జంటనగరాల్లో పోలింగ్ అంతంతే!
తెలంగాణలో 70.85 శాతం
జంట నగరాల్లో 53 శాతమే
ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు చెల్లింపులు కోడ్ ఉల్లంఘనే
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంత చెప్పినా జంటనగరాల ఓటర్లు వినిపించుకోలేదు. ఎప్పటి తరహాలోనే ఈసారి ఎన్నికల్లో కూడా జంటనగరాల్లో ఓటు వేయడానికి రాలేదు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి పైగా జరిగినా, జంటనగరాల పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో 53 శాతానికి మించలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలు, ఆ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత, ఇప్పటి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం 53 శాతానికి మించలేదు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా రీ పోలింగ్ లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఈవీఎంలు మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పంపించనందుకు ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు మెమోలు జారీ చేశామని, పోలింగ్ శాతం గురించి కాదని ఆయన తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లింపులు చేపట్టాలని గతంలో ఆదేశాలు జారీ చేశామని, నియమావళి అమల్లో ఉండగా చెల్లింపులు జరపడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లు స్వాధీనం చేసుకుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీ నివారించేందుకు, సంబంధిత ఫిర్యాదులను స్వయంగా స్వీకరించేందుకు ఆదివారం నుంచి రెండు ఫోన్ నంబర్లు ఇస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
సీమాంధ్ర పోరుకు సర్వం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న (బుధవారం) పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భన్వర్‌లాల్ తెలిపారు. 90 శాతం పైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాల్సిందిగా సీమాంధ్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ స్థానాల్లో 2,243 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎస్‌ఎంఎస్, రేడియో, సినిమా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిషేధమని భన్వర్‌లాల్ స్పష్టంచేశారు.
తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో నమోదైన పోలింగ్ వివరాలు
లోక్‌సభ స్థానం 2009 2014
పోలింగ్ శాతం పోలింగ్ శాతం
ఆదిలాబాద్ 76.32 73.49
పెద్దపల్లి 68.62 71.56
కరీంనగర్ 65.89 73.55
నిజామాబాద్ 66.53 71.51
జహీరాబాద్ 74.54 76.00
మెదక్ 76.00 77.92
మల్కాజ్‌గిరి 51.43 51.19
సికింద్రాబాద్ 54.88 53.28
హైదరాబాద్ 52.47 52.52
లోక్‌సభ స్థానం 2009 2014
పోలింగ్ శాతం పోలింగ్ శాతం
చేవెళ్ల 64.47 60.08
మహబూబ్‌నగర్ 67.54 71.30
నాగర్ కర్నూలు 69.97 75.00
నల్లగొండ 73.76 79.01
భువనగిరి 76.13 80.99
వరంగల్ 69.21 76.46
మహబూబాబాద్ 78.59 80.58
ఖమ్మం 81.68 80.00
మొత్తం 68.71 70.85