మరికొన్ని రోజుల్లో ఆవిర్భవించబోతున్న కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ స్థానాలకూ, 17 లోక్‌సభ స్థానాలకూ బుధవారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్, పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్, మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 72 లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన 9 దశలలోనూ ఏడు దశలు ముగిసినట్టయింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవి. తమకు నచ్చిన పాలకులను తామే ఎన్నుకునే స్వేచ్ఛ ఈ ఎన్నికల ద్వారా పౌరులకు లభిస్తుంది. సుప్రీంకోర్టు పుణ్యమా అని ‘పోటీచేసే అభ్యర్థుల్లో ఎవరూ సమ్మతం కాద’ని తెలియజేసేందుకు వీలుగా ఈసారి ఈవీఎంలకు అదనపు మీట జోడించడంతో వోటు హక్కు మరింత సంపూర్ణత్వాన్ని సంతరించు కుంది. వోటు హక్కును ఎలాంటి ప్రలోభాలకూ లోనుకాకుండా వినియోగించుకోవాలని, మంచి అభ్యర్థులను ఎంచుకోవాలని ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఓటర్లను అభ్యర్థిస్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఈసారి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోమని అభ్యర్థించడం దగ్గరనుంచి ఓటేయవలసిన అవసరాన్ని చెప్పడం వరకూ పౌరుల్లో చైతన్యం కలిగించడానికి అన్నిరకాల ప్రసారమాధ్యమాల ద్వారా ఆయన కృషిచేశారు. ఓటర్లలో తలెత్తిన సందేహాలకు వివిధ వేదికలద్వారా సమాధానాలిచ్చారు.
కానీ, పోలింగ్ సరళిపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతుండగా జరిగిన ఒక ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలోకి ఒక్కసారిగా చొరబడి ఆయనతో జగడానికి దిగారు. హైదరాబాద్ నగరంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుని బయటికొచ్చాక తాను బీజేపీకి రెండు ఓట్లు వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడంపై అంతక్రితం భన్వర్‌లాల్ అభ్యంతరం వ్యక్తంచేయడమే వీరి గొడవకు మూలకారణం. భన్వర్‌లాల్ పరిధికి మించి మాట్లాడలేదు. చట్టంలో లేని నిబంధనలేమీ బాబుకు వర్తింపజేయాలనుకోలేదు. తాము ఎవరికి ఓటేశామో చెప్పడం సరికాదని ఆయనన్నారు. బ్యాలెట్ పత్రం ఉన్నరోజుల్లో ఓటేసి దాన్ని అందరికీ చూపించినట్టయితే అది చెల్లబోదని ప్రకటించేవారని, ఇప్పుడు ఈవీ ఎంలు గనుక అది సాధ్యంకాదుగానీ...ఇలా మాట్లాడటం మాత్రం సరైందికాదని భన్వర్‌లాల్ వివరించారు. ఇందులో అసంగతమైనదిగానీ, కనీవినీ ఎరుగనిదిగానీ ఏమైనా ఉన్నదా? ఒకవేళ తమ నాయకుడిని ఇలా వేలెత్తిచూపడం మహాపరాధమని టీడీపీ నేతలు అనుకుంటే ఆ మేరకు అభ్యంతరం చెబుతూ ఆయనకు లేఖ ఇవ్వొచ్చు. అలా చేయడం ఇష్టంలేకపోతే భన్వర్‌లాల్ ప్రకటనవల్ల బాబుకు పరువు నష్టం జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకోవచ్చు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా నాయకులు విలేకరుల సమావేశాలు నిర్వహించరాదని, అది ప్రచారం చేయడంతో సమానమవుతుందని ఎన్నికల సంఘం చాలా ముందుగానే ప్రకటించింది. రాజకీయ పార్టీలు, నాయకులు సహకరించాలని విజ్ఞప్తిచేసింది. కానీ, బాబు చేసిందేమిటి? ఓటేసి బయటికొస్తూ సరిగ్గా అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. తాను బీజేపీకి ఓటేశానని చెప్పడంతోపాటు ఇలా చేయడం దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని గంభీరమైన ప్రసంగం చేశారు. వోటు హక్కు గోప్యతతో కూడినది. ఎవరికి ఓటు వేశామో చెప్పరాదన్నది సామా న్యులకు సైతం తెలిసిన విషయం. ఎన్నికల రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం మాత్రమేగాక... తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మరో తొమ్మి దేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తికి ఈ మాత్రం ఎరుక లేకపోవడం చిత్రమే.
సావాసదోషమో ఏమోగానీ...బాబు ఇలావుంటే ఆయనతో కొత్తగా పొత్తు కలిపిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఓటేసి బయటికొచ్చాక విలేకరుల సమావేశంలో పార్టీ గుర్తు అయిన కమలం బొమ్మను ప్రదర్శించారు. విలేకరుల సాక్షిగా ఆ బొమ్మ పట్టుకుని తన సెల్‌ఫోన్‌తో ముచ్చటగా ఒక ‘సెల్ఫీ’ కూడా తీసుకున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం చురుగ్గా స్పందించింది. షోకాజ్ నోటీసు జారీ చేయడంకాక నేరుగా ప్రజాప్రాతినిధ్య చట్టంకింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయాలని రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు జరిగి, చివరకు న్యాయస్థానాల్లో ఏమవుతుందనేది వేరే చర్చ. కానీ, నరేంద్ర మోడీ బీజేపీలో సాధారణ నాయకుడు కాదు. ఆయన ఆ పార్టీకి ప్రధాని అభ్యర్థి. అచ్చం బాబులాగే నరేంద్ర మోడీ కూడా బ్యాలెట్ పోరులో కాకలు తీరిన యోధుడు. మూడు దఫాలనుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న నాయకుడు. అలాంటి వ్యక్తికి ఎన్నికల నిబంధనలుగానీ, చట్టాలుగానీ తెలియవనుకోలేము. తెలిసికూడా వాటిని ఉల్లంఘిస్తారని అసలే భావించలేము. సామాన్య పౌరులు లేదా పార్టీలోని సాధారణ కార్యకర్తలు అవగాహనా లోపంతో ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా ప్రవర్తించినప్పుడు బాబు, మోడీ స్థాయి నాయకులు వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలిగిస్తాయో చెప్పాలి. కానీ, ఆశ్చర్యకరంగా వారిద్దరూ అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. పొరపాట్లు ఎవరికైనా సహజం. వాటిని నిదానంగానైనా గ్రహించి సరిదిద్దుకోవడం మంచి లక్షణం. ఆ సంగతిని ఇరువురు నాయకులూ గుర్తిస్తారని ఆశిద్దాం.
అధినేతలు...ఉల్లంఘనలు!
Published Thu, May 1 2014 12:01 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement