మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు గైర్హాజరవుతాం
► బరి నుంచి తప్పుకున్న ముక్తియార్
► ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: సోమవారం జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు తనతోపాటు తన వర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం దొరసానిపల్లెలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎన్నిక బరిలో తాము ఉండటం లేదు అని చెప్పడానికి ఈ సమావేశం నిర్వహించాల్సి వచ్చిందన్నారు.
అలాగే బాధ్యాతాయుతంగా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం తమపై ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బి.ఫారంపై కౌన్సిలర్‌గా ఎన్నికైన వీఎస్ ముక్తియార్‌తోపాటు కొంత కాలం తర్వాత 9 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారని తెలిపారు. టీడీపీ నాయకులు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి మధ్య ఉండే వ్యక్తిగత విభేదాలతో మరో ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లను కూడగట్టుకుని మొత్తం 15 మందితో ముక్తియార్ తన వద్దకు వచ్చారని చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బి.ఫారంతో గెలిచిన ముక్తియార్ ఒక కారణం కాగా, తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా ముక్తియార్‌కు సహకరించామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన తన వెంట ఉన్న 9 మంది (తనతో కలిపి 10 మంది) ముక్తియార్ వెంట నడిచామన్నారు. ఆయన విజయానికి, నమ్మకానికి స్థిరంగా నిలువగలిగామని చెప్పారు.
రూ.50లక్షలు ఆఫర్ చేశారు : పోటీ తీవ్రతరం కావడంతో తన వద్దనున్న ఒక్కో కౌన్సిలర్ ఓటుకు రూ.50లక్షల వరకు వరదరాజులరెడ్డి ఇవ్వజూపారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. అయితే ఆ డబ్బును గడ్డిపోచతో సమానంగా భావించిన తమ కౌన్సిలర్లు నిజంగా అభినందనీయులన్నా రు. వరదరాజులరెడ్డి ఎన్ని ప్రలోభాలు పెట్టినా చి వరి వరకు ముక్తియార్‌కు మద్దతు ఇచ్చామన్నారు. అయితే ప్రేమో, భయమో, ఆశో, ప్రలోభమో తెలియదు కానీ... ఏ కారణం చేతనో ముక్తియార్ పోటీ నుంచి విరమించుకున్నారని పేర్కొన్నారు.
ఆ ముగ్గురే సమాధానం చెప్పాలి :
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బరి నుంచి ముక్తియార్ ఎందుకు విరమించుకున్నది ముక్తియార్‌తోపాటు ఇవి సుధాకర్‌రెడ్డి, మల్లేల లింగారెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. పోటీలో లేకపోతే కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీకి తగిన బలం లేని కారణంగా గైర్హాజరు కావాలని నిర్ణయించామన్నారు. ఎవరు గెలిచినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా ఎన్నిక జరగడమే ముఖ్యమని తెలిపారు. వరదరాజులరెడ్డిలా అల్లరిమూకలను వెంట వేసుకుని దౌర్జన్యకర, హింసాత్మక సంఘటనలకు పాల్పడబోమన్నారు.