
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి బస్సు కింద పడ్డాడు ఆ క‍్రమంలోనే బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
యువకుడు మృతి వార్త తెలుసుకున్న బంధువులు బాలా నగర్-ఐడీపీఎల్ ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా చేపట్టారు. యువకుడు మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. దాంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ వరకూ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దాంతో వాహన దారులు తీవ్ర కష్టాల్లో పడ్డారు.