జమ్మలమడుగులో రీపోలింగ్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 80, 81, 82 పోలింగ్ కేంద్రాల్లో (అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు) రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారుల సిఫారసులు, ఇతర పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల అభ్యంతరాలు లేకుండా దేవగుడి గ్రామంలోని ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నేరుగా నిర్ణయించడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని పార్టీ పేర్కొంది. రీపోలింగ్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పీఎన్‌వీ ప్రసాద్ ఈ మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావుకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు.
‘ఈనెల 7న పోలింగ్ సందర్భంగా ఈ కేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ ఏజెంట్ల నుంచి గానీ, పోలింగ్ అధికారి నుంచి గానీ, సెక్టార్ అధికారి నుంచి గానీ, మైక్రో అబ్జర్వర్ నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవు. అరుునప్పటికీ ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించడం అప్రజాస్వామికం. దీనిపై కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాం’ అని అందులో పేర్కొన్నారు.
అనంతరం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎందుకు నిర్ణయించాల్సి వచ్చిందో ఈసీ పేర్కొనలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నాం. ఇది కచ్చితంగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే. ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా రీపోలింగ్ నిర్ణయూన్ని కమిషన్ పునస్సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని చెప్పారు.
అది అప్రజాస్వామికం
Published Mon, May 12 2014 12:46 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement