
10 నగరాల్లో ఆన్‌లైన్ విక్రయాలు
గురుగ్రామ్, నోయిడాలోనూ ఔట్‌లెట్స్
ఐకియా ఇండియా సీఈవో సుసాన్
న్యూఢిల్లీ: ఫర్నిచర్ రంగ దిగ్గజం ఐకియా భారీగా విస్తరిస్తోంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌తోపాటు మరో తొమ్మిది మార్కెట్లలో ఆన్‌లైన్ విక్రయాలను ఈ వారం ప్రారంభిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో తదుపరి దశ పెట్టుబడుల కోసం చూస్తోందని, విస్తరణ తర్వాత లాభదాయకతకు చేరుకుంటుందని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పల్వరర్ తెలిపారు.
ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 2026లో గురుగ్రామ్ వద్ద, అలాగే 2028లో నోయిడాలో పూర్తి స్థాయిలో స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. చెన్నై, పుణేలోనూ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భారీ స్టోర్ ఏర్పాటుకు ముందే చిన్న కేంద్రాలను ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. పుణేలో కంపెనీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్మకాలను సాగిస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో భారీ స్టోర్లున్నాయి.
రూ.10,500 కోట్లతో..: పదేళ్లలో అనుబంధ మౌలిక సదుపాయాలతో ఐకియా ద్వారా 10 స్టోర్లను ఏర్పాటు చేయడానికి రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంగ్‌కా గ్రూప్‌లో భాగమైన ఇంగ్‌కా సెంటర్స్ ఐకియా రిటైల్‌ను నిర్వహిస్తోంది. గురుగ్రామ్, నోయిడాలో లైక్లీ బ్రాండ్ కింద కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.9,136 కోట్ల పెట్టుబడి పెడుతోంది.
పెట్టుబడుల విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. మెట్రోల్లో విస్తరించిన తర్వాత తదుపరి దశలో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు సుసాన్ తెలిపారు. కాగా, 2023–24లో కంపెనీ టర్నోవర్ భారత్‌లో రూ.1,810 కోట్లు. నష్టాలు రూ.1,299 కోట్లకు చేరాయి. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కూడా లాభాలను ఆర్జిస్తామని సుసాన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment