
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.