2న గుంటూరులో సోనియూ సభ
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడేలా కనిపించకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు చేతులెత్తేస్తున్నారు. అక్కడ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం, సమన్వయం తదితర బాధ్యతలన్నీ ఏపీసీసీ నేతలకే వదిలేశారు. పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సైతం ఈ ప్రాంతంలో ఒక్కొక్క సభకే పరిమితమవుతున్నారు. రాహుల్ ఈ నెల 30న హిందూపురంలో, సోనియూమే 2న గుంటూరులో సభలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రాహుల్, సోనియాలు రెండు దఫాలుగా ఏడు సభలు నిర్వహించినా సీమాంధ్రలో ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఒక్కొక్క సభకే పరిమితం కావడం విశేషం. వాస్తవానికి వీరిద్దరి సభల విషయంలో అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తిగా లేరు. ‘మా దగ్గర పరిస్థితి బాగోలేదు.. రావద్దు’ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. సోనియాగాంధీతో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురంలలో సభలు నిర్వహిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల నేతలతో చర్చించగా ఎవరి నుంచీ ఆశించిన స్పందన రాలేదు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రాబల్యమున్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కేంద్ర ం విశాఖలోనైనా సోనియాతో సభను నిర్వహించాలని అనుకున్నారు.
అయితే క్షేత్రస్థాయి నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడంతో జనసమీక రణ సాధ్యం కాదని నివేదికలందడంతో ఏపీసీసీ విశాఖ సభపై పునరాలోచనలో పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలు కాంగ్రెస్‌వే ఉండేవి. కానీ వలసలతో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇక, సోనియా, రాహుల్‌లు పాల్గొనే రెండు సభలకు జన స్పందన ఎలా ఉంటుందోననే ఆందోళన ఏపీసీసీ నేతలను వీడటం లేదు. పార్టీ అగ్రనేతలకే ఈ పరిస్థితి ఉంటే ఇక తామొచ్చి ఏం చేయగలుగుతామంటూ ఏఐసీసీలోని ఇతర సీనియర్లు సీమాంధ్రకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ఎన్నికల సమన్వయానికి గత కొద్దిరోజులుగా దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రులు గులాంనబీ అజాద్, వాయలార్ రవి, జైరాం రమేశ్, మునియప్ప తదితరులంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. తెలంగాణలో ఎన్నికలనే ప్రధానంగా భావిస్తూ అక్కడ పోలింగ్ ముగిసేవరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఆ తరువాత కూడా అక్కడే ఉండి సోనియా, రాహుల్ సభలను పర్యవేక్షిస్తారు. మరోపక్క సీమాంధ్రలో ప్రచారానికిగాను చిరంజీవికి పార్టీ ఖర్చుతో హెలీకాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు.