మండల పరిషత్ లో ప్రలోభాల పర్వం | Voices in the period of such | Sakshi
Sakshi News home page

మండల పరిషత్ లో ప్రలోభాల పర్వం

Published Fri, Jul 4 2014 2:15 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

మండల పరిషత్ లో ప్రలోభాల పర్వం - Sakshi

మండల పరిషత్ లో ప్రలోభాల పర్వం

మండల పరిషత్ పీఠాలు దక్కించుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. గెలుపు అవకాశం లేని కొన్ని మండలాల్లో తెరచాటు రాజకీయాలు సాగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు దిగటం, కొందరిని ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేయటం, మరికొందరిని ఓటింగ్‌కు రాకుండా చేయటం కోసం ఆర్థిక సర్దుబాటు చేయటం వంటి నీచ రాజకీయాలు చేస్తూ పల్లె రాజకీయాలను కలుషితం చేస్తోంది. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది.
 
సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : జిల్లాలో ఎంపీటీసీ స్థానాలను అధికార పార్టీకి పోటాపోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జిల్లాలోని 49 మండలాల్లో మొత్తం 812 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అధికార టీడీపీ 468 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 328 స్థానాలు గెలుచుకుంది. రెండు పార్టీలూ దాదాపు 15 మండలాల్లో మెజార్టీకి దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పరిషత్ అధ్యక్ష పదవులే లక్ష్యంగా బరితెగించి ప్రలోభాలకు తెరతీసింది.

స్వతంత్ర అభ్యర్థుల్ని భారీ మొత్తానికి కొనుగోలు చేయటంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు వల విసురుతోంది. దీంతో పల్లెల్లో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నియోజకవర్గాల్లో ఈ ప్రలోభాలు సాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీటీసీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. రెండు రాజకీయ పార్టీలూ ఇప్పటికే తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు విప్‌ను కూడా తీసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారు. జిల్లాలో ప్రధానంగా అవనిగడ్డ, గన్నవరం, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది.
 
ప్రలోభాలు ఇలా...

పెడన మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆరు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగా నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. స్థానిక టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేసి నందిగామ ఎంపీటీసీ జన్ను భూలక్ష్మితో టీడీపీకి ఓటు వేయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మరో ఎంపీటీసీ కోసం అన్వేషిస్తున్నారు. ఉయ్యూరు మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు టీడీపీ, రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.

ఇద్దరు స్వతంత్రులు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నేతలు వారిని తమవైపు తిప్పుకొనే యత్నాల్లో నిమగ్నమయ్యారు. బాపులపాడు మండలంలో 24 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరో 12 స్థానాలు గెలుపొందాయి. ఈ క్రమంలో రెండు రాజకీయ పార్టీలు విప్‌లు జారీ చేశాయి. వీరవల్లి ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మాచినేని లలిత పార్టీ విప్‌ను తీసుకోలేదు. మరోవైపు టీడీపీ నేతలు ఇక్కడ ప్రలోభాల పర్వం సాగిస్తున్నారు. అవనిగడ్డలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాలుగు స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్, ఐదు స్థానాలు టీడీపీ దక్కించుకున్నాయి.

మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ స్వతంత్రుల కొనుగోలుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మొవ్వలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8, టీడీపీ 6, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. ఈ క్రమంలో కోసూరు ఎంపీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కిలారపు మంగమ్మను ప్రలోభాలకు గురిచేశారు. దీంతో ఆమె గురువారం సాయంత్రం టీడీపీలో చేరింది.
 
ఎంపీపీల ఎన్నిక నేడే

జిల్లాలోని 49 మండల పరిషత్‌ల పాలకవర్గాలు నేడు కొలువు తీరనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 26 మండలాల్లో టీడీపీ పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి మెజార్టీని సాధించింది. వైఎస్సార్ సీపీ 13 మండలాల్లో పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు మండల పరిషత్ పాలకవర్గాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఆయా పార్టీలు తమ ఎంపీటీసీ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. అధికారపక్షమైన టీడీపీ వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులకు వల వేసి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఎంపీటీసీ సభ్యులకు విప్ ఇచ్చే అవకాశం లేకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మండల పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొనటంతో టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలు ఎంపీటీసీ సభ్యులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement