
సీఈసీ రాజీవ్ కుమార్ దంపతులతో కాబోయే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దంపతులు తదితరులు
పదవీ విరమణ సందర్భంగా ఈసీనుద్దేశిస్తూ సీఈసీ రాజీవ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య దేవాలయంగా పరిఢవిల్లుతోందని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా పదవీ విరమణ చేసిన రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. 2022 మే 15వ తేదీన సీఈసీగా బాధ్యతలు చేపట్టి అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలుసహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను సీఈసీ హోదాలో సమర్థవంతంగా నిర్వహించిన రాజీవ్ మంగళవారం సాయంత్రం రిటైర్ అయ్యాక నిర్వాచన్ సదన్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ నా దృష్టిలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రజాస్వామ్య దేవాలయం.
గత 75 ఏళ్లుగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమున్నత శిఖరాలపై నిలిపింది. తీరా ఎన్నికలప్పుడే ఎన్నికల ప్రక్రియపై పలు పార్టీలు, నేతలు అనుమానాలు వ్యక్తం చేయడమనేది కేవలం ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసేందుకు వేసే ఎత్తుగడలు. ఎన్నికలకు సంబంధించి చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ కోర్టులో ప్రత్యక్ష ప్రసారాలు కావడం కొన్నిసార్లు అపనమ్మకాలకు దారితీయొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
ఆర్థికభారం కావొద్దు
‘‘అనుచిత ఉచిత వాగ్దానాలు, స్థాయికి మించిన వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఎప్పటికప్పుడు అప్రమత్త ధోరణితో వ్యవహరించాలి. కేంద్ర, రాష్ట్రాలకు ఆర్థికభారం కాకుండా ఉచిత పథకాలు, హామీలు ఇస్తే మంచిది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడను’’అని ఆయన అన్నారు. ‘‘ ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలను అమాంతం పెంచేసి వాస్తవ పరిస్థితుల నుంచి ఓటర్లను దూరంగా తీసుకెళ్తాయి. ఈ విషయంలో మీడియా మరీముఖ్యంగా ఎల్రక్టానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు పూర్తి అజమాయిషి, నియంత్రణ లేదు.
అందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ చేపట్టే సంస్థలే స్వీయనియంత్రణ కల్గిఉండాలి. సర్వేకు శాంపిల్ సైజు ఎంత? అసలు ఎంత విస్తృత స్థాయిలో సర్వే చేశారు?. సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలను ఏ మేరకు ప్రతిబింబిస్తాయి?. అనేవి చూసుకోవాలి’’ అని రాజీవ్ అన్నారు. ‘‘ కొత్త సారథి నాయకత్వంలో ఈసీ మరింతగా సమర్థవంతంగా ఎన్నికలు చేపట్టాలని ఆశిస్తున్నా. భారతీయ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఓటర్లు, రాజకీయపార్టీలు తమ వంతు కృషిచేయాలి.
ఈ బాధ్యతలను భుజాలకెత్తుకున్న ఓటర్లందరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. 2020 ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ అదే ఏడాది సెపె్టంబర్ ఒకటిన ఎలక్షన్ కమిషనర్‌గా ఈసీలో చేరారు. 2022 మే 15న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. సీఈసీగా ఆయన అన్ని రకాల ఎన్నికలను నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు, 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు సమర్థవంతంగా చేపట్టారు.
నేడే సీఈసీగా జ్ఞానేశ్ బాధ్యతల స్వీకరణ
కేంద్ర ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 జనవరిలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా రిటైర్ అయిన జ్ఞానేశ్ ఆ తర్వాత రెండు నెలలకే కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్‌గా కొత్త పాత్రలో కొలువుదీరారు. ఈసీ సభ్యుల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త చట్టం అమల్లోకి వచ్చాక సీఈసీగా బాధ్యతలు చేపడుతున్న తొలి వ్యక్తి జ్ఞానేశ్ కావడం విశేషం. కేంద్ర సహకార మంత్రి అమిత్ షాకు అత్యంత ఆప్తునిగా పేరొందారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయడంలో జ్ఞానేశ్ కీలకపాత్ర పోషించారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 27వ తేదీన రిటైర్ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment