పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌  | CS Review Of Urban Progress Arrangements In Telangana | Sakshi
Sakshi News home page

పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ 

Published Fri, Feb 21 2020 2:25 AM | Last Updated on Fri, Feb 21 2020 2:25 AM

CS Review Of Urban Progress Arrangements In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టణ ప్రగతి అమలు కోసం మున్సిపల్‌ పరిపాలన శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను మరింత సరళీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సూచించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డులు, మున్సిపాలిటీల వారీగా సమాచారం సేకరించడంతో పాటు, ప్రతీ వార్డుకు ఒక నోడల్‌ అధికారిని నియమించాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ వార్డు స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు.

కమిటీల ఏర్పాటుతో పాటు కమిటీల సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడంలో కొన్ని జిల్లాలు వెనుకంజలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, హరితహారం, కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ప్రణాళిక, స్మశాన వాటికలు, నర్సరీల అభివృద్ధి, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, ఆట స్థలాలు, పార్కులు తదితరాలపై దృష్టి సారించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. పట్ట ప్రగతి కోసం ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీహెచ్‌ఎంసీకి రూ.156 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.140 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement