CS
-
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్‌పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సీఎస్ సమీక్ష
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
సందేశ్‌ఖాలీ ఘర్షణ.. వెస్ట్ బెంగాల్ సీఎస్, డీజీపీలకు ఊరట
న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ ఘర్షణల అంశంలో తమ ముందు హాజరు కావాలని లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన ఆదేశాల నుంచి పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ(సీఎస్), డీజీపీలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం స్టే ఇచ్చింది. పశ్చిమబెంగాల్ సందేశ్‌ఖాలీలో జరిగిన పరిణామాలపై ఆందోళన చేపట్టిన బీజేపీ ఎంపీలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిపై ఎంపీ సుకాంత మజుందార్ రాష్ట్ర సీఎస్, డీజీపీలపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ పశ్చిమ బెంగాల్ సీఎస్ భగవతి ప్రసాద్ గోపాలిక, డీజిపీ రాజీవ్‌కుమార్‌లను సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై వారిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తుపై కోర్టు స్టే ఇచ్చింది. కాగా, టీఎంసీ నేత షాజహాన్‌షేక్, ఆయన అనుచరులు తమ భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత వాసులు ఇటీవల ఆందోళనలకు దిగారు. దీనిపై బీజేపీ ఎంపీలు సందేశ్‌ఖాలీకి వెళ్లి మహిళలను పరామర్శించడానికి యత్నంచినపుడు పోలీసులకు వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఎంపీ సుకాంత గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఉదంతంపై ఆయన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి.. ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఆరో‘సారీ’ -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
అసోం సీఎస్‌గా సిక్కోలు వాసి
శ్రీకాకుళం: సిక్కోలు వాసికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది అసోం ప్రభుత్వం సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి కోత రవి అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. అస్సాం కేడర్ 1993 బ్యాచ్‌కు చెందిన రవి.. గతంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక దౌత్యాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం అస్సాం ప్రభుత్వంలో 18 శాఖలకు అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన శాంతి ఒప్పందంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రవి పనితీరును గుర్తించిన అసోం ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. ఈ నియామకంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలఖారులో రవి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. -
రాష్ట్ర ప్రభుత్వ బాటలో కేంద్రం
సాక్షి, అమరావతి : అర్హులందరికీ నవరత్న పథకాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే కేంద్రం పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్నీ అర్హతే ప్రామాణికంగా, వివక్షకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందిస్తోంది. ఒక వేళ పొరపాటున అర్హులైన వారికి ఏ పథకం అయినా అందకపోయినా ఏడాదిలో రెండు సార్లు అలాంటి వారి కోసం అవకాశం కల్పింస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన మిగిలిన వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలన చేసి ఏడాదిలో రెండు సార్లు పథకాల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలనూ దేశవ్యాప్తంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో అందించేందుకు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న తొలుత దేశ వ్యాప్తంగా 110 గిరిజన జిల్లాల్లో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాల్లో నవంబర్ మూడో వారం నుంచి ప్రారంభించనున్నారు. ఇటీవలే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. తగిన చర్యలు తీసుకోండి : సీఎస్ జవహర్‌రెడ్డి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచారానికి రాష్ట్రంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్ర సమన్వయం కోసం రాష్ట్ర స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, అలాగే సీఎస్ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ, పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా వికసిత్ యాత్ర ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. వారంలో 14 గ్రామ పంచాయతీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ యాత్ర కొనసాగేలాగ ప్రణాళికను రూపొందించడంతో పాటు ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వ ఐటీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వమే ఆడియో, వీడియోతో కూడిన ఎల్ఈడీ స్క్రీన్ మొబైల్ వాహనాలతో పాటు ప్రచార సామగ్రి సరఫరా చేస్తుందని, వీటిని క్షేత్రస్థాయిలో చేరవేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు. -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై సీఎస్ సమీక్ష..
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీసీఎల్ఏ జీ.సాయి ప్రసాద్ కు సీఎస్ సూచించారు. అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాల అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు. ఆరోగ్య పథకంపై చర్చ.. రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్)మరింత పారదర్శకంగా,పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబుతో సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు.ఈపథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు.అంతేగాక ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు చెప్పారు.రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవలకై ప్రత్యేక క్లినిక్‌లు అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు.ఇంకా ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై వివరించారు. ఇదీ చదవండి: ‘ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బాబు సిగ్గుపడాలి’ -
కొత్త సచివాలయంలో తొలి సంతకం చేసిన కేటీఆర్, సీఎస్
-
ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగమయ్యను..
-
నన్ను సీఎస్ గా నియమించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు : జవహర్ రెడ్డి
-
ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
ఏపీ సీఎస్‌గా సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ తాజాగా కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఏపీ సీఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సీఎస్‌గా పనిచేయనున్నారు. కాగా, సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. చదవండి: ప్లేట్లెట్ థెరపీ కిట్‌కు పేటెంట్.. రెండు తెలుగు రాష్టాల్లో ఇదే తొలిసారి పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా, రెండు నెలల క్రితం ఏపీకి సీఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో సమీర్‌శర్మ మరో ఆరునెలలు ఏపీకి చీఫ్ సెక్రెటరీగా సేవలందించనున్నారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడిచేసిన కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018 నాటి ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమాంతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు.ఇది తప్పుడు కేసు అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామనీ, ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. తమ సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా 2018 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో అప్పటి సీఎస్ ప్రకాష్‌పై ఎమ్మెల్యేలు దాడి చేశారనే ప్రధాన ఆరోపణతో కేసునమోదైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. చదవండి: టెన్త్, ఇంటర్ ఫలితాలపై దృష్టి సారించాలి: మంత్రి సురేష్ ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు.. -
పదవులకు వన్నెతెచ్చిన అధికారి
ఐఏఎస్... మన దేశంలో యువత కలలు కనే ఉన్నతోద్యోగం. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసే బృహత్తర అవకాశం. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ తమను తాము నిరూపించుకోవాలని పరితపిస్తారు. అందులో కొద్దిమంది మాత్రమే యువ అధికారులకు స్ఫూర్తి ప్రదాతలుగా చరిత్ర పుటలకెక్కుతారు. అందులో ముందు వరసలో నిలిచే అధికారి ఎస్వీ ప్రసాద్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన వ్యక్తిత్వం, కార్యదక్షత ఎనలేనివి. కోవిడ్‌వల్ల ఆయన మరణిం చడం దిగ్భ్రమ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సిగటపు వీర ప్రసాద్ (ఎస్వీ ప్రసాద్) 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అహ్మ దాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసుల వైపు మళ్లారు. నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా కెరియర్ ప్రారంభించారు. 1982లో కడప కలెక్టర్‌గా, 1985లో విశాఖ పట్నం కలెక్టర్‌గా పనిచేశారు. చిన్న వయసులోనే విశాఖలో కమి షనర్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేసిన ప్రసాద్ విశాఖ నగరాభివృద్ధికి గట్టి పునాదులు వేశారు. 2009లో భూప రిపాలన ప్రధాన కమిషనరుగానూ విధులు నిర్వర్తించారు. ఏపీ జెన్కో చైర్మన్‌గా, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ, వైఎస్ చైర్మన్‌గా బాధ్య తలు నిర్వర్తించారు. విద్యుత్తు సంస్కరణల్లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందంటే అది ఆయన చలవే. విద్యుత్తు రంగం అంటే ప్రసాద్‌కు మక్కువ. మానవ మనుగడకు, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన కరెంటును సరఫరా చేయడం విషయంలో నిర్దిష్ట అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. ఆయన సూచనలతో అధికార వర్గం చేపట్టిన సంస్కరణలను నాటి వాజ్ పేయి ప్రభుత్వంలోని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా కొనియాడారు. నిరంతరం చెరగని చిరునవ్వుతో పనిచేసే ఆయనకు అధికార వర్గాల్లో ‘జెంటిల్‌మేన్ బ్యూరో క్రాట్’ అనే పేరుంది. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అందరితోనూ ఒకే విధంగా వ్యవహరిస్తూ, ఓర్పుతో విధులు నిర్వర్తించేవారు. ఒక ఐఏఎస్ అధికారి సాధారణంగా ఒక ముఖ్యమంత్రి దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేయడమే గొప్ప! కానీ, ఎస్వీ ప్రసాద్ ఏకంగా ముగ్గురు సీఎంలు– నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు దగ్గర సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కొద్ది కాలం ఆయన పేషీలోనూ పనిచేశారు. సహజంగా సీఎం మారగానే ఆయన పేషీలోని అధికారులకు స్థాన చలనం కలుగుతుంది. కానీ, ప్రసాద్ మాత్రం నలుగురు సీఎంల పేషీల్లో దాదాపు 13 ఏళ్లు విధులు నిర్వర్తించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పనిచేయాలన్నది ప్రతి ఐఏఎస్ అధికారి కల. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత సివిల్ సర్వీస్ పోస్టు అయిన ప్రధాన కార్యదర్శి పదవిని ఎస్వీ ప్రసాద్ 2009లో దక్కించుకున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011 సెప్టెంబర్ చివరి వరకూ పనిచేశారు. ముఖ్య మంత్రులు తమకు ఇష్టమైన, సమర్థుడైన అధికారిని ఎంపిక చేసుకొంటారు. అది సాధారణ ప్రక్రియ. డజన్‌కు పైగా సీని యర్లను పక్కనపెట్టి మరీ నాటి ముఖ్యమంత్రి ప్రసాద్‌కు అవ కాశం ఇచ్చారు. అవి అక్షరాలా, ఆణిముత్యాలా! ఆయన వ్యక్తిత్వం లాగానే దస్తూరి కూడా అద్భుతమే. 2009 అక్టోబర్‌లో వరదలు వచ్చిన సమయంలో ఆయన సేవలు ఎనలేనివి. శ్రీశైలం జలాశయానికి శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. ఆయన కాలంతో పోటీపడి సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయాల వల్లే శ్రీశైలం డ్యామ్ సురక్షితంగా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా జల ప్రళయమే. కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలు నామరూపాల్లేకుండా పోయేవి. తెల్లవారుజామున 5 గంటలకు ఆయన దినచర్య మొదలై, అర్ధరాత్రి 12 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగేది. చిరు ద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరు వచ్చినా ఓపిగ్గా మాట్లాడేవారు. ఎవరు ఫోన్ చేసినా స్పందించేవారు. ‘ఎవరైనా అవసరం ఉంటేనే కదా ఫోన్ చేస్తారు’ అనేవారు. 1993లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమ యంలో విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే బాలరాజును నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. సీనియర్ ఐఏఎస్ అర్జునరావు, సీనియర్ ఐపీఎస్ ఆంజనేయరెడ్డిల సహకారంతో బాలరాజు కిడ్నాప్ కథ సుఖాంతం అవడంలో కీలకపాత్ర పోషించారు. తరచూ ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అనేవారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగిన సాయం చేస్తూనే ఉండాలని చెప్పేవారు. ఆయనలో మరో విశేష గుణం బాగా పనిచేసే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడం. వీఆర్వో నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించేవారు. ఏ అధికారికైనా అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి ఏ పార్టీ వారైనా సరే న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. ఐఏఎస్ అధికారిగా దాదాపు 40 ఏళ్ల పాటు సేవలందించినా ఎన్నడూ ఇసుమంతైనా గర్వం ప్రదర్శించలేదు. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రసాద్ సీసీఎల్ఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా ఆయనకు ఏపీ జెన్కో ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల కోసం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నిబంధనలు ఉల్లంఘిం చకుండా తక్కువ ధరకు బొగ్గు కొనాలని వైఎస్ సూచించారు. ప్రసాద్ అందుకోసం డి. ప్రభాకర్ రావుతో కలిసి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని చూసి వైఎస్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ నివేదికను అమలు చేయడం వల్ల బొగ్గు కొనుగోళ్లలో దాదాపు రూ.1000 కోట్లు ఆదా అయింది. హైదరాబాదులోని ఓ అనాథా శ్రమంలోని పిల్లల చదువుల కోసం తన వేతనంలో కొంత భాగాన్ని మూడోకంటికి తెలియకుండా ఇచ్చేవారు. ఆయన మరణ వార్తకు మీడియా ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. ‘ఉమ్మడి ఏపీ పూర్వ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇక లేరు’ అంటూ ఆయన విశిష్టతను మరోసారి ప్రజలకు గుర్తుచేసింది. సివిల్ సర్వీసుల్లో ఉన్న వారికి, రావాలని కోరుకునే వారికి ఆయన రోల్ మోడల్. ఎస్వీ ప్రసాద్, శ్రీలక్ష్మి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. విధి విచిత్రమో, దైవలీలో గానీ మరణంలోనూ వారి సాన్నిహిత్యం వీడలేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వ్యాసకర్త: ఎ. చంద్రశేఖర రెడ్డి సీఈఓ, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ -
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పెండింగ్ విద్యుత్ బిల్లులపై శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు బకాయిపడిన విద్యుత్ బిల్లుల అంశంపై త్వరలో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోపు సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పని చేయని బోరు బావులకు సంబంధించిన బిల్లులతోపాటు ఇతర విద్యుత్ బిల్లుల బకాయిల వివాదాలపై పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారులు తక్షణమే సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. -
పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రగతి అమలు కోసం మున్సిపల్ పరిపాలన శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను మరింత సరళీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డులు, మున్సిపాలిటీల వారీగా సమాచారం సేకరించడంతో పాటు, ప్రతీ వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ వార్డు స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు కమిటీల సమాచారాన్ని అప్లోడ్ చేయడంలో కొన్ని జిల్లాలు వెనుకంజలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, హరితహారం, కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ప్రణాళిక, స్మశాన వాటికలు, నర్సరీల అభివృద్ధి, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, ఆట స్థలాలు, పార్కులు తదితరాలపై దృష్టి సారించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. పట్ట ప్రగతి కోసం ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీహెచ్ఎంసీకి రూ.156 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.140 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సీఎస్.. సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామక ఫైలుపై మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర సాధారణ పరి పాలన శాఖ ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 1 నుంచి సీఎస్‌గా కొనసాగుతున్న శైలేంద్ర కుమార్ జోషి మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారు. ఎక్కువకాలం పాటు బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉండటంతోనే సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా ఎంపిక చేసినట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాలనలో స్థిరత్వం ఉంటుందని పేర్కొంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఎస్కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని సీఎం నిర్ణయించారు. కాగా, తనను సీఎస్‌గా నియమించినందుకు సోమేశ్ కుమార్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శాఖల పనితీరుపై అసంతృప్తితోనే?: రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లయినా పలు కీలక ప్రభుత్వ శాఖలు, విభాగాల పనితీరు గాడిలో పడకపోవడంపై సీఎం అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన వ్యవహారాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆశించిన లక్ష్యాల సాధన కోసం పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలనే ఆలోనతోనే సీఎస్‌గా సోమేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంకు నాపై నమ్మకముంది: సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని నూతన సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎంకు తనపై నమ్మకముందని, దాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మంగళవారం సాయం త్రం తాత్కాలిక సచివాలయంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా కృషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులతో స్నేహపూరితంగా వ్యవహరిస్తానని, అదే సమయంలో పని విషయంలో రాజీ పడబోనన్నారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పని చేస్తానన్నారు. పదవీ విరమణ పొందిన ఎస్కే జోషి సలహా సూచనలివ్వాలని కోరారు. సైకాలజిస్ట్ నుంచి సీఎస్‌గా..: సోమేశ్‌కుమార్.. 1987 నవంబర్ నుంచి 1989 వరకు డీఆర్డీవో సైకాలజిస్టుగా సాయుధ బలగాల అధికారుల ఎంపిక కోసం మానసిక పరీక్షలు నిర్వహించేవారు. ఎస్కే జోషికి ఘనంగా వీడ్కోలు..: పదవీ విరమణ చేసిన సీఎస్ ఎస్కే జోషికి సీనియర్, ఐపీఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీఆర్కేఆర్ భవన్‌లోని సమావేశ మందిరంలో ఆయనను ఘనంగా సత్కరించారు. పోలీసు శాఖకు జోషి అందించిన సహకారం మరువలేనిదని డీజీపీ మహేందర్‌రెడ్డి కొనియాడారు. చదువు.. కొలువు పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్ విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్ఐఆర్డీపీఆర్, హైదరాబాద్ కుమార్తె: సాయి గరిమా, ఆర్ట్స్ విద్యార్థిని ఐఏఎస్‌గా తొలి కొలువు: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్ (ఆగస్టు 1991– మే 93) ►ఐటీడీఏ, పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్‌గా 1993 మే నుంచి 1995 ఏప్రిల్ వరకు ►హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా 1995 మే– 1996 జూన్ వరకు ►యాక్షన్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్/వ్యవస్థాపక సీఈవోగా 1996 జూన్ – 2000 జనవరి వరకు ►అనంతపురం జిల్లా కలెక్టర్‌గా జూన్ 2000 నుంచి 02 డిసెంబర్ వరకు ►ఏపీ అర్బన్ సర్వీస్ ఫర్ పూర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా జనవరి 2003 నుంచి మే 2005 వరకు ►ఎయిడ్ ఎట్ యాక్షన్ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్‌గా మే 2005 నుంచి డిసెంబర్ 2009 వరకు ►ఏపీ కళాశాల విద్య కమిషనర్‌గా జూలై 2008 నుంచి డిసెంబర్ 2009 వరకు ►గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2013 వరకు ►జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అక్టోబర్ 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు ►గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు ►రెవెన్యూ, రెవెన్యూ, సీసీఎల్ఏ, రెరా, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 2016 నుంచి ఇప్పటి వరకు సోమేశ్ వద్దే రెవెన్యూ శాఖ రెవెన్యూ, సీసీఎల్ఏ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇంత కాలం పనిచేసిన సోమేశ్‌కుమార్.. సీఎస్‌గా నియమితులైనా కూడా ఆ శాఖలను ఆయన వద్దే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా, సీఎస్ ఎస్కే జోషి వద్ద ఉన్న నీటిపారుదల శాఖను మరో సీనియర్ ఐఏఎస్‌కు అప్పగించనుంది. -
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
సాక్షి: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
సీఎస్, ఇతర ఐఏఎస్‌లపై హైకోర్టు గరంగరం
సాక్షి, హైదరాబాద్: ‘డెంగీ విజృంభణకు నిర్లక్ష్యం కారణమని తేలితే క్రిమినల్ చర్యగా పరిగణించాలా? నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణమైతే ఎవరిది బాధ్యత? మృతుల కుటుంబా లకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని భావిస్తారేమో.. ఐఏఎస్ అధికారుల జేబుల నుంచే ఇవ్వాల్సి వస్తుంది. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలివ్వగలం. ఐఏఎస్‌లకు శిక్షణ ప్రజల డబ్బుతోనే ఇస్తారు. వారు రోగాలతో బాధలు పడుతుంటే పట్టించుకోకపోతే ఎలా.. ఒక్కసారి మూసీ నది ఒడ్డుకు మీరు వెళితే ఎంత దారుణమైన పరిస్థితుల నడుమ జనం ఉన్నారో కనబడుతుంది.’ అని హైకోర్టు తీవ్ర స్వరంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి, ఇతర ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ, మలేరియా, వంటి విషజ్వరాలతో బాధపడేవాళ్లకు సర్కార్ వైద్యం అందేలా ఆదేశాలివ్వాలని వైద్యురాలు ఎం.కరుణ, న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బుధవారం హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సీఎస్‌తోపాటు ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా హాజరయ్యారు. హైకోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి సీఎస్ నేతృత్వం వహించాలని, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, నివారణ చర్యలు ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది. కోర్టు మెట్లు ఎక్కేవారు కాదు ‘ఉన్నతాధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే కోర్టు మెట్లు ఎక్కరు. ఇక్కడున్న సీనియర్ ఐఏఎస్‌లు మూసీ నదికి వెళ్లి చూస్తే అది ఎంత పెద్ద దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందో చూడొచ్చు. హైకోర్టు పక్కనే ఉన్న మూసీ కలుషితం కావడం వల్ల దోమలు కోర్టులోని వాళ్లను కుడుతున్నాయి. రోజూ పత్రికల్లో ప్రతి పేజీలోనూ ప్రజల సమస్యలు, జనం రోగాల గురించి కథనాలు వస్తున్నాయి. మీరు పత్రికలు చడవడం లేదా లేక చదివినా స్పందించడం లేదా.. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలను ప్రభుత్వం మీ చేతుల్లో పెట్టింది. సగటు జీవి సణుగుడు అర్థం చేసుకోండి’అని ఘాటుగా కోర్టు వ్యాఖ్యానించింది. వర్షాలు మొదలయ్యాక చర్యలా? కిక్కిరిసిన కోర్టు హాల్లో విచారణ ప్రారంభమైన వెంటనే సీఎస్ జోషి.. హైకోర్టు సూచనల్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, 30 రోజులకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 12,751 గ్రామాల్లో నిరంతరం వాటన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. గడిచిన నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తే.. సెప్టెంబర్ నెల మధ్యలో అమలు మొదలైందని సీఎస్ చెప్పారు. జూన్‌లో వర్షాలు మొదలైతే సెప్టెంబర్ నెల సగం అయ్యే వరకూ ఎందుకు ఆగుతున్నారని అడిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని సీఎస్ చెప్పిన జవాబు పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి ప్రజారోగ్యానికి ఎన్నికల కోడ్‌కు సంబంధం ఏమిటని, రాజ్యాంగంలో ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రథమ విధి అని చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. రేపు రంగారెడ్డి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో భూకంపం వంటి విపత్తు సంభవిస్తే ఇలాగే చెబుతారా అని నిలదీసింది. చిన్న దేశం శ్రీలంకలో డెంగీ, మలేరియాలను పూర్తిగా నిర్మూలించాలని 2016లో లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని, మనం కనీసం హైదరాబాద్ జంట నగరాల్లో ఆవిధంగా చెయ్యలేమా అని ప్రశ్నించింది. భోపాల్, ఉదయ్‌పూర్ వంటి నగరాలు పరిశుభ్రతకు చిరునామాగా ఉన్నాయని, ఉదయపూర్‌లో 8 సరస్సులున్నాయని, అక్కడ డెంగీ వంటి మాటే వినపడదని పేర్కొంది. చివరకు డెంగీతో ఒక జడ్జి కూడా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరి విచారణ మధ్యలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని ఫాగింగ్ మెషీన్లు రెట్టింపు చేశామని, అత్యవసర ప్రదేశాల్లో 70 మెషీన్లతో పాటు వాహనాల ద్వారా కూడా ఫాగింగ్ చేస్తున్నామని తెలిపారు. మీరు చెబుతున్న ఫాగింగ్ మెషీన్ల సంఖ్యలోనే తేడాలున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే ప్రజల ప్రాణాలు పోతున్నాయని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశిస్తే సరిపోతుందని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్ పరిసరాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలు 427 ఉన్నాయని, బ్రీడింగ్ సెంటర్ 401 ఉన్నవాటిని 235కు తగ్గించామని ఏజీ చెప్పబోతుంటే వర్షాకాలం ప్రారంభంలో దోమల నివారణ చర్యలు తీసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని, లార్వా దశలోనే నాశనం చేసేలా ప్రణాళికలుండాలని సూచించింది. అయినా కేసులు పెరిగాయి.. రూరల్ ఏరియాలో 1,09,780 ప్రాంతాల నుంచి వ్యర్థాలను తొలగించారని, 2.79 లక్షల ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలను తొలగించారని, నిరుపయోగంగా ఉన్న 16,380 బావుల్ని తొలగించామని సీఎస్ జోషి చెప్పగానే.. సీజే కల్పించుకుని చాలా సంతోషమని, అయినా డెంగీ కేసులు పెరిగినట్లుగా ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆ వివరాల్ని సరిగ్గా తయారు చేయలేదని సీఎస్ చెప్పగానే, జనవరిలో వంద కేసులుంటే ఇప్పుడు 2 వేల కేసులకు పెరిగాయని ధర్మాసనం గుర్తు చేసింది. మరో ఐఏఎస్ అధికారి అరవింద్.. మంత్రి తలసాని నేతృత్వంలో ఒక సబ్ కమిటీ రెండు సార్లు సమావేశమైందని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వాహనాల ద్వారా ఎన్ని టన్నుల చెత్త తొలగింపు చేస్తున్నది.. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యల్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ వివరించారు. గల్లీల్లో తిరిగేందుకు వీలుగా కొత్తగా 1,400 ఆటోల్ని కొనుగోలు చేశామని, చెత్తను క్రషింగ్ చేస్తున్నామని వివరించారు. ఇది హర్షించదగ్గ విషయమేనని, అయితే వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రణాళికలుండాలన్న కీలక విషయాన్ని మరిచిపోయారని హైకోర్టు వ్యాఖ్యానించింది. వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 800 సాధారణ స్ప్రేయర్లు, ఫాగింగ్ వాహనాలు 60 ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తమ ఉత్తర్వుల్ని ఖాతరు చేయపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. మలేరియా, పోలియో వంటి వాటిని దాదాపు నివారించామని, డెంగీ విషయంలో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తూ విచారణను వాయిదా వేసింది. -
సెల్ఫ్ డిస్మిస్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘మేము (ఆర్టీసీ కార్మికులు) కార్యాలయాలకు వెళ్తలేం కాబట్టి ఉద్యోగులం కాదన్న మాట ప్రభుత్వం నుంచి వచ్చింది. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఎక్కడా లేదు. చెప్పినంత మాత్రాన తీసేసినట్టు కాదు. రేపు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పుడు అన్ని అంశాలొస్తాయి. సెల్ఫ్ డిస్మిస్కు కూడా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది’అని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గురువారం సాయంత్రం ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని తాత్కాలిక సచివాలయంలో కలసి వినతిపత్రం అందజేసింది.అనంతరం జేఏసీ నేతల తో కలసి కారం రవీందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 19న జరగనున్న రాష్ట్ర బంద్ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పాల్గొంటుం దని అన్నారు. ఆ రోజు మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన తెలియజేస్తామన్నారు. నమ్మకంతో ఉన్నారు.. ‘చాలా మంది కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నరు. గతంలో 43 శాతం ఫిట్మెంట్తో ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చింది. 16 శాతం ఐఆర్ ఇచ్చింది. ప్రభుత్వం తప్పనిసరిగా తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆర్టీసీ కార్మికులు నమ్మకంతో ఉన్నరు. ప్రభుత్వం ఈ నమ్మకాన్ని నిజం చేయాల్సి ఉంది’అని సీఎస్‌కు వివరించినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి, కండక్టర్ సురేందర్ గౌడ్లు ఆత్మహత్యకు పాల్పడగా, కొందరు ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు గుండెపోటుతో మరణించిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.సమ్మెలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని కోరినట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరామని ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ మమత పేర్కొన్నారు. మాకు ఏ లోగుట్టు లేదు.. టీఎన్జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలకు ఎలాంటి లోగుట్టు లేదని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులకు ఏ లోగుట్టు ఉందో మాకు అదే ఉందని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతల బలహీనతల వల్ల ఉద్యోగుల ప్రయోజనాలు నీరుగారిపోతున్నాయని వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై 15 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు, రెండు డీఏలు రావాల్సి ఉందన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాల న్న డిమాండ్లను సీఎస్ ముందు ఉంచామన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ మే జీతం చెల్లించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ నెల 24న హుజూర్నగర్ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు చర్య లు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. సాయంత్రం 4 గంటలకు బీఆర్కేఆర్ భవన్‌కు చేరుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎస్‌ను కలిసేందుకు దాదాపు గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. సీఎస్ వేరే సమావేశంలో ఉండటంతో ఉద్యోగ నేతలు వేచిచూడక తప్పలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి.