Prasanna Kumar mohanty
-
మీరు పుట్టిన జిల్లా పేరు ఇవ్వండి: సీఎస్ మహంతి
కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు సీఎస్ మహంతి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు తాము పుట్టిన జిల్లా పేరుతోపాటు, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా సమాచారాన్ని కూడా నాలుగురోజుల్లో విధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 23వ తేదీలోగా ఉత్తర్వుల్లో జారీ చేసిన నమూనా పత్రం ఆధారంగా వివరాలు అందించాలని ఆయన శనివారం ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసు, రెవెన్యూయేతర సర్వీసుల నుంచి ఐఏఎస్‌లుగా ఎంపికైన వారు ఏ సంవత్సరంలో ఐఏఎస్ కోటాలో ఎంపికయ్యారు.? పుట్టిన జిల్లా, తల్లిదండ్రులు పుట్టిన జిల్లా, పాఠశాల విద్యలో నాల్గో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎక్కడ చదివారు..? పదవ తరగతి/తత్సమాన పరీక్ష ఏ జిల్లాల్లో ఉత్తీర్ణులయ్యారు..? ఎస్సీ/ఎస్టీ/బీసీ/అన్ రిజర్వ్డ్ కేటగిరీనా.? అన్న వివరాలను కూడా సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం అదనపు కార్యదర్శికి అందించాలని మహంతి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఏర్పాటు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కేటాయించడానికి వీలుగా ఈ వివరాలు కోరారు. -
మహంతి పదవీ కాలం పొడిగింపుపై తీర్పు వాయిదా
హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలం పొడిగింపు వ్యవహారంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై తీర్పును వాయిదా వేస్తున్న హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొన్నటి వరకు సాగిన వాదనలను ఇటు పిటిషనర్లు, ఇటు ప్రభుత్వం, మహంతి రెండు పేజీలకు మించకుండా వేర్వేరుగా రాతపూర్వకంగా బుధవారం ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎం.చంద్రమౌళీశ్వరరావు, విజయవాడ, పటమటకు చెందిన కన్జ్యూమర్స్ గెడైన్స్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ సి.హెచ్.దివాకర్‌బాబు వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మహంతి కొనసాగింపుపై హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడంపై హైకోర్టు సోమవారం స్పందించింది. కేబినెట్ సిఫారసు లేకుండా మహంతిని ఎలా ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మహంతికి కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. మహంతిని సీఎస్‌గా కొనసాగించడం ఐఏఎస్ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఆయన కొనసాగింపు జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన సి.హెచ్.దివాకర్‌బాబు, మరొకరు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. -
కొత్త సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు?
గడువు పొడిగించుకునేందుకు మహంతి విముఖత సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యే అవకాశముంది. ఆయన ప్రస్తుతం భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)గా పనిచేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ప్రసన్నకుమార్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తరువాత మరో మూడు నెలలు గడువు పొడిగించుకుని కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. కానీ ఇందుకు ఆయన విముఖంగా ఉన్నారు. వాస్తవానికి కేంద్ర సర్వీసులో ఉన్న మహంతి.. అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కోరిక మేరకు రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంతోపాటు తాను రాష్ట్ర సర్వీసుకు రావడానికి కారణమైన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎస్‌గా గడువు పొడిగించుకోవాలనే ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 28తో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన 1979 ఐఏఎస్ బ్యాచ్ ఐవైఆర్ కృష్ణారావు సమైక్య రాష్ట్రంలో కొత్త సీఎస్‌గా నియమితులవుతారని భావిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28లోగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన పక్షంలో.. కొత్త సీఎస్ నియామకాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. లేదంటే ప్రభుత్వం లేదా గవర్నర్ కొత్త సీఎస్‌ను ఎంపిక చేస్తారు. మహంతి తరువాత సీనియర్‌గా ఐ.వి.సుబ్బారావు ఉన్నారు. అయితే ఆయన యునెస్కోలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు సీనియర్ కావడంతో కొత్త సీఎస్ ఆయనే కానున్నారని అధికార వర్గాల సమాచారం. కృష్ణారావు సర్వీసు 2016 జనవరి వరకు ఉంది. -
రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లోని రహదారులపై అనుమతి లేకుండా అడ్డంగా వెలసిన ప్రార్థనా మందిరాలను నెలరోజుల్లోగా తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ప్రసన్న కుమార్ మహంతి పురపాలక శాఖను ఆదేశించారు. రహదారులపై వెలసిన ప్రార్థనా మందిరాలు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇటీవల దీనిపై నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మెమో రూపంలో పురపాలక శాఖతోపాటు, జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు పంపారు. జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేసి పట్టణాలు, నగరాల్లోని అనధికార ప్రార్థనా సంస్థలను తొలగించడం, అడ్డంకిగా మారిన వాటిని స్థానిక ప్రజలు, మతపరమైన నాయకులను సంప్రదించి వాటిని మరోచోటకు తరలించే కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతీనెలా దీనికి సంబంధించి నివేదికలను పురపాలక శాఖ సంచాలకులకు ఇవ్వాలని ఆదేశించారు. -
5 బండిళ్లలో తెలంగాణ ముసాయిదా బిల్లు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో దీన్ని తీసుకొచ్చారు. మొత్తం 5 బండిళ్లలో ఉన్న ముసాయిదా బిల్లు ప్రతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతికి అందజేశారు. సచివాలయంలో మొహంతిని కలిసి సురేష్ కుమార్ దీన్ని అందజేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రధాన కార్యదర్శి- ముఖ్యమంత్రికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం బిల్లు ప్రక్రియ కొనసాగనుంది. ప్రధాన కార్యదర్శి కి బిల్లు ముసాయిదా అందజేయడమే తన పని సురేష్ కుమార్ తెలిపారు. కాగా, బిల్లు రేపు శాసనసభ ముందుకు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బిల్లుపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంద్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఓ తీర్మానం చేయాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరింది. -
సీఎస్‌తో కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతితో కేంద్ర హోంశాఖ టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం సచివాలయంలో సమావేశమైంది. విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలపై టాస్క్‌పోర్స్ బృందం సీఎస్‌తో చర్చించింది. శాంతి భద్రతలు, నక్సల్స్, వివిధ సంస్థలపై అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని హోంశాఖ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించటంలో ఆంధ్రప్రదేశ్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రెండు, మూడు రోజుల్లో నివేదిక అందచేస్తామని తెలిపారు. మరోవైపు ఐటీ అధికార ప్రతినిధులతో కూడా కేంద్ర హోంశాఖ టాస్క్‌ఫోర్స్ బృందం సమావేశం అయ్యింది. కాగా ఇప్పటికే నదీజలాలు, విద్యుత్, సహజవనరులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక ప్యాకేజీల విషయమై ఆయా శాఖల రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న టాస్క్ ఫోర్స్ బృందం ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల వివరాలను సేకరించింది. -
మహిళా సహకార ఆర్థికసంస్థలో అక్రమాల కేసు
ఐఎఫ్ఎస్ కిషన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థలో చోటు చేసుకున్న సుమారు రూ.30 కోట్ల కుంభకోణంలో ఆ సంస్థ ఎండీగా పనిచేసిన ఐఎఫ్ఎస్ అధికారి ఎ.కిషన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కిషన్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ ఉన్నతాధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానికి అనుగుణంగా ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వం అనుమతించింది. వాస్తవానికి ఒక చెక్ బౌన్స్ కేసులో ఈ ఏడాది మే నెలలో అరెస్టైన కిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అదే నెలలో సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేర కు గత ఏప్రిల్‌లో నమోదైన కేసుకు సంబంధించి ప్రస్తుతం ప్రా సిక్యూషన్‌కు అనుమతించింది. ఐపీసీ సెక్షన్లు 120-బి, 403, 408, 409, 418, 419, 420, 471, 468తో పాటు, ఏపీ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994, ఏపీ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం చార్జిషీటు దాఖలుకు ప్రభుత్వం అనుమతించింది. మహిళా సహకార సంస్థలో 2006 మార్చి 11వ తేదీ నుంచి 2008 ఫిబ్రవరి 12 వరకూ (కిషన్ ఎండీగా ఉన్నకాలం) నిబంధనలకు విరుద్ధంగా రుణాలిచ్చి నిధులు స్వాహా చేయడం వంటి అక్రమాలపై సీఐడీ చార్జిషీటు దాఖలు చేయనుంది. అటవీశాఖలో జరిగిన అక్రమాలకు సం బంధించి కిషన్‌పై గతంలోనూ 2 కేసులు నమోద య్యాయి. -
మున్సిపోల్స్‌కు 4 నెలల గడువివ్వండి
హైకోర్టుకు విన్నవించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో నాలుగు నెలలు గడువు కావాలంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. సెప్టెంబర్ రెండో తేదీ నాటికి మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతితో చర్చించి, ఆ అఫిడవిట్లో పొందుపర్చాల్సిన అంశాలను వారి నుంచి తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయని, అంతేకాకుండా ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదన్న అభిప్రాయాన్నీ అఫిడవిట్లో పొందుపరచనున్నట్లు సమాచారం. సీమాంధ్రలో రాజమం డ్రి, గుంటూరు, అనంతపురం రీజియన్ల నుంచి ఎన్నికల సమాయత్తానికి సంబంధించిన సమాచారం రావడం లేదని ఉన్నతాధికారులు సీఎంకు సమావేశంలో వివరించారు. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్టణం రీజియన్ల నుంచి ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్ల ముసాయిదా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 165 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలు, 19 మునిసిపల్ కార్పొరేషన్లు ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఒక్కదానికి మాత్రమే పాలకమండలి ఉంది. మిగిలిన వాటికి ప్రత్యేకాధికారులే పాలకులు. మూడేళ్లుగా వారి అధీనంలోనే పాలన కొనసాగుతోంది. ఏదేమైనా మునిసిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతోంది.