సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది.
ఆ తర్వాత నుంచి అమల్లోకి ఆంక్షలు
హైదరాబాద్: సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. మావోయిస్టు ప్రభావిత అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుండగా... కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగతా 165 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాయంత్రం 6 గంటలకు ముగించేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత నుంచి ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. ప్రతీ నియోజకవర్గం పరిధిలో ఓటర్లు కాని బయటి వ్యక్తులు ఉండి ఉంటే, వారిని గుర్తించి అక్కడి నుంచి పంపించేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం హోటళ్లు, లాడ్జిలు, అతిధి గృహాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.