- విజయోత్సవాలపేరిట కవ్వింపు చర్యలు
- వైఎస్సార్ సీపీ శ్రేణుల ఇళ్ల ఎదుట హంగామా
- బైక్‌లపై చక్కెర్లు కొడుతూ రగడ
- పోలీసులకు ఫిర్యాదుచేసిన ఎంపీటీసీ సభ్యుడు
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : టీడీపీ శ్రేణులు బరితెగిస్తున్నాయి. గెలుపు ఉత్సాహంతో వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాయి. బైక్‌లపై చక్కెర్లు కొడుతూ, బాణ సంచా పేలుస్తూ పల్లె వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ దుందుడుకు చర్యలతో పెనమలూరు నియోజకవర్గంలో హింసా రాజకీయ వాతావరణం ఏర్పడుతుందేమోనని జనం బిక్కుబిక్కుమంటున్నారు.
ముదునూరు, ఉయ్యూరులో రగడ
పెనమలూరు నుంచి టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఎన్నికల నిబంధనల మేరకు విజయోత్సవాలు నిర్వహించరాదు. ఇందుకు భిన్నంగా బోడె అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఎక్కడబడితే అక్కడ బాణసంచా పేలుస్తూ, బైక్‌లపై చక్కెర్లు కొడుతూ హోరెత్తించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, కార్యాల యాలు, వ్యాపార సంస్థల ముందుగా పదేపదే పర్యటించి కవ్వింపులకు పాల్పడ్డారు.
మండలంలోని ముదునూరులో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కగ్గా కోటేశ్వరమ్మ దుకాణం ఎదుట శుక్రవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు బైక్‌లపై తిరుగుతూ, కవ్వించారు. ఈ గోలను తట్టుకోలేక కోటేశ్వరమ్మ ఉయ్యూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉయ్యూరు దళితవాడలోనూ ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
అధికార పగ్గాలు చేపడుతున్న క్రమంలో బాధ్యతగా మెలగాల్సిన టీడీపీ నాయకులు అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీ శ్రేణులు తప్పు చేస్తే మందలించాల్సిన నాయకులు తిరిగి కౌంటర్ ఫిర్యాదులు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన దుకాణం ఎదుట హంగామా సృష్టించి, దూషించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ముదునూరు ఎంపీటీసీ సభ్యురాలు కోటేశ్వరమ్మ దంపతులతో స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరితే.. తమను కోటేశ్వరమ్మ కులం పేరుతో దూషించారంటూ టీడీపీ కార్యకర్తలు కౌంటర్ ఫిర్యాదు చేశారు. టీడీపీ శ్రేణుల తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉందని స్థానికులు ఎద్దేవాచేస్తున్నారు.
కార్యకర్తల జోలికెళితే ఖబడ్దార్
వైఎస్సార్ సీపీ కార్యకర్తల జోలికెళితే ఎవరినైనా ఊరుకునేది లేదని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు హెచ్చరించారు. ఆయన శనివారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ప్రజాతీర్పును తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారని, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో నడుచుకుంటున్నారని తెలి పారు. టీడీపీ విజయోత్సవాలు జరుపుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల ఎదుట హంగామా సృష్టిస్తూ కవ్వింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోదని లేదని స్పష్టం చేశారు.