ఈ రోజు భారత ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. 2011 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జనవరి 25ను జరుపు కొంటున్నాం. దీని ఉద్దేశం ఓటర్లుగా భారత పౌరులకు ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించడమే. ఎన్నిల సంఘం (ఈసీ) పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ద్వారా రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వతమైన స్వయంప్రతిపత్తి గల కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి ప్రతీక. ఈసీ నిష్పాక్షికత, విశ్వసనీయత ఆధారంగా ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు; రాష్ట్రపతి ఎన్నికలు 16 సార్లు, అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరో 16 సార్లు ఎన్నికలు నిర్వహించింది. అలాగే 399 సార్లు శాసనసభ ఎన్నికలు నిర్వహించింది. 400వ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలావరకు రాజకీయపార్టీల, ప్రజల విశ్వాసాన్ని ఎన్నికల సంఘం చూరగొన్నదనే చెప్పాలి.
పటిష్ఠమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం చాలా కీలకం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. అదే సమయంలో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా ‘మనం విధులను నిర్వర్తించ కుండా వదిలేస్తే, హక్కుల కోసం పరుగు తీయాల్సి ఉంటుంది. అవి మనల్ని ఇష్టానుసారంగా తప్పించుకుంటాయి’ అన్న మహాత్మాగాంధీ మాటలు గుర్తు కొస్తున్నాయి.
94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకురావడం ఇప్పుడు మనముందున్న పెద్ద సవాల్. యువత లోనూ, పట్టణ ఓటర్లలోనూ ఉన్న ఉదాసీనత; బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వలసపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇంతమంది ఓటింగ్‌లో పాల్గొనలేదని చెప్పవచ్చు.
2022 నవంబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ కల్పాలో మరణించిన మొట్టమొదటి భారత ఓటర్ శ్యామ్ శరణ్ నేగీకి నివాళులు అర్పించే గౌరవం నాకు లభించింది. ఆయన తన 106వ ఏట మరణించే ముందు కూడా ఓటు హక్కును ఉపయోగించుకుని ఓటు వేయకుండా ఉండే ఉదాసీన పౌరులకు తమ విధి ఏమిటో తెలియచేశారు. ఆయన స్ఫూర్తిని అందరూ అందుకోవాలి. యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపుదిద్దబోతోంది. అందువల్ల ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలోనే ప్రజాస్వామ్య బీజం విద్యార్థుల్లో నాటడం అత్యంత క్లిష్టమైనదే కాదు, ముఖ్యమైనది కూడా.
ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థి నేపథ్యం గురించి తెలుసుకునే హక్కు ఉంది. ఈ కారణంగానే అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి వార్తాపత్రికల్లో తెలియ జేయాలి. ఇప్పటికీ ఎన్నికల్లో కండబలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించేవారు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం ఉండకూడదు. ఎన్నికల్లో ధనబలాన్ని అరి కట్టడం పెద్ద సవాల్‌గా మిగిలిపోయింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా వరకు ఇటువంటి విపరీత ధోరణులకు అడ్డుకట్ట పడింది. ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఇవ్వాళ సోషల్ మీడియా ఉంది. అందులో నకిలీ వార్తల ప్రచారం జరగకుండా చూడాల్సి ఉంది.
ఎన్నికలను అన్ని జాగ్రత్తలతో నిర్వహించడం ఎన్నికల సంఘం విధి. ఎన్నికల ప్రక్రియలో ఓటరే ప్రధాన భాగస్వామి. అందుకే ఓటు వేయడానికి కావలసిన స్నేహపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఈసీ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధమై ఉంది. పౌరులు ఓటరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి గర్వపడగలిగితే అది వారు ఎన్నుకున్న ప్రభుత్వ పాలనా స్థాయి మీద కూడా ప్రభావం చూపుతుంది. పౌరు లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు! (క్లిక్ చేయండి: నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య)
- రాజీవ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
(జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment