రెండు ఉపముఖ్యమంత్రి పదవులిస్తా
ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు
నెట్‌వర్క్: తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒకటి బీసీలకు, రెండోది కాపులకు ఇస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఆచంట, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు.. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, తుని, సామర్లకోట, రంపచోడవరంలలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేందుకు కృషిచేస్తామని, ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, సామాజిక న్యాయం కోసం బీసీలకు ఆమోదయోగ్యమైన రీతిలో కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాను దేశంలోకెల్లా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో ఐటీ కారిడార్ ఏర్పాటుచేయడంతో పాటు ఏలేరు ఆధునీకీకరణ, సుద్దగడ్డ ముంపు నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల రుణాల రద్దు, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవనభృతిగా రూ.5 వేలు, 100 కేజీల బియ్యం, సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దేనికైనా రెడీగా ఉండండి..: ‘ఈ ఎన్నికల్లో గెలవడం మనకు చాలా అవసరం. మీరు దేనికైనా రెడీగా ఉండండి. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలపై కక్ష తీర్చుకోండి. మీకు అండగా నేనుంటాను’ అంటూ చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియాగాంధీ ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసిందని పేర్కొన్న చంద్రబాబు ఇందులో తన ప్రమేయమేమీ లేదన్నారు. కేంద్రం సహకారం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అదుపు తప్పి మాట్లాడితే సైకిల్‌తో తొక్కించేస్తామని హెచ్చరించారు.