అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
అచ్చంపేట : మండలంలోని కొండూరు కొండ ప్రాంతాల్లో బుధవారం ఇంట్లో నుంచి 50 రోజుల కిందట వెళ్లిపోయిన యువకుడి పుర్రె, ఎములకు గుర్తించారు. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన గరటా రవితేజ (16) తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శ్రీలక్ష్మిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30 రాత్రి ఎనిమిది గంటలకు తమ కుమారుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, అదేరోజు రాత్రి 10:15కు కొండూరుకు చెందిన పులి వీరంరాజు కుమారుడు గోపీకృష్ణ ఫోను చేసి రవితేజ ఉన్నాడా అని అడిగాడని, విషయం ఏమిటని అడిగేంతలో ఫోను పెట్టేశాడని చెప్పాడు.
ఆ తరువాత తమ కుమారుడి కోసం వెతకని చోటు లేదని, బంధువులు, స్నేహితులు అందరిని విచారించి సమాచారం దొరకకపోవడంతో అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా, మరో రెండు రోజులు చూడు మీ అబ్బాయి తప్పక వస్తాడని చెప్పారని తెలిపారు. అవశేషాలు లభించిన ప్రదేశంలో మృతుడి పుర్రె, ఎముకలు, మిగిలిన అవశేషాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. మృతుని చొక్కా, ప్యాంటు, చెప్పులు పడి ఉన్నాయి. అవి తమ పిల్లవాడివేనని తల్లిదండ్రులు గుర్తించారు. అక్కడే పురుగుమందు బాటిల్ కూడా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. అచ్చంపేట ఎస్‌ఐ అనిల్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ చేపట్టారు. పుర్రె, ఎముకలను సత్తెనపల్లి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.
ముమ్మాటికీ హత్యే : మృతుడి తండ్రి
మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దొడ్లేరు పాలకేంద్రంలో పాలు పోయించుకుంటానని, తమ కుమారుడు సత్తెనపల్లిలోని కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివాడని, గోపీకృష్ణ కూడా అదే కాలేజీలోనే చదివాడని తెలిపాడు. తమ పిల్లవాడు పాసయ్యాడని, గోపీకృష్ణ తప్పి ఇంట్లో పాసైనట్లు చెప్పాడని ఈ క్రమంలో ఏదైనా జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, ముమ్మాటికీ హత్యేనని ఆరోపించాడు.