పెడన రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొంది, పార్టీ ఫిరాయించి పెడన మండల పరిషత్ అధ్యక్షురాలిగా టీడీపీ తరఫున ఎన్నికైన జన్ను భూలక్ష్మిపై అనర్హత వేటు పడింది. వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ జారీ చేసి పార్టీ విప్‌ను ధిక్కరించి ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేసి, పార్టీ ఫిరాయింపు చట్టంను అనుసరించి అనర్హురాలిగా ప్రకటిస్తూ సీపీవో వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. భూలక్ష్మికి అనర్హత ఉత్తర్వులను పోస్ట్ ద్వారా పంపినట్లు సీపీవో తెలిపారు.
ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో మండలంలోని నందిగామ ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈమె టీడీపీ అభ్యర్థి జన్ను వరలక్ష్మీపై 431 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పెడన మండలంలో ఉన్న మొత్తం పది స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఆరుగురు ఎంపీటీసీలు, టీడీపీ తరఫున నలుగురు ఎంపీటీసీ సభ్యులు గెలుపొందారు.
అసలు జరిగింది ఇదీ..
పెడన మండల పరిషత్‌కు జూలై 4న ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థిగా చేవేండ్ర ఎంపీటీసీ సభ్యుడు రాజులపాటి అచ్యుతరావును పార్టీ నిర్ణయించింది. వైఎస్సార్ సీపీ తరఫున నందిగామ ఎంపీటీసీగా గెలుపొందిన జన్ను భూలక్ష్మి పార్టీ విప్‌ను ధిక్కరించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ జారీ చేసిన విప్‌ను ఆమె ధిక్కరించారు. ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీ సభ్యుల బలాలు సమానమయ్యాయి.
దీంతో ఎన్నికల అధికారి, సీపీవో వెంకటేశ్వర్లు లాటరీ పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా టీడీపీ తరఫున ఎంపీపీ అభ్యర్థిగా జన్ను భూలక్ష్మి ఎంపికయ్యారు. ఈ పరిణామంతో జన్ను భూలక్ష్మి తమ పార్టీ విప్‌ను ధిక్కరించారని, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.రఘునందనరావుకు ఉప్పాల రాంప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై వివరాలు సేకరించిన అనంతరం పెడన ఎంపీపీపై అనర్హత వేటు వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పెడన ఎంపీపీపై అనర్హత వేటు
Published Thu, Aug 28 2014 1:21 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement