వెల్‌కమ్‌ టు ఐకియా.. | Ikeas 4-lakh-square-feet Hyderabad store to offer 1000 products | Sakshi
Sakshi News home page

వెల్‌కమ్‌ టు ఐకియా..

Published Thu, Aug 9 2018 12:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

 Ikeas 4-lakh-square-feet Hyderabad store to offer 1000 products - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గురువారం ఈ స్టోర్‌ ప్రారంభం కానుంది. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్‌ ఇండియా సీఈవో పీటర్‌ బెజెల్‌ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌ స్టోర్‌ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.  

భారత్‌లో 40 నగరాల్లో.. 
దేశంలో 40 నగరాల్లో ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్‌ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్‌ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం.  

పన్నులు సరికాదు..: దిగుమతి చేసుకునే ఫర్నిచర్‌పై అధిక పన్నులకు బదులు దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని ఐకియా గ్రూప్‌ సీఈవో జాస్పర్‌ బ్రాడిన్‌ సూచించారు. ‘ఎక్కువ పన్నులతో కస్టమర్లకే భారం. తయారీ మెరుగుపడదు.  భారత్‌లో స్థలం కొనుగోలు, హక్కుల బదిలీ క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇక్కడ స్టోర్ల ప్రారంభం ఆలస్యం అయింది. రిటైల్‌లో తరచూ మారే విధానపర నిర్ణయాలు ఆందోళన కలిగించే విషయం. పాలసీలు ఆకట్టకునేలా  ఉండాలి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఇక్కడ అడుగుపెట్టాం’ అని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement