శిబేరాలు | Camp Politics | Sakshi
Sakshi News home page

శిబేరాలు

Published Fri, Jul 4 2014 1:04 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

శిబేరాలు - Sakshi

శిబేరాలు

  • నేడు ఎంపీపీఅధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
  •  ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  •  టీడీపీకి 20, వైఎస్‌ఆర్‌సీపీకి 10 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ
  •  9 స్థానాల్లో హంగ్
  •  స్వతంత్రులే కీలకం
  •  జోరుగా క్యాంపు రాజకీయాలు
  • మండల పరిషత్ అధ్యక్ష పీఠాల కోసం క్యాంప్ రాజకీయాలు జోరందకున్నాయి. మెజార్టీ ఎంపీపీ స్థానాలను దక్కించుకోడానికి పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారాన్ని ఎరగా చూపి ఇతర పార్టీల వారిని తమవైపునకు తిప్పుకోడానికి టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది.
     
    విశాఖ రూరల్ : జిల్లాలో 39 మండల పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం జరగనుండడంతో.. స్వతంత్రులతో పాటు నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీటీసీలను దారికి తెచ్చుకొని ఎంపీపీ పీఠాలను అధిరోహిం చాలని క్యాంపులు నడుపుతోంది. ప్రధానంగా నర్సీపట్నంలో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోడానికి పెద్ద శక్తులే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆయా మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక  అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.
     
    స్వతంత్రులే కీలకం

    జిల్లాలో టీడీపీ 20, వైఎస్‌ఆర్‌సీపీ 10 ఎంపీపీలను దక్కించుకోనున్నాయి. మిగిలిన 9 మండలాల్లో హంగ్ ఏర్పడింది. మునగపాక, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి, నర్సీపట్నం, కొయ్యూరు, హుకుంపేట, జి.మాడుగుల, కె.కోటపాడుల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పీఠాలు దక్కించుకోడానికి పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. హంగ్ ఏర్పడిన స్థానాల్లో ఇండిపెండెంట్లే కీలకం. మునగపాక, అరకుల్లో  టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలకు చెరి సగం ఎంపీటీసీలు దక్కడంతో ఇక్కడ టాస్ వేయనున్నారు.

    మిగిలిన ఏడింట ఇండిపెండెంట్లు, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ఎవరివైపు మొగ్గుతారో ఆ పార్టీకే పీఠాలు దక్కనుండడంతో ఆ దిశగా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గుర్తింపు పార్టీగా అవతరించడంతో విప్ జారీ చేసే అవకాశం కలిగింది. దీంతో ఒకవేళ ఆ పార్టీ ఎంపీటీసీలకు వల వేసినా విప్ కారణంగా వారిపై బహిష్కరణ వేటు పడుతుంది. దీంతో ఆ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు తప్పా.. ఒరిగేదేమి ఉండదని భావించి ఆ ప్రయత్నాలను మానుకుంది.
     
    క్యాంపులే క్యాంపులు
     
    క్యాంపు రాజకీయాలు చేస్తున్న టీడీపీకి కూడా రెబెల్స్ బెడద పట్టుకుంది. హుకుంపేటలో 15 ఎంపీటీసీలకు వైఎస్‌ఆర్‌సీపీ 4, టీడీపీ 6, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 4 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ టీడీపీ ఆరుగురిలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ వర్గం కాగా మరో ముగ్గురు కుంబా రవిబాబు గ్రూపునకు చెందిన వారు.

    ఇక్కడ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తమ వర్గంవారితోపాటు స్వతంత్రులతో రవిబాబు విశాఖలో శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం. నర్సీపట్నంలో 9 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్‌ఆర్‌సీపీ 4, టీడీపీ 3, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. ఇక్కడ ఇండిపెండెంట్ల మద్దతు కోసం వారితో క్యాంపు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అనంతగిరిలో 14 ఎంపీటీసీలకు వైఎస్‌ఆర్‌సీపీ 4, టీడీపీ 4, సీపీఎం 1, అయిదు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు.

    దీంతో  ఇండిపెండెంట్లతో క్యాంప్ నిర్వహిస్తూ టీడీపీ మంతనాలు జరుపుతోంది. జి.మాడుగులలో 15 స్థానాలకు వైఎస్‌ఆర్‌సీపీ 4, టీడీపీ 6, కాంగ్రెస్ 3, సీపీఎం, ఇండిపెండెంట్ చెరొకటి స్థానాలను దక్కించుకున్నారు. ఇక్కడ టీడీపీకి వ్యతరేకంగా మిగిలిన పార్టీలు ఏకమై చెరో రెండున్నర ఏళ్లు ఎంపీపీ అధ్యక్ష పీఠాలను అధిష్టించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కె.కోటపాడులో కూడా టీడీపీ స్వతంత్రులతో శిబిరం నిర్వహిస్తోంది. మొత్తంగా మెజార్టీ హంగ్ స్థానాలను దక్కించుకోడానికి టీడీపీ ప్రయత్నిస్తుండగా, కొన్ని చోట అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతుండడం విశేషం.
     
    విప్ ధిక్కరిస్తే వేటే


    విప్ ధిక్కరించే అభ్యర్థులపై వేటు పడనుంది. ఎవరైనా ఆయా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పక్షంలో మూడు రోజుల్లో ప్రిసైడింగ్ అధికారికి విప్ అధికారమున్న వ్యక్తి ఫిర్యాదు చే యాల్సి ఉంటుంది. దానిపై ఆఫీసర్ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ సదరు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. నామమాత్రంగా నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సభ్యుని వివరణ ఎలా ఉన్నప్పటికీ.. అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఎన్నికల సంఘానికి సమాచారమందిస్తారు. దీంతో ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement