Bhanvar Lal
-
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్ కోడ్ వంటివి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్ లాల్ హెచ్చరించారు. -
ఓటర్ల నమోదు గడువు 15 వరకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఇరు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారంతా ఓటర్లగా పేర్లు నమోదు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. గత నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటర్లగా నమోదు, జాబితాల్లో సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో ప్రత్యేకంగా ఓటర్ల నమోదు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారని చెప్పారు. దరఖాస్తులను, అభ్యంతరాలను 28వ తేదీలోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 16న ప్రకటిస్తామన్నారు. ‘సీఈవోఆంధ్రా, సీఈవోతెలంగాణ’ సైట్ల ద్వారా ఓటర్‌గా నమోదుచేసుకోవచ్చన్నారు. -
స్థానిక ఎమ్మెల్సీ స్థానాలను పునర్విభజించాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటే.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ స్థానాలను పునర్విభజన చేయాల్సి ఉందని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కూడా భన్వర్‌లాల్ ప్రత్యేక నోట్ పంపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 17 మాత్రమే ఉండాలని.. ప్రస్తుతం 20 ఎమ్మెల్సీ స్థానాలున్నందున మూడు స్థానాలను తగ్గించాల్సి ఉందని భన్వర్‌లాల్ ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావుకు పంపిన నోట్లో పేర్కొన్నారు. ఈ తగ్గింపును జనాభా ప్రాతిపదికన కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున... ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్నే సంప్రదించాల్సిందిగా సూచించారు. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల సంఖ్య 14 ఉండాలని.. అయితే ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నందున.. మూడు స్థానాలను పెంచాల్సి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు సీఈఓ భన్వర్‌లాల్ నోట్ పంపారు. జనాభా ప్రాతిపదికన స్థానాల సంఖ్య పెంపు కేంద్ర ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉన్నందున.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చినందున గతంలో శాసనమండలి ఏర్పాటు చేస్తూ చేసిన చట్టంలో పేర్కొన్న ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య ఇప్పుడు అమల్లో ఉండదు. గత చట్టాలన్నింటినీ రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద చేసిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అధిగమిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న సంఖ్య మేరకు ఆ స్థానాల పునర్విభజన చేయాల్సి ఉంది. ‘స్థానిక’ ప్రజాప్రతినధిలూ ప్రమాణం చేశాకే... ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో 11 ఖాళీగా ఉన్నాయి. ఇందులో మూడు స్థానాలను తగ్గించాల్సి ఉంది. ఈ తగ్గింపు చేసిన తరువాతనే మిగతా ఖాళీగా ఉన్న 8 స్థానాల్లో స్థానిక ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే.. తెలంగాణ శాసనమండలిలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీగా ఉండగా.. కొత్తగా మూడు స్థానాలను పెంచాల్సి ఉందని.. ఈ మూడు స్థానాలను పెంచిన తరువాత మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 70 శాతం మంది బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేస్తే గానీ స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంత మంది ప్రమాణ స్వీకారం చేశారో వివరాలు పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను కోరుతున్నామని తెలిపారు. తగ్గేది ఎక్కడ? పెరిగేది ఎక్కడ? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానిక నియోజకవర్గాల స్థానాల్లో మూడు స్థానాలు తగ్గించడం జనాభా ప్రాతిపదికన చేస్తారు. 2011 జనాభా ప్రాతిపదికన చూస్తే ఏపీ శాసనమండలి స్థానిక నియోజవర్గాల్లో.. కృష్ణా, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో రెండేసి స్థానాలు చొప్పున ఉండగా.. వాటిని ఒక్కొక్క స్థానానికి తగ్గించనున్నారు. తెలంగాణ శాసనమండలి స్థానాల పెంపును కూడా ఆయా జిల్లాల జనాభా ఆధారంగా చేయనున్నారు. దాని ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానిక నియోజవర్గం చొప్పున మూడు స్థానాలు పెరగనున్నట్లు అధికార వర్గాల సమాచారం. 8 స్థానాల పెంపు కోరనున్న ఏపీ ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను మరో 8 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాయనుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ మండలికి 50 స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు ఉన్నందున ఆ నిష్పత్తిలో గరిష్టంగా కౌన్సిల్లో 58 స్థానాలు ఉండొచ్చు. ఇదే విషయంపై ఆర్థికమంత్రి యనమల బుధవారం మీడియాతో మాట్లాడుతూ మరో 8 స్థానాలు పెంచాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయనున్నట్టు చెప్పారు. -
మళ్లీ కోడ్ మీరితే లగడపాటి అరెస్టు
సీఈవో భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఎన్నికలు జరగటానికి ముందుగా సర్వేల పేరుతో లగడపాటి తెలంగాణలో వీరు గెలుస్తారు, సీమాంధ్రలో వారు గెలుస్తారు అంటూ మీడియాకు ప్రకటనలు చేయటాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తప్పుపట్టారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లగడపాటి చర్యలను కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తూ లగడపాటికి నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం భన్వర్‌లాల్ విలేకరులకు తెలిపా రు. తెలంగాణలో పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారు ఇంజన్లో కాలిన డబ్బులు పట్టుపడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఆ డబ్బు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కంపెనీకి చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, దర్యాప్తులో రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాకు రెండు మూడు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
సీమాంధ్రలో ప్రచారానికి నేటితో తెర
ఆ తర్వాత నుంచి అమల్లోకి ఆంక్షలు హైదరాబాద్: సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. మావోయిస్టు ప్రభావిత అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుండగా... కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగతా 165 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాయంత్రం 6 గంటలకు ముగించేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. ప్రతీ నియోజకవర్గం పరిధిలో ఓటర్లు కాని బయటి వ్యక్తులు ఉండి ఉంటే, వారిని గుర్తించి అక్కడి నుంచి పంపించేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం హోటళ్లు, లాడ్జిలు, అతిధి గృహాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. -
జంటనగరాల్లో పోలింగ్ అంతంతే!
తెలంగాణలో 70.85 శాతం జంట నగరాల్లో 53 శాతమే ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు చెల్లింపులు కోడ్ ఉల్లంఘనే సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంత చెప్పినా జంటనగరాల ఓటర్లు వినిపించుకోలేదు. ఎప్పటి తరహాలోనే ఈసారి ఎన్నికల్లో కూడా జంటనగరాల్లో ఓటు వేయడానికి రాలేదు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి పైగా జరిగినా, జంటనగరాల పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో 53 శాతానికి మించలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలు, ఆ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత, ఇప్పటి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం 53 శాతానికి మించలేదు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా రీ పోలింగ్ లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఈవీఎంలు మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పంపించనందుకు ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు మెమోలు జారీ చేశామని, పోలింగ్ శాతం గురించి కాదని ఆయన తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లింపులు చేపట్టాలని గతంలో ఆదేశాలు జారీ చేశామని, నియమావళి అమల్లో ఉండగా చెల్లింపులు జరపడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లు స్వాధీనం చేసుకుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీ నివారించేందుకు, సంబంధిత ఫిర్యాదులను స్వయంగా స్వీకరించేందుకు ఆదివారం నుంచి రెండు ఫోన్ నంబర్లు ఇస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సీమాంధ్ర పోరుకు సర్వం సిద్ధం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న (బుధవారం) పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భన్వర్‌లాల్ తెలిపారు. 90 శాతం పైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాల్సిందిగా సీమాంధ్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ స్థానాల్లో 2,243 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎస్ఎంఎస్, రేడియో, సినిమా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిషేధమని భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో నమోదైన పోలింగ్ వివరాలు లోక్‌సభ స్థానం 2009 2014 పోలింగ్ శాతం పోలింగ్ శాతం ఆదిలాబాద్ 76.32 73.49 పెద్దపల్లి 68.62 71.56 కరీంనగర్ 65.89 73.55 నిజామాబాద్ 66.53 71.51 జహీరాబాద్ 74.54 76.00 మెదక్ 76.00 77.92 మల్కాజ్గిరి 51.43 51.19 సికింద్రాబాద్ 54.88 53.28 హైదరాబాద్ 52.47 52.52 లోక్‌సభ స్థానం 2009 2014 పోలింగ్ శాతం పోలింగ్ శాతం చేవెళ్ల 64.47 60.08 మహబూబ్‌నగర్ 67.54 71.30 నాగర్ కర్నూలు 69.97 75.00 నల్లగొండ 73.76 79.01 భువనగిరి 76.13 80.99 వరంగల్ 69.21 76.46 మహబూబాబాద్ 78.59 80.58 ఖమ్మం 81.68 80.00 మొత్తం 68.71 70.85 -
అధినేతలు...ఉల్లంఘనలు!
మరికొన్ని రోజుల్లో ఆవిర్భవించబోతున్న కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ స్థానాలకూ, 17 లోక్‌సభ స్థానాలకూ బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 72 లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 9 దశలలోనూ ఏడు దశలు ముగిసినట్టయింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవి. తమకు నచ్చిన పాలకులను తామే ఎన్నుకునే స్వేచ్ఛ ఈ ఎన్నికల ద్వారా పౌరులకు లభిస్తుంది. సుప్రీంకోర్టు పుణ్యమా అని ‘పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ సమ్మతం కాద’ని తెలియజేసేందుకు వీలుగా ఈసారి ఈవీఎంలకు అదనపు మీట జోడించడంతో వోటు హక్కు మరింత సంపూర్ణత్వాన్ని సంతరించు కుంది. వోటు హక్కును ఎలాంటి ప్రలోభాలకూ లోనుకాకుండా వినియోగించుకోవాలని, మంచి అభ్యర్థులను ఎంచుకోవాలని ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈసారి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోమని అభ్యర్థించడం దగ్గరనుంచి ఓటేయవలసిన అవసరాన్ని చెప్పడం వరకూ పౌరుల్లో చైతన్యం కలిగించడానికి అన్నిరకాల ప్రసారమాధ్యమాల ద్వారా ఆయన కృషిచేశారు. ఓటర్లలో తలెత్తిన సందేహాలకు వివిధ వేదికలద్వారా సమాధానాలిచ్చారు. కానీ, పోలింగ్ సరళిపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతుండగా జరిగిన ఒక ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలోకి ఒక్కసారిగా చొరబడి ఆయనతో జగడానికి దిగారు. హైదరాబాద్ నగరంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటికొచ్చాక తాను బీజేపీకి రెండు ఓట్లు వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై అంతక్రితం భన్వర్‌లాల్ అభ్యంతరం వ్యక్తంచేయడమే వీరి గొడవకు మూలకారణం. భన్వర్‌లాల్ పరిధికి మించి మాట్లాడలేదు. చట్టంలో లేని నిబంధనలేమీ బాబుకు వర్తింపజేయాలనుకోలేదు. తాము ఎవరికి ఓటేశామో చెప్పడం సరికాదని ఆయనన్నారు. బ్యాలెట్ పత్రం ఉన్నరోజుల్లో ఓటేసి దాన్ని అందరికీ చూపించినట్టయితే అది చెల్లబోదని ప్రకటించేవారని, ఇప్పుడు ఈవీ ఎంలు గనుక అది సాధ్యంకాదుగానీ...ఇలా మాట్లాడటం మాత్రం సరైందికాదని భన్వర్‌లాల్ వివరించారు. ఇందులో అసంగతమైనదిగానీ, కనీవినీ ఎరుగనిదిగానీ ఏమైనా ఉన్నదా? ఒకవేళ తమ నాయకుడిని ఇలా వేలెత్తిచూపడం మహాపరాధమని టీడీపీ నేతలు అనుకుంటే ఆ మేరకు అభ్యంతరం చెబుతూ ఆయనకు లేఖ ఇవ్వొచ్చు. అలా చేయడం ఇష్టంలేకపోతే భన్వర్‌లాల్ ప్రకటనవల్ల బాబుకు పరువు నష్టం జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా నాయకులు విలేకరుల సమావేశాలు నిర్వహించరాదని, అది ప్రచారం చేయడంతో సమానమవుతుందని ఎన్నికల సంఘం చాలా ముందుగానే ప్రకటించింది. రాజకీయ పార్టీలు, నాయకులు సహకరించాలని విజ్ఞప్తిచేసింది. కానీ, బాబు చేసిందేమిటి? ఓటేసి బయటికొస్తూ సరిగ్గా అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. తాను బీజేపీకి ఓటేశానని చెప్పడంతోపాటు ఇలా చేయడం దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని గంభీరమైన ప్రసంగం చేశారు. వోటు హక్కు గోప్యతతో కూడినది. ఎవరికి ఓటు వేశామో చెప్పరాదన్నది సామా న్యులకు సైతం తెలిసిన విషయం. ఎన్నికల రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం మాత్రమేగాక... తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మరో తొమ్మి దేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం ఎరుక లేకపోవడం చిత్రమే. సావాసదోషమో ఏమోగానీ...బాబు ఇలావుంటే ఆయనతో కొత్తగా పొత్తు కలిపిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఓటేసి బయటికొచ్చాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలం బొమ్మను ప్రదర్శించారు. విలేకరుల సాక్షిగా ఆ బొమ్మ పట్టుకుని తన సెల్‌ఫోన్‌తో ముచ్చటగా ఒక ‘సెల్ఫీ’ కూడా తీసుకున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చురుగ్గా స్పందించింది. షోకాజ్ నోటీసు జారీ చేయడంకాక నేరుగా ప్రజాప్రాతినిధ్య చట్టంకింద రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేయాలని రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు జరిగి, చివరకు న్యాయస్థానాల్లో ఏమవుతుందనేది వేరే చర్చ. కానీ, నరేంద్ర మోడీ బీజేపీలో సాధారణ నాయకుడు కాదు. ఆయన ఆ పార్టీకి ప్రధాని అభ్యర్థి. అచ్చం బాబులాగే నరేంద్ర మోడీ కూడా బ్యాలెట్ పోరులో కాకలు తీరిన యోధుడు. మూడు దఫాలనుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి ఎన్నికల నిబంధనలుగానీ, చట్టాలుగానీ తెలియవనుకోలేము. తెలిసికూడా వాటిని ఉల్లంఘిస్తారని అసలే భావించలేము. సామాన్య పౌరులు లేదా పార్టీలోని సాధారణ కార్యకర్తలు అవగాహనా లోపంతో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా ప్రవర్తించినప్పుడు బాబు, మోడీ స్థాయి నాయకులు వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలిగిస్తాయో చెప్పాలి. కానీ, ఆశ్చర్యకరంగా వారిద్దరూ అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. పొరపాట్లు ఎవరికైనా సహజం. వాటిని నిదానంగానైనా గ్రహించి సరిదిద్దుకోవడం మంచి లక్షణం. ఆ సంగతిని ఇరువురు నాయకులూ గుర్తిస్తారని ఆశిద్దాం. -
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల విభజన
-
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల విభజన
ముందే విభజిస్తే ఎన్నికలపై ప్రభావం: సీఈఓ నోట్ విభజన మార్గదర్శకాలు సైతం మే 17వ తేదీ తర్వాతే.. హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉద్యోగుల విభజన చేయరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల విభజన కూడా ఎన్నికలయ్యాకనే చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నోట్ పంపారు. ఉద్యోగుల విభజన.. ఈ నెల 30న తెలంగాణ జిల్లాల్లోను, మే 7న సీమాంధ్ర జిల్లాల్లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని సీఈఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలయ్యే వరకు ప్రధానంగా రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల విభజనకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని తెలిపారు. ఒకవేళ తీసుకుంటే ఎన్నికలపై ప్రభావం చూపడంతో పాటు ఎన్నికల ప్రక్రియకు కూడా ఆటంకం కలగవచ్చనే అభిప్రాయూన్ని ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసింది. ఉద్యోగుల విభజన ఎలా ఉండాలనే దానిపై ఇప్పటికే ఇరు ప్రాంతాల ఉద్యోగ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఈ అంశాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఇప్పుడు వెలువరించరాదని సీఈఓ స్పష్టం చేశారు. ఎన్నికలు మే 7వ తేదీతో పూర్తి అవుతున్నప్పటికీ ఎన్నికల నియమావళి కౌటింగ్ పూర్తి అయ్యే వరకు అమల్లో ఉంటుంది. అందువల్ల ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఏ నిర్ణయాలైనా మే 17వ తేదీ తరువాతనే తీసుకోవాలని భన్వర్‌లాల్ ఆ నోట్లో పేర్కొన్నారు. దీంతో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయరాదని నిర్ణరుుంచింది. గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేసిన కమలనాథన్ ఈ విషయంపై చర్చించేందుకు సీఈఓ కార్యాలయానికి వచ్చారు. అరుుతే భన్వర్‌లాల్ భోజన విరామంలో ఉండటంతో పావు గంట వేచి చూసిన అనంతరం వెళ్లిపోయారు. మరోవైపు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎస్ మహంతి ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్‌ను కలసి విభజన పనులకు ఎన్నికల నియమావళి వర్తింపుపై చర్చించారు. -
25లోగా తెలంగాణలో ఓటరు స్లిప్పులు పంచండి
కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశం హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ పోలింగ్ జరిగే తెలంగాణ ప్రాంతం లో ఓటరు స్లిప్పుల పంపిణీని ఈనెల 25లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ స్లిప్పుల పంపిణీ, తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లుపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ సందర్భంగా ఎవరైనా ఇం ట్లో లేకపోయినా, లేదా మృతిచెందినా, మరో చోటకు తరలిపోయిన ఓ టర్ల పేర్లతో విడిగా జాబితా రూపొందించాలని సూచించారు. పోలింగ్ రోజు ఈ జాబితాలోని వారు ఓటింగ్‌కు వస్తే ఒకటికి రెండుసార్లు ఆ వ్యక్తిని నిర్ధారించుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతించాలన్నారు. రెండో దశలో పోలింగ్ జరిగే సీమాంధ్రలో ఓటర్ స్లిప్పులను బుధవారం నుంచి పం పిణీ చేయాలని ఆదేశించారు. సీమాంధ్రలో బుధవారం నామినేషన్ల గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని అదనపు ఈవీఎంలు అవసరమో నివేదిక పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. -
రాష్ట్రంలో రూ.108 కోట్లపైగా స్వాధీనం
హైదరాబాద్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నిలక ప్రధానాధికారి భన్వర్ లాల్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ రూ.108 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 4లక్షల 10వేల లీటర్ల మద్యంతో పాటు 30,660 మద్యం కేసులను నమోదు చేశామన్నారు. మద్యం కేసులకు సంబంధించి 13, 300 మందిని అదుపులోకి తీసుకున్నామని భన్వర్ లాల్ తెలిపారు. ఈ క్రమంలోనే 8,043 బెల్టు షాపులను మూసివేశామన్నారు. 70 కేజీల బంగారం, 293 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటేయాలన్నారు. ఈసారి రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ పక్షాలు ఇతర పార్టీల గుర్తులు వాడకుండా మోడల్ బ్యాలెట్ లను ముద్రించుకోవచ్చని భన్వర్ లాల్ తెలిపారు.ఎన్నికల్లో భాగంగా రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన సీఈసీ సంపత్ రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 70,171 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, అందులో 25,390 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించామని సంపత్ పేర్కొన్నారు. ఇందులో 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డబ్బు, మద్య ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. -
ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలపై చర్యలు
హైదరాబాద్: రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం(ఇసి) రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. గ్రామాల్లో ఈవీఎం నమూనాలను ప్రదర్శించి, ఓటర్లకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వద్దన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని చెప్పారు. ఈవీఎంలోని నోటా ఆప్షన్‌పై ఓటర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆధారాలు చూపకుండా తరలిస్తున్న 100 కోట్ల రూపాయలను పట్టుకున్నట్లు తెలిపారు. మూడున్నర లక్షల లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరిందన్నారు. ఓటర్లు డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లోను కావొద్దని భన్వర్ లాల్ కోరారు. -
'ఓటరు నమోదుకు ఇదే చివరి అవకాశం'
-
'రాష్ట్ర విభజనతో ఎన్నికలకు సంబంధం లేదు'
-
ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు సంబంధించిన సంఘటనలు, ఇతర సమాచారాన్ని పంపాలన్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే బెల్టుషాపులను మూయించాలన్నారు. సమాచార ప్రసార మాధ్యమాల్లో పెయిడ్ న్యూస్ పరిశీలించేందుకు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. మద్యం, నగదు నియంత్రణకు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 38 మంది ఎంపీడీఓలను బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఖర్చులు పర్యవేక్షించేందుకు స్వ్కాడ్స్, గణాంక సర్వీలైన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తహశీల్దార్లు విధుల్లో చేరిన వెంటనే శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారుల బదిలీలను పూర్తి చేశామన్నారు. జిల్లాలో అడిషనల్ ఎస్పీ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయన్నారు. 20 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, అసిస్టెంట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్
రాష్ట్రం ఒకటిగా ఉన్నా.. రెండుగా విడిపోయినా ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన తెలిపారు. జనవరి 25 తేదిన జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవాన్నినిర్వహిస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు నమోదు అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్ల 24లక్షల 6వేల 81 మంది అని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50లక్షల పదివేల 24 మంది ఓటర్లు ఉన్నారని.. విజయనగరంలో అత్యల్పంగా 16లక్షల 86వేల 174 మంది ఓటర్లు ఉన్నారని భన్వర్ లాల్ తెలిపారు. -
లక్ష ఓటర్ల దరఖాస్తులు పెండింగ్ :భన్వర్‌లాల్
సాక్షి, ఒంగోలు: ఒంగోలు డివిజన్లో పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్న ఓటర్ల నమోదు దరఖాస్తులను నెలాఖరు లోపు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. 2014 సంవత్సరానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితా ప్రచురించేందుకు తీసుకోవలసిన చర్యలను ఆయన అధికారులకు వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఓటర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల్లో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వీటిలో అధిక భాగం ఒంగోలు డివిజన్లో ఉన్నాయన్నారు. ఫారం 6 సంబంధించినవి 54 వేలు, ఫారం 7 ద్వారా 6 వేలు, ఫారం 8 ద్వారా 34 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంతా ఓటర్లుగా నమోదయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈ నెలాఖరు లోగా విచారణ పూర్తి చేసి పరిష్కరిస్తామని చెప్పారు. అదే విధంగా జిల్లాలో 11,25,828 మంది పురుష ఓటర్లు, 11,42,430 మహిళా ఓటర్లు కలిసి మొత్తం 22,68,309 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. సమీక్ష సమావేశంలో డీఆర్వో జి. గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ ఎ.పద్మజ, కందుకూరు ఆర్డీఓ టి.బాపిరెడ్డి, మార్కాపురం ఆర్డీఓ ఎం. రాఘవరావు, పలువురు తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.