రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లోని రహదారులపై అనుమతి లేకుండా అడ్డంగా వెలసిన ప్రార్థనా మందిరాలను నెలరోజుల్లోగా తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్న కుమార్ మహంతి పురపాలక శాఖను ఆదేశించారు. రహదారులపై వెలసిన ప్రార్థనా మందిరాలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల దీనిపై నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మెమో రూపంలో పురపాలక శాఖతోపాటు, జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు పంపారు.
జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేసి పట్టణాలు, నగరాల్లోని అనధికార ప్రార్థనా సంస్థలను తొలగించడం, అడ్డంకిగా మారిన వాటిని స్థానిక ప్రజలు, మతపరమైన నాయకులను సంప్రదించి వాటిని మరోచోటకు తరలించే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతీనెలా దీనికి సంబంధించి నివేదికలను పురపాలక శాఖ సంచాలకులకు ఇవ్వాలని ఆదేశించారు.