సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ప్రసన్నకుమార్ మహంతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించడంపై హైకోర్టు సోమవారం స్పందించింది. కేబినెట్ సిఫారసు లేకుండా మహంతిని ఎలా ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మహంతికి కూడా నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. మహంతిని సీఎస్‌గా కొనసాగించడం ఐఏఎస్ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఆయన కొనసాగింపు జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడకు చెందిన సి.హెచ్.దివాకర్‌బాబు, మరొకరు వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.