పొన్నాల ఇలాకాలో ‘గులాబీ’ పాగా | trs hawa in janagama constituency | Sakshi
Sakshi News home page

పొన్నాల ఇలాకాలో ‘గులాబీ’ పాగా

Published Wed, May 14 2014 4:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పొన్నాల ఇలాకాలో ‘గులాబీ’ పాగా - Sakshi

 జనగామ, న్యూస్‌లైన్: జనగామ నియోజకవర్గంలో గులాబీ గుబాలించింది. గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే సత్తా చాటింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు పరాభవాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో మొత్తం 67 ఎంపీటీసీ ఐదు జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో టీఆర్‌ఎస్ 35 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 20 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, బీజేపీ ఐదు, టీడీపీ రెండు, ఇండిపెండెంట్లు ఐదు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నారు.  జనగామ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండ గా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు చెరో 5 స్థానాలు, ఒకటి టీడీపీ గెలుచుకుంది. ఎంపీపీ కావాలంటే మరొక ఎంపీటీసీ మద్దతు అవసరం.

టీడీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రాధాన్యత నెలకొంది. బచ్చన్నపేట మండలంలో13 ఎంపీటీసీ స్థానాలకు 3 కాంగ్రెస్, టీఆర్‌ఎస్ 7, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నారు. నర్మెట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 2, టీడీపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకటి గెలుచుకున్నారు. చేర్యాల మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్‌ఎస్ 12, బీజేపీ, కాంగ్రెస్‌లో చెరో 3, ఇండిపెండెంట్లు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. మద్దూరు మండలం కాంగ్రెస్‌కు కొంత ఊరట నిచ్చింది. ఇక్కడ 11 ఎంపీటీసీ స్థానాలుండగా 7 కాంగ్రెస్, 3 టీఆర్‌ఎస్, 1 ఇండిపెండెంట్ గెలుపొందారు. మొత్తంగా చూస్తే టీఆర్‌ఎస్‌కు చేర్యాల, నర్మెట, బచ్చన్నపేట మండలాలు భారీ మెజారిటీ కట్టబెట్టగా జనగామ మండలంలో హోరాహోరీ పోరు నెలకొంది.
 
 నాలుగు జెడ్పీటీసీ స్థానాలు...
 నియోజకవర్గంలో 5 మండలాలుండగా.. అందులో టీఆర్‌ఎస్ నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. జనగామ జెడ్పీటీసీగా టీఆర్‌ఎస్‌కు చెందిన బాల్దే విజయ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కొత్త కరుణాకర్‌రెడ్డిపై 1965 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. విజయకు 11,472 ఓట్లు పోల్‌కాగా కవితకు 9,507 ఓట్లు వచ్చాయి. చేర్యాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సుంకరి రజిత తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి తాడెం రంజితపై 3,885 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. సుంకరి రజితకు 15,100 ఓట్లు, తాడెం రంజితకు 11,252 ఓట్లు పోలైనాయి. నర్మెటలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గద్దల పద్మ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కల్యాణం లలితపై 4,279 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పద్మకు 11,942 ఓట్లు, లలితకు 7,663 ఓట్లు పోలయ్యాయి. బచ్చన్నపేట మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల స్వప్న తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గిరిబోయిన భాగ్యలక్ష్మిపై 4,142 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. స్వప్నకు 12,943 ఓట్లు, గిరబోయిన భాగ్యలక్ష్మికి 8,801 ఓట్లు పడ్డాయి. మద్దూరు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి నాచగోని పద్మ వెంకటేష్ తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి బోయిని లక్ష్మిపై 1,660 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. పద్మకు 10,138 ఓట్లు, లక్ష్మికి 8,478 ఓట్లు వచ్చాయి.  
 
 నాలుగు ఎంపీపీ స్థానాలు..
 ఈ ఫలితాలతో నాలుగు ఎంపీపీ స్థానాలను కూడా టీఆర్‌ఎస్ కైవసం చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట మండలాల్లో సంపూర్ణ ఆధికత్య ఉండగా జనగామ మండలంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు చేరి సగం ఎంపీటీసీ స్థానాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ గానుగుపహాడ్‌లో టీడీపీ అభ్యర్థి కొర్ర కవితకాల్‌రాం గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థే ఎంపీపీ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే ఆమెతో సంప్రదించి టీఆర్‌ఎస్ నాయకులు తమ వైపు తిప్పుకున్నట్లు తెలిసింది. ఇటీవలే ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి ఎన్నికల అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దాసరి రవి (మరిగడి) స్థానంతోపాటు తన సతీమణి సరిత(వెంకిర్యాల) ఎంపీటీసీగా గెలుపొందింది. దీంతో దాసరి రవి ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement