‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం | Sakshi interview with mallu bhatti vikramarka | Sakshi
Sakshi News home page

‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం

Published Thu, Apr 3 2025 4:48 AM | Last Updated on Thu, Apr 3 2025 4:48 AM

Sakshi interview with mallu bhatti vikramarka

చంద్రబాబు హయాంలో కంచ గచ్చిబౌలి భూములు అప్పనంగా బిల్లీరావుకు ధారాదత్తం 

ఐఎంజీ భారత్‌కు ఇచ్చిన భూములను రద్దు చేయడంతోపాటు కోర్టులో పోరాడినది వైఎస్సార్‌ 

వైఎస్సార్‌ పోరాటానికి రేవంత్‌ ప్రభుత్వం అద్భుత ముగింపును ఇచ్చింది... 

ఆ 400 ఎకరాల భూమి కచ్చితంగా ప్రభుత్వానిదే.. అందులో అనుమానాలు అక్కర్లేదు

ఆ భూముల్లో ఐటీ హబ్, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్స్‌ సిటీ వంటి సంస్థలను ఏర్పాటు చేస్తాం 

లక్షల కోట్ల పెట్టుబడులు.. నిరుద్యోగ యువతకు లక్షల్లో ఉద్యోగాలు ఖాయం 

కుట్రదారులతో చేతులు కలిపినందునే భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ మౌనం 

సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యంత విలువైన కంచ గచ్చిబౌలి భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని.. వారి కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం చెర విడిపించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బిల్లీరావు కు కట్టబెట్టిన భూముల కేటాయింపులను రద్దు చేసి, దానిపై న్యాయపోరాటం చేసినది దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ భూములను స్వాదీనం చేసుకోవడం ద్వారా అద్భుత ముగింపు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడి ప్రజలకు కానుకగా ఇచ్చామని, అవే భూముల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణానికి ఎలాంటి ఇక్కట్లు కలగకుండానే అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం రగులుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివాద అంశాలపై స్పష్టత ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

చంద్రబాబు హయాంలో ధారాదత్తం.. 
‘‘యూనివర్సిటీ భూములను చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన ఐఎంజీ భారత్‌కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2004 ఫిబ్రవరి 10న సేల్‌డీడ్‌ ద్వారా 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు ఇచ్చారు. దీనికి బదులుగా యూనివర్సిటీకి గోపన్‌పల్లిలో 397 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీకి, బిల్లీరావుకు లబ్ధి జరిగితే నష్టపోయినది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలే. 

వైఎస్‌ పోరాడితే.. మేం ముగింపునిచ్చాం.. 
2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక బిల్లీరావుకు కట్టబెట్టిన భూములను రద్దు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2006 అక్టోబర్‌ 21న సేల్‌డీడ్‌ను రద్దు చేస్తూ.. భూములను తిరిగి స్వా«దీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బిల్లీరావు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేస్తే.. వైఎస్సార్‌ బలంగా న్యాయపోరాటం చేశారు. క్రమేణా రాష్ట్ర విభజన అనంతరం ఈ భూముల అంశాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరిస్తే.. కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చాక  కోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టింది. 

2024 మార్చిలో హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇస్తే.. బిల్లీరావు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సైతం బలమైన వాదనలు వినిపించింది. దీనితో అదే ఏడాది మే 3న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వైఎస్సార్‌ చేసిన పోరాటానికి ప్రభుత్వం అలా ముగింపునిచ్చింది. దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్న భూమిని స్వా«దీనం చేసుకుంది. రాష్ట్ర ఆస్తి రాష్ట్ర ప్రజలకే దక్కాలన్నది ప్రభుత్వ భావన. ఇది ప్రజల విజయం. 

కుట్రదారులే అశాంతి రేపుతున్నారు.. 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లీరావుకే భూములు చెందాలన్న లక్ష్యంతో మౌనంగా ఉంది. పంచుకుని తిందామని చూసింది. అప్పుడు కోర్టులో కొట్లాడకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ దానికి వంత పాడుతోంది. యువతలో అశాంతిని నెలకొల్పి ప్రభుత్వంపై ఉసిగొల్పాలన్నదే వారి లక్ష్యం. ఈ కుట్రలపై యువత అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలకు పోవద్దు. పోలీసులు సైతం సంయమనంతో వ్యవహరించాలి..’’అని భట్టి పేర్కొన్నారు.  

పెట్టుబడులు, ఉద్యోగాలు లక్ష్యంగా అభివృద్ధి.. 
యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యువత ఆశయాల కోసం కట్టుబడలేదు. అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేటు రంగంలో ఉపాధి ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం యువత కోసం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ఉంది. 

ఈ భూముల్లో ఐటీ హబ్, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్స్‌ సిటీ, హైటెక్‌ సిటీ ఫేజ్‌–1, 2 ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్‌కు ఇప్పటికే ఉన్న గ్లోబల్‌ సిటీ పేరును మరింత విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప.. ఎవరి సొంత ప్రయోజనాలు లేవు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిరక్షిస్తూనే అభివృద్ధి చేపడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement