Progress in the development
-
పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రగతి అమలు కోసం మున్సిపల్ పరిపాలన శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను మరింత సరళీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డులు, మున్సిపాలిటీల వారీగా సమాచారం సేకరించడంతో పాటు, ప్రతీ వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ వార్డు స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు కమిటీల సమాచారాన్ని అప్లోడ్ చేయడంలో కొన్ని జిల్లాలు వెనుకంజలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, హరితహారం, కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ప్రణాళిక, స్మశాన వాటికలు, నర్సరీల అభివృద్ధి, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, ఆట స్థలాలు, పార్కులు తదితరాలపై దృష్టి సారించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. పట్ట ప్రగతి కోసం ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీహెచ్ఎంసీకి రూ.156 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.140 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యతతోనే రాష్ట్ర ప్రగతి
అనకాపల్లి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని రంగాల్లో ప్రగతి అభివృద్ధి సాధ్యమవుతుందని వర్తక సంఘం గౌరవ కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణరావు (పెదబాబు) అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అనకాపల్లి వర్తక సంఘం అనుబంధ సంస్థలు, ఎన్టీఆర్ మా ర్కెట్‌యార్డుకు చెందిన వర్తకులు, కొలగార్లు సోమవారం భారీ ర్యాలీ, నెహ్రూచౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. మార్కెట్‌యార్డు నుంచి రింగ్‌రోడ్డు, మెయిన్‌రోడ్డు మీదుగా వర్తక సంఘం అనుబంధ సంస్థలైన ఏఎంఏఎల్ కళాశాల, ఏఎమ్‌ఏఏ హైస్కూల్, ఘోషాస్పత్రి, ఏఎమ్ఏ ఎలిమెంటరీ పాఠశాల, ఆస్క్ కళాశాలల నుంచి అధ్యాపక, ఉపాధ్యాయ బృందం, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మార్కెట్‌యార్డు వర్తకులు, కార్మికులు, కళాసీలు, కొలగార్లు భారీ సంఖ్య లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూచౌక్ వద్ద మానవహారంగా ఏర్పడిన వర్తకులు, విద్యార్థులనుద్దేశించి పెదబాబు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వందలాది పరిశ్రమల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల యువత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. ర్యాలీలో గాంధీ, నెహ్రూ, పొట్టి శ్రీరాములు, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భారతమాత, తాండ్ర పాపారాయుడు తదితర స్వాతంత్య్ర సమరయోథులు, దేశభక్తుల వేషధారులు విశేషంగా ఆకట్టుకున్నారు.