కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు సంబంధించిన సంఘటనలు, ఇతర సమాచారాన్ని పంపాలన్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే బెల్టుషాపులను మూయించాలన్నారు. సమాచార ప్రసార మాధ్యమాల్లో పెయిడ్ న్యూస్ పరిశీలించేందుకు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. మద్యం, నగదు నియంత్రణకు అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు.
కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 38 మంది ఎంపీడీఓలను బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఖర్చులు పర్యవేక్షించేందుకు స్వ్కాడ్స్, గణాంక సర్వీలైన్స్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. తహశీల్దార్లు విధుల్లో చేరిన వెంటనే శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారుల బదిలీలను పూర్తి చేశామన్నారు. జిల్లాలో అడిషనల్ ఎస్పీ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయన్నారు. 20 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, అసిస్టెంట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.