హస్తానికి ఆధిక్యం
పుంజుకున్న టీఆర్‌ఎస్
* జనగామలో పొన్నాల లక్ష్మయ్యకు చేదు ఫలితాలు
* ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటే కాంగ్రెస్‌కు
* సొంతూరు ఖిలాషాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి
*టీటీడీపీ కీలక నేత ఎర్రబెల్లికి ఇదే పరిస్థితి
* పాలకుర్తి సెగ్మెంట్‌లో టీడీపీకీ ఒకటే జెడ్పీటీసీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చాటింది. అరుుతే మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఆ పార్టీకి కొంత ఊపు తగ్గింది. పరిషత్ ఎన్నికల పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి బాగా పుంజుకుంది. జిల్లాలో 50 జెడ్పీటీసీ, 705 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం జెడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవమైనవి మినహాయించి 701 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11న ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నిర్వహించారు.
అధికారుల ప్రణాళిక లేమితో ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యంగా సాగింది. అభ్యర్థులు అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్న ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 24, టీఆర్‌ఎస్‌కు 18, టీడీపీకి 6 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. బీజేపీకి ఒక జెడ్పీటీసీ దక్కింది. తాడ్వాయిలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సాధారణ ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందుగా వెలువడిన ఈ ఫలితాలపై జోరుగా చర్చ జరుగుతోంది. పరిషత్
ఫలితాలు జిల్లాలోని ముఖ్యనేతలకు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చాయి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఆధిక్యం కనబరిచింది. జనగామ నియోజకవర్గం పరిధిలోని ఐదు జెడ్పీటీసీల్లో నాలుగు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. జనగామ, చేర్యాల, నర్మెట, బచ్చన్నపేటలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. మద్దూరు జెడ్పీటీసీగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. మొత్తంగా పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. అంతేకాకుండా పొన్నాల లక్ష్మయ్య సొంత ఊరు ఖిలాషాపూర్‌లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలోని ఈ గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఎంపీటీసీగా గెలిచారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సైతం పరిషత్ ఫలితాలు ప్రతికూలంగానే వచ్చాయి. ఎర్రబెల్లి సొంత నియోజకవర్గం పాలకుర్తిలోని ఐదు జెడ్పీటీసీల్లో టీడీపీకి ఒక్కటే దక్కింది. ఎర్రబెల్లి సొంత ఊరు పర్వతగిరిలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. ఈ మండలం జెడ్పీటీసీ సైతం టీఆర్‌ఎస్‌కే దక్కింది.
టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంచార్జిగా ఉన్న నర్సంపేటలో ఈ పార్టీకి ఒక్క జెడ్పీటీసీ సీటు కూడా రాలేదు. టీఆర్‌ఎస్ అనుకూల పరిస్థితుల్లోనూ గులాబీ పార్టీ సీటు గెలుచుకోకపోవడం గమనార్హం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డికి అనుకూల ఫలితాలు రాలేదు. మొత్తం ఆరు జెడ్పీటీసీల్లో రెండు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. నాలుగు జెడ్పీటీసీలను కాంగ్రెస్ దక్కించుకుంది.
ములుగు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే సీతక్కకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలోని మొత్తం ఏడు జెడ్పీటీసీలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులు ఎక్కడా గెలవలేదు. ఐదు జెడ్పీటీసీలను కాంగ్రెస్ గెలుచుకుంది. ములుగు మండలంలో టీఆర్‌ఎస్, తాడ్వాయిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య పూర్తి స్థాయిలో అధిక్యం కనబరిచారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీలు స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఇక్కడ ఎంపీటీసీల్లోనూ టీఆర్‌ఎస్ మెజారిటీ సీట్లను దక్కించుకుంది.
పరకాల నియోజకవర్గంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నాలుగు జెడ్పీటీసీలు ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు రెండు, టీడీపీ, కాంగ్రెస్‌లు ఒక్కొక్కటి గెలుచుకున్నాయి.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గం భూపాలపల్లిలో ఆరు జెడ్పీటీసీలకుగాను మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ ఒక్కటి చొప్పున దక్కించుకున్నాయి. ములుగు ఘనపురం విషయంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో వివాదం మొదలైంది. ఈ ఫలితం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లోని ఫలితాల లెక్కింపు ఆలస్యమైంది. అర్ధరాత్రి 12 గం టల వరకు ఉన్న పరిస్థితి ప్రకారం డోర్నకల్ నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీల్లో కాం గ్రెస్ ఆధిక్యంలో ఉంది. మహబూబాబాద్ సెగ్మెంట్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడి నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది.