అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం | Forest products are the mainstay of Chenchulu | Sakshi
Sakshi News home page

అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం

Published Fri, Oct 25 2024 5:04 AM | Last Updated on Fri, Oct 25 2024 12:51 PM

Forest products are the mainstay of Chenchulu

అటవీ ఉత్పత్తులే చెంచుల జీవనాధారం

నల్లమలలో లభించే తేనె, మారెడుగడ్డలు, చింతపండు సేకరణ 

క్రమంగా అంతరించిపోతున్న ఉత్పత్తులు

కనిపించని జిగురు, ఇప్పపూలు  – ఆందోళనకరంగా చెంచుల జీవనం

చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. 

అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. 

వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. 

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. 

దుర్భరంగా బతుకులు..
మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్‌ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. 

ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. 

అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. 

గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్‌ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.

ఫలాల సేకరణకు హద్దులు..
చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.

చెట్ల పెంపకం అంతంతే..
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. 

వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

అటవీ ఉత్పత్తులు ఇవే..
నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్‌ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. 

వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్‌ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు.  ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. 

ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్‌ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

ఉప్పుకైనా అప్పాపూరే..
చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్‌ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్‌ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.

బీమా కల్పించాలి
ప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్‌ చెంచుపెంట

పక్కా ఇళ్లు లేవు
లోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. 
– నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు,  ఆదివాసీ చెంచు ఐక్యవేదిక 

ఉపాధి కల్పనకు చర్యలు
చెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్‌«మన్‌ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. 

కొంతమంది చెంచులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– రోహిత్‌రెడ్డి, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement