మళ్లీ కోడ్ మీరితే లగడపాటి అరెస్టు
సీఈవో భన్వర్‌లాల్ హెచ్చరిక
హైదరాబాద్: ఎన్నికలు జరగటానికి ముందుగా సర్వేల పేరుతో లగడపాటి తెలంగాణలో వీరు గెలుస్తారు, సీమాంధ్రలో వారు గెలుస్తారు అంటూ మీడియాకు ప్రకటనలు చేయటాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తప్పుపట్టారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లగడపాటి చర్యలను కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తూ లగడపాటికి నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం భన్వర్‌లాల్ విలేకరులకు తెలిపా రు.
తెలంగాణలో పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారు ఇంజన్‌లో కాలిన డబ్బులు పట్టుపడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఆ డబ్బు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కంపెనీకి చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, దర్యాప్తులో రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాకు రెండు మూడు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.