
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది.