కార్పొరేషన్, మున్సిపాలిటీ పాలకవర్గాల ఎన్నిక నేడే
కడప కార్పొరేషన్: ఎన్నికల ఫలితాలు వెలువడిన 51 రోజుల తర్వాత కడప నగరపాలకసంస్థతోపాటు జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలలో పాలకవర్గాలు గురువారం కొలువుదీరనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు కడప కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. అలాగే ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేల్, పులివెందుల మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరోక్ష పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల్లో సభ్యులు చేతులెత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు. కడప కార్పొరేషన్‌తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో గురువారం ఉదయం 11గంటలకు ప్రిసైడింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం మొత్తం సభ్యులలో 50 శాతం మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా భావించి ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే గంట పాటు వేచిచూసి మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు సెలవు రోజైనా సరే కోరం ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు.
అప్పుడు కూడా కోరం లేకపోతే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయి మూడవ సారి కోరం లేకపోయినా ఎన్నిక నిర్వహిస్తారు. కడప కార్పొరేషన్‌లో జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి మొదట కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. మున్సిపాలిటీలలో జిల్లా కలెక్టర్‌చే నియమితులైన ప్రిసైడింగ్ అధికారులు కౌన్సిలర్లచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఎన్నికకు గంటముందు తమ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయపార్టీలు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు పోటీ చేయబోయే వారి పేర్లను పొందుపరిచి బి. ఫారాలను ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. వారిలో ఒక్కొక్కరిని ఒక్కో సభ్యుడు ప్రతిపాదిస్తే మిగతా సభ్యులు చేతులెత్తి బలపరచాల్సి ఉంటుంది. మేయర్ ను ఎన్నుకున్న తర్వాతే డిప్యూటీ మేయర్‌ను, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకొన్న తర్వాతే వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాలి.
విప్ ధిక్కరిస్తే వేటే ..
రాష్ర్ట ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, బీజేపీ, సీపీఐలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. రిజిస్టర్డ్ పార్టీలకు, ఇండిపెండెంట్లకు ఈ అవకాశం ఉండదు. జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రజాప్రతినిధులకు విప్ జారీ చేశాయి. 1/3వ వంతు సభ్యులు పార్టీని ధిక్కరించి ఓటేస్తే అనర్హత వేటు పడదన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు.
పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం స్థానిక సంస్థలకు వర్తించదు. ఈ చట్టం ఎమ్మెల్యే, ఎంపీలకే పరిమితం. స్థానిక సంస్థల్లో ఎంతమంది విప్ ధిక్కరించి ఓటేసినా అందరిపైనా అనర్హత వేటు పడనుంది. విప్‌ను తీసుకోకుండా తిరస్కరించిన వారిపై కూడా అనర్హత వేటు పడనుంది. ఓటింగ్ సందర్భంలో విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే సభ్యత్వం రద్దవుతుంది గానీ ఓటు మాత్రం చెల్లుబాటు అవుతుంది. తమ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్ధి విప్‌ను ధిక్కరించాడని విప్ జారీచేసిన పార్టీనాయకుడు మూడు రోజుల్లోపు ఆధారాలతో ప్రీసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తే వారి సభ్యత్వం రద్దవుతుంది.
కీలకం కానున్న ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు
ఇరు పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్నప్పుడు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు కీలకం కానుంది. కడప కార్పొరేషన్‌లో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, కడప, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్‌బీ అంజద్‌బాషా, పి.రవీంద్రనాథరెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగుతోపాటు ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కూడా ఉన్నందున ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎక్కడ ఆప్షన్ ఇచ్చి ఉంటే అక్కడ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి దేవగుడి గ్రామంలో ఓటు హక్కు కలిగివున్నందున జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా కొనసాగే అవకాశం లేదు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాత్రం జమ్మలమడుగు మున్సిపాలిటిలోనే ఎక్స్ అఫిషియో సభ్యునిగా కొనసాగడానికి ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే పులివెందుల మున్సిపాలిటీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, రాయచోటి మున్సిపాలిటిలో స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జయరాములు, మైదుకూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు.
ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లంతా పార్టీ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ వరకూ రానున్నట్లు తెలిసింది.
ఎన్నిక జరిగే ప్రదేశం చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయి. కడపలో కార్పొరేషన్ కార్యాలయం మీదుగా రాకపోకలను నియంత్రించనున్నారు. వాహనాల పార్కింగ్ కూడా వేరొక చోటికి మార్చారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ప్రమాణ స్వీకారానికి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియోసభ్యులు మినహా తక్కిన వారెవరినీ అనుమతించరు. వారి బంధువులు, పార్టీనాయకులు, కార్యకర్తలు ఎన్నిక జరిగే ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిందే.
సభ్యుల ప్రమాణస్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ైచైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక మినహా ఎలాంటి చర్చలకు ఈ సమావేశాల్లో తావుండదు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తేదీ: మార్చి 30 ఫలితాలు ప్రకటించిన తేది: మే 12 ప్రమాణ స్వీకారం చేయు తేదీ: జూలై 3