పరిషత్‌లో ‘సైకిల్’దే పైచేయి | tdp josh in local body elections | Sakshi
Sakshi News home page

పరిషత్‌లో ‘సైకిల్’దే పైచేయి

Published Wed, May 14 2014 4:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పరిషత్‌లో ‘సైకిల్’దే పైచేయి - Sakshi

 ఎంపీటీసీల్లో గట్టి పోటీ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమి

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రాదేశిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించింది. జిల్లాలో మొత్తం 44 జడ్పీటీసీలు, 619 ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ స్థానాలను తెలుగుతమ్ముళ్లు కైవసం చేసుకున్నారు. టీడీపీకి వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమి గట్టిపోటీనే ఇచ్చింది. జడ్పీటీసీల విషయంలో కొంత వెనుకబడినా, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి దీటుగానే ఆ రెండు పార్టీలు గెలుపొందాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ స్థానాల పరంగా మూడోస్థానంలో నిలిచింది.

సీపీఐ తన ఉనికిని చాటుకోగా, రెండు వర్గాలుగా చీలినప్పటికీ న్యూడెమొక్రసీ సత్తాను చాటింది. తనదైన శైలిలో 3 జడ్పీటీసీ, 30 ఎంపీటీసీ స్థానాలలో గెలుపొందింది. ఇక టీఆర్‌ఎస్ ఒక్క ఎంపీటీసీ స్థానానికే పరిమితమయింది. ఇండిపెండెంట్లు 19 స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి చైర్‌పర్సన్‌గిరీకి అవసరమైన స్థానాలు దక్కినట్టే. కాంగ్రెస్ 10 స్థానాలలో, వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమి7 చోట్ల విజయం సాధించగా, న్యూడెమోక్రసీ, సీపీఐలు కూడా జడ్పీలో ప్రాతినిధ్యం దక్కించుకున్నాయి. ఇక టీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం జడ్పీటీసీల్లో ఖాతా తెరవలేకపోయాయి.
 
 ఎవరికెన్ని స్థానాలు....
 జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు మినహా 44 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అందులో అత్యధిక స్థానాలను టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. మొత్తం 22 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ పదిచోట్ల, వైఎస్సార్‌సీపీ ఐదు స్థానాల్లో, న్యూడెమొక్రసీ మూడుచోట్ల, సీపీఎం రెండు, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి.

చండ్రుగొండ జడ్పీటీసీ ఫలితం అర్ధరాత్రి సమయానికి కూడా వెల్లడి కాలేదు. ఇక్కడ టీడీపీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. ఎంపీటీసీల విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 640 ఎంపీటీసీ స్థానాలకు గాను 625 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. పోలవరం ముంపునకు నిరసన తెలపడంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని ఎంపీటీసీలకు ఎన్నికలు జరగలేదు. 625 స్థానాల్లో  ఆరు ఏకగ్రీవం కాగా, 619 స్థానాల్లో  పోలింగ్ జరిగింది. ఇందులో టీడీపీకి 241, వైఎస్సార్‌సీపీకి 108, కాంగ్రెస్‌కు 102 స్థానాలు లభించాయి. సీపీఎంకు 75, సీపీఐకి 43 స్థానాలు దక్కగా, న్యూడెమోక్రసీకి 30, ఇండిపెండెంట్లకు 19 స్థానాలు లభించాయి.
 
 ఆరుగురు సిట్టింగ్‌లకు ఎదురుదెబ్బ

 నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఐదుగురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకోగా, మరో ఐదుగురుకి మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. భద్రాచలం, వైరా, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక స్థానాల్లో గతంలో ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలు ఆశించిన స్థాయిలో స్థానాలను సాధించలేకపోయాయి.  భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుండగా అక్కడ ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని కూడా ఆ పార్టీ సాధించలేకపోయింది.

పినపాకలో కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా, అశ్వారావుపేటలో ఖాతా తెరవలేకపోయింది. మాజీ మంత్రి రాంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులో మూడుచోట్ల టీడీపీ గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, సీపీఐ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న వైరా, కొత్తగూడెంలలో ఆ పార్టీ బోణీ కొట్టలేదు. రెండు నియోజకవర్గాల్లోని జడ్పీటీసీలను టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలు దక్కించుకున్నాయి. భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న  మధిరలో  ప్రాదేశిక ఎన్నికలలో  మెరుగైన ఫలితాలు సాధించారు కానీ  ప్రత్యర్థి పార్టీలు చుక్కలు చూపించాయి. ఇక ఖమ్మం నియోజకవర్గం పరిధిలోనికి వచ్చే రఘునాథపాలెంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఇల్లెందులో రెండు స్థానాలు కాంగ్రెస్, రెండు న్యూడెమోక్రసీకి దక్కాయి. సత్తుపల్లిలో మాత్రం తెలుగుదేశం పార్టీ మెరుగైన ఫలితాలను సాధించింది.
 
 టీడీపీదే జడ్పీ పీఠం!

 అత్యధిక జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ   జడ్పీచైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ పార్టీలోని వర్గవిభేదాలు జిల్లా రాజకీయాన్ని ఎలాంటి మలుపుతిప్పుతాయనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇరువర్గాలు రెండు క్యాంపులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.  ఏకాభిప్రాయం సాధ్యం కాని పక్షంలో జిల్లా రాజకీయం రసకందాయంలో పడనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
 ఎంపీటీసీల్లో నువ్వా నేనా
 ఎంపీటీసీ స్థానాల్లో టీ డీపీకి అత్యధిక స్థానాలు ద క్కగా, వైఎస్సార్‌సీపీ, సీపీఎంలు కూడా మెరుగైన ఫలితాలను సాధించాయి. టీడీపీకి మొత్తం 241 స్థానాలు దక్కగా, వైఎస్సార్‌సీపీకి 108,  సీపీఎంకు 75 స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్లు 19 చోట్ల విజయం సాధించగా, సీపీఐ 43 చోట్ల, న్యూడెమోక్రసీ 30 స్థానాల్లో విజయం సాధించాయి. మొత్తం మీద టీడీపీ కన్నా వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమికి కేవలం 58 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే తగ్గడం గమనార్హం.
 
 పార్టీల వారీగా జడ్పీటీసీ స్థానాల వివరాలు:

 టీడీపీ-కారేపల్లి, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, నేలకొండపల్లి, కొణిజర్ల, కల్లూరు, వాజేడు, వెంకటాపురం, చర్ల, కూనవరం, విఆర్.పురం, అశ్వాపురం, పాల్వంచ, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, సత్తుపల్లి, ఏన్కూరు, తల్లాడ, కూసుమంచి, పెనుబల్లి, వేంసూరు (22) కాంగ్రెస్ - గార్ల, జూలూరుపాడు, తిరుమలాయపాలెం, ముదిగొండ, చింతకాని, మధిర, పినపాక, టేకులపల్లి, కొత్తగూడెం, కామేపల్లి (10) వెఎస్సార్‌సీపీ - వైరా, ఎర్రుపాలెం, చింతూరు, ములకలపల్లి, బూర్గంపాడు (5)న్యూడెమోక్రసీ - గుండాల, ఇల్లెందు, బయ్యారం. (3)సీపీఎం - బోనకల్, దుమ్ముగూడెం (2)సీపీఐ-మణుగూరు(1)
 
 చంద్రుగొండ ఫలితం రావాల్సి ఉంది. కుక్కునూరు, వేలేరుపాడులో ఎన్నికలు జరగలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement