మాట మీద నిలబడే నాయకుడు కావాలి
సీమాంధ్ర ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎదగాలి. నాలుగేళ్లుగా తెలుగు నేల అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలంతా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. సీమాంధ్రలో జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. యువ నాయకత్వంతోనే మంచి రోజులొస్తాయని పారిశ్రామికవేత్తలంతా కోరుకుంటున్నారు. మాట మీద నిలబడే వ్యక్తితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అంటున్నారు హోలీమేరీ, నలంద విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, సప్ల ఆర్గానిక్స్ డెరైక్టర్ ఆరిమంద యామినీరెడ్డి. ఆమె మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) సీమాంధ్ర శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కోవె ద్వారా మహిళలను పరిశ్రమల వైపు ప్రోత్సహిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా యువ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని యామినీరెడ్డి చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
వైఎస్‌తో మంచి రోజులు వచ్చాయి..
2004కు ముందు రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య అతిస్వల్పం. వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాకే మంచి రోజులు వచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు స్థలాలు కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పుడు ఎందరో సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరం పెరుగుతుంది. 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిబ్బరంగా ఉన్నారు.
ఆ పాలన మళ్లీ రావాలి..
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైఎస్ బాటలు పరిచారు. ఉన్నత విద్యను సామాన్యుడి గుమ్మం ముందు నిలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అయితే కళాశాలలకు మాత్రం నాలుగేళ్లుగా నిధులు ఆలస్యంగా వస్తున్నాయి. వైఎస్ పాలన మళ్లీ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు మాఫీ అయితే వారికి పెద్ద ఊరటే.
జగన్‌తోనే సాగు-బాగు
సీమాంధ్రలో వ్యవసాయం ఎక్కువ. ఈ రంగాన్ని అర్థం చేసుకున్న నాయకుడే వ్యవసాయాధార పరిశ్రమలను ప్రోత్సహించగలడు. ఐటీ రంగం అంటూ బాబు వ్యవసాయాన్ని విస్మరించారు. వ్యవసాయానికి వైఎస్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వారసుడిగా జగన్ నాయకత్వంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. రెండు జిల్లాలకో వ్యవసాయ కళాశాల, ప్రాసెసింగ్ పరిశ్రమలు, అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు, రూ.3,000 కోట్ల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ఏటా ప్రత్యేక నిధి ఏర్పాటు హామీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. సామాన్యులకు రాజకీయాలు తెలియవు. వారికి కావాల్సిందల్లా కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకుడు. అండగా ఉంటాడన్న భరోసా వారు కోరుకుంటున్నారు. వైఎస్ అంటేనే 108, ఆరోగ్యశ్రీ. ఈ రెండూ పక్కాగా అమలవ్వాలని ప్రతి ఒక్కరి అభిలాష. మలి వయసులో అన్నం కోసం ఎవరూ చేయి చాచనక్కరలేదని జగన్ హామీ ఇస్తున్నారు. అవ్వా తాతలకు నెలకు రూ.700 పింఛను, వృద్ధాశ్రమాల స్థాపన హామీ ఆయన పెద్ద మనసుకు నిదర్శనం.