
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్‌కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది.
ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు.
అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం.
రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో!
గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా?
ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు!
ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి.
పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్‌కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్‌లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?
రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్‌గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా?
Comments
Please login to add a commentAdd a comment