కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో అప్పుడే చర్చలు, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
సాక్షి, తిరుపతి : కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయనే విషయమై తెలుగుదేశం పార్టీలో అప్పుడే చర్చలు, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. శుక్రవారం ఎన్నికల ఫలితాలు ఒక వైపు వెలువడుతుండగా మరోవైపు కౌంటింగ్ హాళ్లలో నేతల మధ్య ఈ రకమైన చర్చలు జరిగాయి. అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవిని అలంకరించనున్నారు.
ఈయన గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టేవారు. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని చెబుతున్నారు. అనుభవం, కులాల సమీకరణల్లో శ్రీకాళహస్తి నుంచి ఎన్నికైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని పదవి వరించడం ఖాయంగా చెబుతున్నారు. రెండో పదవి కూడా ఇవ్వాల్సి వస్తే ఎస్సీల నుంచి సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తలారి ఆదిత్యను వరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
మూడు పదుల వయస్సు కూడా లేని ఆదిత్య ఉన్నత విద్యావంతుడు. దీంతో పాటు జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పూతలపట్టు, గంగాధరనెల్లూరు నుంచి పోటీ చేసిన లలితా థామస్, కుతూహలమ్మ గెలిచి ఉంటే వీరిలో ఒకరిని మంత్రి పదవి వరించేదని, వీరి ఓటమితో ఇప్పుడు ఎస్సీల నుంచి ఆ అవకాశం ఆదిత్యకు దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
జిల్లాలో బలిజ సామాజికవర్గం నుంచి సత్యప్రభ, ఎం.వెంకరమణ చిత్తూరు, తిరుపతి నుంచి ఎన్నికయ్యారు. బలిజలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే మహిళల కోటా కూడా కలిసివచ్చేట్టుగా సత్రప్రభకు అవకాశం ఉంటుంది. తంబళ్లపల్లె నుంచి ఎన్నికైన శంకర్‌యాదవ్ యాదవ సామాజికవర్గానికి చెందినవారు. ఒకవేళ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే శంకర్ ను అదృష్టం వరించవచ్చని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ శ్రేణుల్లో మంత్రి పదవులపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.