హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ రూ.108 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 4లక్షల 10వేల లీటర్ల మద్యంతో పాటు 30,660 మద్యం కేసులను నమోదు చేశామన్నారు. మద్యం కేసులకు సంబంధించి 13, 300 మందిని అదుపులోకి తీసుకున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఈ క్రమంలోనే 8,043 బెల్టు షాపులను మూసివేశామన్నారు. 70 కేజీల బంగారం, 293 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలన్నారు.
ఈసారి రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ పక్షాలు ఇతర పార్టీల గుర్తులు వాడకుండా మోడల్ బ్యాలెట్ లను ముద్రించుకోవచ్చని భన్వర్ లాల్ తెలిపారు.ఎన్నికల్లో భాగంగా రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన సీఈసీ సంపత్ రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 70,171 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందులో 25,390 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించామని సంపత్ పేర్కొన్నారు. ఇందులో 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు, మద్య ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు.