
రాజీవ్ యువ వికాసంపేరుతో కొత్త పథకం:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం
మార్చి 15న నోటిఫికేషన్... అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికిప్రయోజనం.. చాకలి ఐలమ్మ వర్సిటీకి తక్షణమే రూ.115 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. మంగళవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులను పట్టించుకోలేదని, ఆయా వర్గాల కోసం పెట్టిన ఆర్థిక కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం కొత్త పథకాన్ని తెస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద ఆయా వర్గాలకు చెందిన యువకులకు వ్యక్తిగతంగా రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఆ రోజు నుంచే ఆన్‌లైన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు ఈ దరఖాస్తులను పరిశీలించి, జిల్లాల కలెక్టర్లు అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో అమలు చేసే ఆలోచన ఉందని భట్టి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులకు బ్యాంకు లింకేజీతో రుణం ఇప్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తామన్నారు.
ఐలమ్మ వర్సిటీకి రూ.540 కోట్లు
వీర వనిత చాకలి ఐలమ్మ పేరిట ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.540 కోట్లు కేటాయించామని, దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు. ఈ వర్సిటీ ప్రాంగణంలో ఉన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. వర్సిటీ ప్రధాన ద్వారం మూసీ నదిని ఆనుకుని ఉందని, మూసీ పునరుజ్జీవం తర్వాత ఈ ప్రధాన గేటును తిరిగి ప్రారంభిస్తామన్నారు.
వారసత్వ కట్టడాల పునరుద్ధరణ పనుల ప్రారంభానికి తక్షణమే రూ.15.5 కోట్లు, నూతన భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్టు భట్టి వెల్లడించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలోని చారిత్రక కట్టడాలను వర్సిటీ వీసీ సూర్య ధనుంజయతో కలిసి భట్టి పరిశీలించారు. భట్టి వెంట ఎంపీ పోరిక బలరాం నాయక్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment