
పదవీ విరమణ తర్వాత పెద్ద హోదా కోరుకుంటున్నారు
ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్‌సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ
యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment