మన దేశ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో కొన్ని మార్పులను ప్రజలు ఆకాంక్షి స్తున్నారు. ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల నియమావళి, ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం వంటి వాటిలో మార్పులు రావాలని ఆశిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆలోచనలు ఉన్నా, అమలు వాయిదా పడుతూ వస్తున్నది. కొత్త కమిషనర్ సారథ్యంలో ఈ ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయని ఆశిద్దాం.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితులు ఉన్నప్పటికీ... నియంత్రణ వైఫల్యం కనిపిస్తోంది. ‘ఓటుకు నోటు’, మద్యం, ఇతర తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవడాన్ని నివారిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం మెరుగవుతుంది. పార్టీల ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషనర్ నియంత్రణ కలిగి ఉండాలని చాలామంది బలంగా కోరుతున్నారు. మేనిఫెస్టోలోని హామీల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అమలుకు సాధ్యంకాని, ప్రజాకర్షక హామీలను తొలగించే అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉండాలి. ఎన్నిక తరువాత కూడా, మేనిఫెస్టోలోని హామీల అమలు ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ బాధ్యతను ఎన్నికల కమిషన్ చేపడితే ప్రజాస్వా మ్యంపై ప్రజల నమ్మకం, కమిషన్ ప్రతిష్ఠ తప్పకుండా పెరుగుతాయి.
ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే... ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో సవరణలు నిరంతరం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా జరగాల్సి ఉంది. బోగస్ ఓటర్ల ఏరివేత, అర్హుల చేర్పు జనామోదంగా ఉండాలి. ఓటర్ల గుర్తింపును ‘ఆధార్’తో అనుసంధానం వేగిరపర్చాలి. ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎం (ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లపై ఉన్న అపోహలను, ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పారద్రోలి, ప్రజల విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలి. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?)
ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటింగ్ శాతం తగ్గితే, ఎన్నికలు అత్యధిక ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవు. ఎన్నో సవాళ్లు, సంస్కరణలు కొత్త ఎన్నికల కమిషన్‌కు స్వాగతం పలుకుతున్నా... సమర్థవంతంగా పరిష్కరిస్తూ ప్రజామోదం పొందాలని ఆకాంక్షిద్దాం. చరిత్రలో నిలిచిపోయేలా పనితీరు ఉండాలని కోరుకోవడం అత్యాశ ఎంతమాత్రం కాబోదు. (చదవండి: వారికో న్యాయం.. ఊరికో న్యాయం)
– ఏఎల్‌ఎన్ రెడ్డి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment