తొలిపోరు ప్రశాంతం
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: స్పల్ప ఘటనలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తొలివిడత పోలింగ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 258 ఎంపీటీసీ, 21 జెడ్పీటీసీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమేణా 11 గంటలకు ఊపందుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా లెక్క చేయక పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం తర్వాత కొంత నెమ్మదిగా సాగినా సాయంత్రానికి 77.88గా నమోదయింది.
నార్త్‌రాజుపాళెం, బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు, కోవూరు, వింజమూరు తదితర మేజర్ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులుదీరి కనిపించారు. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, బోగోలు మండలం కోవూరుపల్లిలో 5 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూలో ఉండడంతో వారిని అనుమతించారు. ఈ క్రమంలో పోలింగ్ 6 గంటల వరకు కొనసాగింది.
మొత్తంగా 7,04,671 మంది ఓటర్లకు గాను 5,50,660 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వేశారు. అత్యధికంగా కావలి మండలంలో 88.34 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా వరికుంటపాడులో 60.46 శాతంగా నమోదయింది.
చెదురుమదురు ఘటనలు
అల్లూరు మండలంలోని మత్స్య కారగ్రామాలు, ఉదయగిరి, మర్రిపాడు మండలాల్లో కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు చోటుచేసుకోగా పోలీసులు చెదరగొట్టారు. కొడవలూరు మండలం యల్లాయపాళెంలో ఎస్సై వెంకటరమణ, ఓటర్లకు మధ్య వివాదం చెలరేగింది. ఓటర్లతో ఎస్సై దురుసుగా వ్యవహరించడంతో సమస్య జటిలమైంది. సీఐ గంగావెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు.
జలదంకి మండలం చామదలలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో గంటసేపు పోలింగ్ ఆగింది. అక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ చౌడేశ్వరి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి పోలింగ్‌ను కొనసాగేలా చూశారు. అనంతసాగరం మండలం లింగంగుంటలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఏఎస్‌పేట మండలం కావలి యడవల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.
కోవూరులో తారుమారైన గుర్తు
కోవూరు-1 సెగ్మెంట్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి ముసలి విజయకుమారికి అధికారులు నీటి కుళాయి గుర్తును కేటాయించారు. బ్యాలెట్ పేపర్‌లో మాత్రం చేతిపంపును ముద్రించడంతో ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ శ్రీకాంత్ ఎన్నికల కమిషనర్‌కు సమాచారం అందించారు. వారి సూచన మేరకు ఈ సెగ్మెంట్‌లో 11వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
బ్యాలెట్ పేపర్ల గల్లంతు
బోగోలులోని 28వ నంబర్ బూత్‌లో 100 బ్యాలెట్ పేపర్లు గల్లంతయ్యాయి. వీటిని ఓ పార్టీ కార్యకర్తలు తస్కరించారని ప్రచారం జరిగింది. అయితే అధికారులు పోలింగ్‌ను కొనసాగించడంపై ఏజెంట్లు, కొందరు ఓటర్లు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన రీపోలింగ్ నిర్వహిస్తామని జెడ్పీ సీఈఓ జితేంద్ర తెలిపారు. మొత్తం మీద పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.