-ఉమ్మడి ఫైళ్లు తెలంగాణాతో సమన్వయంతో స్కానింగ్ చేయండి
-న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలు డిజిటలైజేషన్
-జీఏడీలో 14 వేల పుస్తకాలు డిజిటలై జేషన్
-నేడు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లనున్న నాలుగు శాఖలు
-ఉదయం 6 గంటలకు సచివాలయంలో బస్సులు ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ఫర్నీచర్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో కొత్త ఫర్నీచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని ఫర్నీచర్, ఎయిర్ కండీషన్స్‌ను అవసరమైతే గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లిన శాఖాధిపతుల కార్యాలయాలకు ఇవ్వాలని టక్కర్ సూచించారు. ఈ మేరకు సీఎస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉమ్మడి ఫైళ్లను తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో స్కానింగ్ చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో ఫైళ్ల స్కానింగ్ ఏ ధరకైతే చేయించారో అదే ధరకు స్కానింగ్ చేయించాలని, ఇందుకు ఐటీ శాఖతో సంప్రదింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ శాఖలను, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలను ఒకే చోట కేటాయింపులు చేయాలని సీఎస్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం ఉదయం వెలగపూడి సచివాలయానికి పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి, కార్మిక, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య శాఖలు తరలివెళ్లనున్నాయి. ఇందుకోసం బుధవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో ఆరు బస్సులను ఏర్పాటు చేశారు. న్యాయ శాఖలో 20 వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.
ఒకే పుస్తకం రెండేసి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకే పుస్తకం ఉంటే డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రణాళికా శాఖ లైబ్రరీలో ఏడు వేల పుస్తకాలున్నాయి. వీటిని కూడా డిజిటలైజేషన్ చేయాలని ఆయన సూచించారు. సాధారణ పరిపాలన శాఖలో 12,600 ఇంగ్లీషు, 1700 తెలుగు కలిపి మొత్తం 14,300 పుస్తకాలున్నాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చట్టాలు, ఉమ్మడి మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా గెజిటీర్స్, జనాభా లెక్కల పుస్తకాలు, నిజాం కాలానికి చెందిన దస్త్రాలున్నాయని, వీటిని డిజిటలైజేషన్ చేయాల్సిందిగా సీఎస్ సూచించారు.
21వ తేదీ కల్లా సచివాలయ శాఖలన్నీ తరలింపు
జూలై 21వ తేదీ నాటికల్లా సచివాలయంలోని అన్ని శాఖలు వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లేందుకు వీలుగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. జూలై 6వ తేదీన వెలగపూడిలోని ఐదవ భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు, జూలై 15వ తేదీన ఒకటి నుంచి నాలుగు భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లోకి కొన్ని శాఖలు, జూలై 21వ తేదీన ఒకటి నుంచి నాల్గో భవనంలోని తొలి అంతస్థులోకి కొన్ని శాఖలు తరలివెళ్లాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు