంకటేశం కుటుంబాన్ని పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నర్సింలు కోరారు. చికిత్స పొందుతూ సురేశ్ మృతి... జహీరాబాద్ మండలం ధనాసిరి గ్రామానికి చెందిన రైతు సురేశ్(42) రెండురోజుల క్రితం పొలం వద్ద ఎడ్లను మేపుతున్న క్రమంలో పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెం టనే అతణ్ణి జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.